ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యడ్ల హనుమంతూ సామాజిక స్పృహా

"నేను మంచి సామాజిక స్పృహతో నిండిన కొన్ని కథలు రాసానోయ్"అంటూ నా గదిలోకి వచ్చి కూర్చున్నాడు యడ్ల హనుమంతు మరే ఉపోద్ఘాతమూ లేకుండా. 

"ఏమిటవి?" అని అడిగాను ఈ ప్రశ్న అడగటం అంటే యడ్ల హనుమంతు అనే  కొరివితో నా బుర్ర గోక్కోవటమే అని తెలిసినా. 

ఏమాత్రం మొహమాటం లేకుండా మొదలుపెట్టేశాడు వాడు. 

"ఈ కథ పేదవారి నిస్సహాయతపై ధనికులు ఆడుకునే ఆట గురించి. అంటే మూర్తి లాంటి వెధవల గురించి అన్నమాట. (మూర్తి మా ఇంటి ఓనర్. ఏమాట కామాట. చాలా మంచివాడు!). ఒక కుటుంబరావు కి అయిదుగురు కూతుళ్ళూ ఒక కొడుకూ నూ. బడిపంతులు గా రిటైర్ అయిన అతనికి ప్రతిదినమూ అతికష్టం మీద గడుస్తూ ఉంటుంది. కొడుకింకా పదో క్లాసే చదువుతుండటం వలన కుటుంబ భారమంతా కుటుంబరావు మీదే . ఆ లోపున అతని మూడో కూతురిని పెళ్లి చేసుకోవటానికి ఒకడు ఒప్పుకుంటాడు. కానీ ఆ దుర్మార్గుడు మూడు లక్షల రూపాయల కట్నం అడుగుతాడు. కట్నం ఇవ్వలేక కుటుంబరావు కాబూలీ వాలా దగ్గరికి వెళ్తే 'నీకూతురిని రాత్రికి పంపు. డబ్బిస్తా'అంటాడు. అవమానంతో ఆ పంతులు ఆత్మహత్య ..... "అని హనుమంతు ఆవేశంతో చెప్పుకుపోతుంటే - 

"ఆగాగు" అన్నాను. 

చాలా అయిష్టంతో కథ ఆపినా అతని కథ వింటున్న వాడిననే గౌరవంతో కోపం అణుచుకుని "ఏమైంది?"అని అడిగాడు హనుమంతు. 

"ఏంలేదు. చిన్న అనుమానం. కుటుంబరావు తన ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బావులేనపుడు అంతమంది పిల్లలని ఎందుకు కనటం?"అన్నాను. 

ఓ క్షణం ఆలోచించి "ఏముంది? ఆ కాలంలో ఫామిలీ ప్లానింగ్ ఇంకా వాడుకలోకి రాలేదనుకో"అన్నాడు చాలా తేలిగ్గా. 

"నాకు తెలిసినంత వరకూ ముప్పై ఏళ్ల క్రితం నుంచి కనీసం చదువుకున్న వారికి ఫామిలీ ప్లానింగ్ ప్రాముఖ్యత తెలుసు. పైగా కుటుంబరావు బడిపంతులని కూడా అంటున్నావు. అతనే నలుగురికీ ఫామిలీ ప్లానింగ్ గురించి చెప్పవలసిన మాట"అన్నాను. 


యడ్ల గాడు ఏదో అనబోతుంటే ఆపి మరోవిషయం. కుటుంబరావు రిటైరయ్యే సమయానికి కొడుకు పదో క్లాసు చదువుతున్నాడన్నావు. వాడు ఎన్ని సార్లు (నీలాగా) పరీక్షలో డింకీలు కొట్టినా మహా అయితే ఇరవై ఏళ్ళ వయసులో ఉంటాడు. అంటే కుటుంబరావు వాడిని నలభై ఏళ్ళ వయసులో కన్నాడన్న మాట. అంత లేటుగా పిల్లల్ని కనటం బుద్దితక్కువ పని కాదూ? తన స్తోమతకి సరిపోయేలా జీవించటం ఎలాగో ప్లాన్ చేసుకోని కుటుంబరావు కట్నం అడిగిన వియ్యంకుడినీ కూతుర్ని అవమానించిన కాబూలీ వాలా నీ తిట్టుకుని ఆత్మ హత్య చేసుకోవటంలో అర్ధం లేదనిపిస్తోంది"అన్నాను. 

హనుమంతు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తర్వాత "ఒక పేద బడిపంతులికి జరిగిన అన్యాయం గురించి ఆలోచించకుండా వేరే విషయాలకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు."అన్నాడు. 

నేను మాట్లాడలేదు. అప్పటికే నా తప్పు అర్ధమయ్యింది. యడ్ల హనుమంతు గాడికి నలుగురు ఆడపిల్లలు. వాడి పెళ్ళానికి ఇపుడు కడుపు. నేను కుటుంబ నియంత్రణ గురించి అన్న మాటలు వాడిని బాధించి ఉండాలి. పైగా నేను కూడా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు వీడి కథని విమర్శిస్తున్నానేమో అనే అనుమానం కూడా కలిగింది. అందుకే వాడిని మరేమీ అనకుండా మౌనంగా ఉండిపోయాను. 

"నమస్కారం ఖడేరావుగారూ  గారూ!"అంటూ లోపలికి వచ్చాడు మా ఇంటి ఓనర్ మూర్తి. 

"అమ్మయ్య"అనుకుని "రండి. సమయానికి వచ్చారు. యడ్ల హనుమంతు తను రాసిన కథలు వినిపిస్తున్నాడు"అన్నాను. 

" అలాగా ! చాలా  మంచిది. కానీ నాకిప్పుడు కుదరదు లెండి. పనుంది. మిమ్మల్ని రాత్రి భోజనానికి పిలవటానికి వచ్చాను. కొంచెం ముందు వచ్చేయండి. కబుర్లు చెప్పుకోవచ్చు"అంటూ హడావుడిగా వెళ్లిపోయాడాయన. 

మూర్తి మా ఇంటికి పది సార్లు వస్తే హనుమంతు ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళడు. అందుకు కారణం మా ఇద్దరి కులాలూ ఒకటి కావటమనే అంటాడు హనుమంతు. ఎందుకంటే వాడు ఆధునిక మేధావి. అంటే కేవలం వాడి సిద్ధాంతం తప్ప ఎదురుగా కనపడే నిజాలని చూడడు. అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు వీడు ఒకవైపే మెడవంకర రోగం ఉన్నవాడిలా చూస్తూ ఉంటాడు. వీడి విప్లవ సుత్తి భరించే ఓపిక నాకున్నట్టు మూర్తికి లేదనే విషయం వాడికి అర్ధం కాదు. 

నేననుకున్నట్టే మూర్తి వెళ్ళగానే "పీడ వదిలింది"అని తన అక్కసు బైట పెట్టుకున్నాడు వాడు. నాకిది మామూలే కనుక విని ఊరుకున్నాను. 

"సరే కట్నాల సమస్య గురించి ఓ కథ రాసాను. వింటావా?" అని అడిగాడు హనుమంతు. 

"చెప్పు" అన్నాను ఏడుపు గొంతుతో. 

"ఒక పరంధామయ్య ఉన్నాడు. అతనికి ...... ఒకే కూతురు (ఒకే కూతురని చెప్పి ఈసారి జాగ్రత్త పడ్డాడు). సగటు గుమాస్తా పరంధామయ్య తన ఆశలన్నీ ఒక్కగానొక్క కూతురి మీదే ఉంచుకుని ఏ డాక్టరుకో ఇంజనీర్ కో ఇచ్చి పెళ్లి చేయాలని కల కనే వాడు. చివరికి ఒక డాక్టర్ సంబంధం వచ్చింది. అతని తండ్రి "మాకు కట్నం ఏమీ అక్కర్లేదండీ. కానీ మా వాడిని డాక్టర్ చెయ్యటానికి ఏభయి లక్షలు డొనేషన్ ఇచ్చాను. ఆ డబ్బు ఇచ్చేస్తే చాలు."అన్నాడు వినయంగా. అతను కట్నం అడుగుతాడని ఊహించని పరంధామయ్య ఆత్మ హత్య ...... 

"ఒరేయ్ చాలు ఆపు"అన్నాను కోపంగా. ముందు చెప్పిన కథకీ ఈ కథకీ ఏమీ తేడా లేదు, పైగా రెండు కథలలోనూ ఒక పాత్ర ఆత్మహత్య చేసుకోవటం మరే పరిష్కారమూ లేనట్టు. 

"మళ్ళీ ఏమయ్యింది?"అని అడిగాడు హనుమంతు కోపంగా. 

"ఏమిట్రా ఈ కథ? పరంధామయ్యకి ఇంజనీర్, డాక్టర్ తప్ప ఎవరూ ఆనరా? డాక్టరు తండ్రి తన కొడుకు కోసం పెట్టిన ఖర్చు వియ్యంకుడి నుంచి రాబట్టలనుకోవటం ఎంత అసహ్యంగా ఉందో, పరంధామయ్య తన కూతురికి ఇంజనీరో డాక్టరో తప్ప భర్తగా పనికి రారనుకోవటం అంత అసహ్యంగానూ ఉంది"అన్నాను. 

హనుమంతు బరువుగా నిట్టూర్చాడు. 

"నీకు నా కథలు అర్ధం కావురా. ఎందుకంటే నీలో సామాజిక స్పృహ లేదు. అందుకే మూర్తిలా  ఎప్పుడూ అభ్యుదయానికి వ్యతిరేకమైన దేవుడి పూజలు చేసుకుంటూ లోకంలో ఏం జరుగుతోందో పట్టించుకోని బూర్జువా వెధవలు మీద నీకు కోపం కూడా రాదు. నేనింకా నా కథలలో కూలీలని కొట్టే బడాబాబుల గురించీ, కుల వ్యామోహంతో కుళ్ళిన సమాజం గురించీ చెప్పాలనుకున్నాను. కానీ అనవసరం! నీకవి అర్ధం కావు" బాధగా అన్నాడు వాడు. 

నా రక్తం మరిగిపోయింది. కుల వ్యామోహం నిరసించే పేరుతొ వీడు తన కులం గురించే రోజుకి ఇరవై అయిదు గంటలు ఆలోచిస్తాడు. వాడిని మొత్తం లెక్కలతో వాయించేద్దును గానీ కానీ ఎందుకో ఈరోజు భరించాలని అనిపించింది. 

"సరేరా. మరో కథ చెప్పు"అన్నాను ప్రాణాలకి తెగించి. 

వాడు అంతా మర్చిపోయి ఉత్సాహంగా మొదలెట్టేసాడు. 

"ఓ ధనవంతుడు .... (అంటే వీడే విలన్ అయుంటాడు) సామానుతో రైలు దిగుతాడు. రైల్వే కూలీ తో అరగంట బేరమాడి తన పది పెట్టెలూ టాక్సీ స్టాండ్ కి తీసుకెళ్ళటానికి ఏభయి రూపాయలిస్తానన్నాడు. ఆకలితో మాడిపోతున్న ఆ అమాయక రైల్వే కూలీ అందుకు వప్పుకుంటాడు. తీరా చూస్తే ఒక పెట్టె కవర్ చిరిగి ఉంటుంది. ఆ కవర్ కూలీ వాడే చింపాడనుకుని కోపంతో ఆ ధనవంతుడు కూలీని చితక్కొట్టి డబ్బులివ్వకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ కవర్ చింపింది తన మనవాడే అని ఆ ధనవంతుడికి తెలుస్తుంది. కానీ అప్పటికే దెబ్బల బాధకి ఆ అమాయక కూలీ మరణిస్తాడు. ఈ పెట్టుబడి దారి సమాజంలో బీదల పాట్లు ఇంతే ........ "

ఈసారి వాడి కథకి అడ్డు రాకుండా పూర్తి కథ విన్నాను.  కథ విన్నాక కోపం కూడా రాలేదు. నామీద నాకే జాలి కలిగి 'పాపం నేను' అనుకున్నాను. "అసలేమిటి వీడి ఉద్దేశం?ఇలాంటి పచ్చి అబద్దాలని విని అద్భుతమైన కథలని మెచ్చుకునేటంత చవటలా కనిపిస్తున్నానా? అసలే బెంగాల్ లో ఏడేళ్లుగా బతుకుతున్న వాడిని. నాకు ఈ సామాజిక స్పృహ అనే పదమంటేనే మంట. ఈరోజు వీడికిలా దొరికిపోవడం నా దురదృష్టం. 

నాకు తెలిసి రైల్వే కూలీ పది పెట్టెలు మోయటానికి కేవలం ఏభయి రూపాయలే తీసుకోవటం ఎప్పుడూ చూడలేదు. ఒకసారి బేరం జరిగాక డబ్బులివ్వకపోవటం, పైగా రైల్వే కూలీ ని కొట్టటం --- ఇదంతా జరిగే పనే కాదు. ఇక బెంగాల్ లో అయితే మా సామాను మా చేతిలోనే ఉంటుంది. కానీ కూలీలకు డబ్బులిచ్చేయ్యాలి. వాళ్ళు మోసినా 'బాబూ ఆ పెట్టె కాస్త జాగ్రత్తగా దింపు నాయనా!'అంటే ఆ పెట్టె ఇంకాస్త మొరటుగా విసురుతాడు బెంగాలీ బడుగు జీవి. అలా అని అందరూ అలాగే అనుకోవటానికి లేదు. ఏది చెప్పినా ఆ చెప్పేది సహజంగా ఉండాలి. ఈ కథలో కూలీ రైల్వే వాడు కాకుండా ఉంటే మరికొంచెం నమ్మదగేలా ఉండేదేమో! నిజమేమిటంటే దుర్మార్గం అన్ని వర్గాలలోనూ ఉంది. కేవలం చదువుకున్న వాళ్ళూ, ధనవంతులూ. ఒక కులం వాళ్ళూ దుర్మార్గులనకుండా అన్ని వర్గాలలోని లొసుగులనీ చెప్తే బావుంటుంది. ఆ విషయమే హనుమంతుగాడితో చెప్పాను. 

వెంటనే వాడి ముఖం ఎర్రబడింది. "నీకలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తెగ చదివావు కదా! ఉన్న మతి పోయింది. నువ్వు, మూర్తి మీ అందరిలోనూ బూర్జువా లక్షణాలు పేరుకుపోయాయి.  ఆరోజుల్లోనే పేదలని, స్త్రీలనీ అన్యాయం చేసిన ఎన్నో దృష్టాంతాలు ఉన్న పురాణాలు చదివి అందరినీ మోసం చేస్తూ బతికేస్తున్నారు. పేదల ఆకలి గురించి మీకేం తెలుసు?" అన్నాడు ఆవేశంగా. 

"ఇంట్లో కూర్చుని రోజుకి వంద కథలు ఊహించి రాసే నీకు మాత్రం పేదల ఆకలి గురించి నీకు మాత్రం ఏంతెలుసు?"అని నేను కూడా కొంచెం ఆవేశంగా అనేసరికి వాడు కొంచెం తగ్గాడు.

"అది కాదురా. సమస్యని అన్ని కోణాల్లోనూ చూడాలి. బెంగాల్ లో ..."

"బెంగాల్ నాకు నచ్చింది. అక్కడ మనిషి మనిషి లా బతుకుతాడు" అన్నాడు వాడు. 

"చక్కటి అభిప్రాయం. కానీ నీ దృష్టిలో మనిషంటే ఎవడు? పేదవాడూ, చదువుకోని వాడూ నీ కులం వాడూనా?"అన్నాను. హనుమంతు మొహం ఎర్రబడింది. 

"నా మాటలు అర్ధం చేసుకోరా. బలహీనుల మీదా, బడుగువర్గాల మీదా నాకేమీ కోపం లేదు. కానీ బెంగాల్ లో నా అనుభవాలు వేరేగా ఉన్నాయి. అంటే నువ్వనుకున్నట్టే కాకా ఇంకొకలా కూడా ఉండచ్చన్న మాట. అందుకే నువ్వు మనుషులని ఇంకా లోతుగా గమనించి ఇంకా పుస్తకాలు చదివి కథలు రాస్తే బావుంటుంది. భారతంలోనే అన్యాయాలు ఉన్నాయి. రామాయణంలో ఒకరినే అగ్ని పరీక్ష కోరారు అని మాటిమాటికీ ఆ అంశాలనే ఉటంకించుకుంటూ  ఈరోజు వాస్తవాలకు సంబంధించని చెత్త రాయకు. ఇంకో వెయ్యేళ్ళ తర్వాత కూడా ఆ గ్రంధాలలో కథలు అవే ఉంటాయి.  కానీ మన ముందు వాస్తవాలు మారుతూనే ఉంటాయి. అందుకని వాటిని గమనించి రాయటం ముఖ్యం. " అని నేను చెప్తుంటే కోపంగా లేచిపోయాడు హనుమంతు. 

"నీ లాంటి బూర్జువా గాడి మాటలు నేనెందుకు వినాలి ? విప్లవం గురించి ఆలోచించేవారికి నా మాటలు అర్ధం అవుతాయి. "అంటూ వెళ్ళిపోయాడు. పండగ సెలవులు హాయిగా గడపాలనుకున్న నాకు వాడు వెళ్ళిపోవటం ఎంతో హాయి నిచ్చింది. 

***

రాత్రి మూడు గంటలకి కాలింగ్ బెల్ మోగింది. నేను మేడమీద గదిలో ఉన్నా ఇంటి కింద తలుపు రాత్రి పూట మూసేస్తారు కనుక ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వస్తే తలుపు నేనే తెరవాలి. ఇంత రాత్రి చంపటానికి వచ్చిన ఆ చింపాంజీ గాడు ఎవడా అని తిట్టుకుంటూ తలుపు తీస్తే ఎదురుగా నా పాత స్నేహితుడు నటరాజు కనిపించి వీడికి నా ఇల్లెలా తెలిసింది? ఎందుకింత రాత్రి వచ్చాడు ? అని ఆశ్చర్యపోయాను. 

వాడు కూడా "ఇది నీ ఇల్లేనా? "అన్నాడు గానీ వాడి గొంతులో ఆశ్చర్యం కన్నా చాలా రిలీఫ్ కనబడింది. 

"ఇది నా ఇల్లే గానీ నువ్వేమిటి ఈ టైం లో?"అన్నాను వాడికి దారిస్తూ. 

అప్పుడు వాడి సహజమైన ఏడుపు గొంతుతో చెప్పాడు వాడు. 

"నేనిక్కడ బామ్మర్ది ఇంటికని  వచ్చాన్రా. ఆ ఇల్లు ఏదో రీడింగ్ రూమ్ కి ఎదురుగానే ఉందని వాడు చెప్పాడు. సులువైన అడ్రస్ కదా అని రిక్షావాడికి చెప్పి ఎక్కితే వాడు రిక్షా తొక్కుతూనే ఉన్నాడు గానీ ఎంతసైపైనా మేం చేరాల్సిన చోటు రావటం లేదు. నగలూ డబ్బులతో ఉన్నామని భయంతో ఇక్కడ ఏదో ఇల్లుంది కదా ఒకసారి కనుక్కుందామని వచ్చాను. తీరా ఇది మీ ఇల్లే"

వీడి ఏడుపు గొంతుకి మేలుకొవొచ్చి నా వెనకే వచ్చిన హనుమంతు కళ్ళు పెద్దవి చేసి "రీడింగ్ రూమ్ కొత్త రోడ్డులో ఉంది. దొంగవెధవ మద్దిలపాలెం ఎందుకు తీసుకొచ్చాడు?పదండి తేలుద్దాం "అంటూ బైటికి వచ్చాడు. 

అక్కడ రిక్షాకి అనుకుని తాపీగా బీడీ కాల్చుకుంటున్న రిక్షావాడి చెంప చెళ్లుమనిపించి "ఏరా. తప్పుడు అడ్రస్ కి తీసుకెళ్లి దోచేద్దామనుకున్నావా?"అని అరిచాడు హనుమంతు. 

నిర్ఘాంతపోయిన రిక్షా వాడు "నాకేం తెల్సు బాబూ! రీడింగ్ రూమ్ ఇటేపే కదా! .... "అని చెప్పబోతుంటే ఆవేశంతో వాడి చెంపలు రెండూ వాయించాడు యడ్ల హనుమంతు. 

"ఇంకా నాటకాలాడతావట్రా. ముందు కదులిక్కడనుంచి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. "అని అరిచాడు. 

రిక్షా వాడు కిక్కురుమనకుండా ఒక చేత్తో చెంపని పట్టుకుని వెళ్ళిపోయాడు. 

"మీరేం కంగారు పడకండి సార్! ఆ వెధవ ఈ ఛాయల్లో కనపడదు"అన్నాడు హనుమంతు గంభీరంగా. అందరం లోపలకి నడిచాం. 

***

హాయిగా కమ్మటి కలలు కంటూ పడుకున్న నాకు ఏవో కేకలు వినిపిస్తే మెలుకువొచ్చింది. కిటికీ లోంచి చూస్తే మనోహరమైన దృశ్యం కనిపించింది. హనుమంతు ఇంటి ముందు కనీసం ఏభై మంది నించుని ఉంటే వారందరికన్నా ముందు ఉన్న ఒక ఎర్ర చొక్కా వాడు "ఎవడ్రా వాడు? మా వాడిని కొట్టింది? ... నా కొడుకుని బైటికి రమ్మను. ఈ ఛాయలకి రావద్దంటాడా? ఇదేమైనా వీడి జాగీరా?"అని అరుస్తున్నాడు.  గోడకి అవతల చెదురుమదురుగా ఉన్న రిక్షాలని చూస్తే విషయం అర్ధమయ్యింది. 

"పోలీసులకి అప్పజెప్తానన్నాడటగా? అంత తప్పు మావాడేం చేసాడు?"అని అరుస్తున్నాడు నాయకుడు. 

హనుమంతు ఇంట్లోంచి ఏమీ శబ్దం లేదు. అందరూ మంచాల కిందా బీరువాల వెనకా దాక్కున్నారు కాబోలు. 

నేను మంచం మీద సగం లేచి విలాసంగా చూస్తున్నాను. వీళ్లంతా హనుమంతు గాడిని నాలుగు తంతే చూడాలనే కోరిక ఎక్కడో ఉంది కాబోలు. కొత్త రోడ్ దగ్గర ఉన్న రీడింగ్ రూమే ఎక్కువ మందికి తెలుసనీ మద్దిలపాలెంలో ఒక మూల ఉన్న రెండో రీడింగ్ రూమ్ మాలాంటి వాళ్లకి కూడా తెలియదనే విషయం బైటికి వెళ్లి వారికి చెప్పాలని అనిపించలేదు. 

నెమ్మదిగా గోల పెరిగిపోతోంది. రోజంతా గోలగా తిరిగే హనుమంతుగాడి పిల్లలతో సహా ఎవరినుంచీ ఎటువంటి శబ్దమూ లేదు. కొంపతీసి పోయారా? 

వాళ్ళు ప్రతినిముషం హనుమంతు గాడిని తిట్టే తిట్లు విలాసంగా వింటూ "ఒరేయ్ యడ్ల హనుమంతూ. నీ రోజు బాలేదు రా" అని నవ్వుకుంటుంటే మూర్తి గారు బైటి నుంచి రావటం కనిపించింది. 

హయ్యో, వీళ్ళు మూర్తి గారినేమైనా చేస్తే నేను కూడా కొన్ని తన్నులు తిందామనుకుని మెట్లు దిగాను. 

అప్పటికి లోపలికి వచ్చిన మూర్తి అక్కడ నుంచున్న వారినుద్దేశించి "ఎవరు కావాలి బాబూ" అని అడిగాడు ఎంతో ప్రశాంతంగా. అంతవరకూ అగ్నిపర్వతాల్లా మండిపోతున్న రిక్షా వాళ్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు.

"అయినా అలా ఎండలో నిల్చున్నారేమిటి ? ఇలా అరుగు మీదికి రండి. మంచి నీళ్లు కావాలా?"అన్నాడాయన. 

అతనంత మర్యాదగా ఆప్యాయంగా మాటాడుతుంటే ఏమనాలో తెలియక నీళ్లు నమిలాడు రిక్షా వారి నాయకుడు. 

"ఇంతకీ ఎవరి కోసం వచ్చారో చెప్పలేదు" అన్నాడు మూర్తి 

అప్పుడు నోరు తెరిచి "నా పేరు అనిల్ అండీ. మా సంఘానికి నాయకుడిని. ఈ ఇంట్లోనే ఎవడొనండీ వాడి పేగులు తోడేస్తాను . నిన్ననే కొత్తగా చేరిన మా తోటి రిక్షా వాడిని కొట్టాడట. ఆడికి కొత్తరోడ్డు దగ్గర రీడింగ్ రూమ్ తెల్వక ఇటేపున్న రీడింగ్ రూమ్ కి ఎవరో పాసెంజర్ ని తీసుకొస్తుంటే వాడి గూబ గుయ్యి మనిపించి గెంటేసారండీ"అన్నాడు. 

నేను కూడా గొంతు సవరించుకుని "అవునండీ. నిన్న హనుమంతు వీళ్ళ మనిషిని కొట్టాడు" అన్నాను.

"అయ్యో ఎంత పని పొరబాటు జరిగింది? ఆయనపొరబడినట్టున్నాడు. నేను మాటాడతాలెండి" అని మూర్తి హనుమంతు ఇంటి తలుపు తట్టాడు. రెండు మూడు సార్లు తలుపు కొట్టిన తర్వాత లోగొంతుతో "ఎవరూ?"అని అడిగాడు హనుమంతు. 

"నేనండీ హనుమంతు గారూ. మీకేం భయం లేదు బైటికి రండి"అన్నాడు మూర్తి. 

అప్పుడు సగం తెరిచిన తలుపు వెనక నుంచుని వణికిపోతూ బైటికి వచ్చాడు హనుమంతు. 

"నాకొడుకు ఆడ దానిలా లోపల దాక్కున్నాడు" అని ఎవరో అరుస్తుంటే అనిల్ వారించాడు. 

హనుమంతు బైటికి రాగానే "ఏమయ్యా మావాడిని కొట్టావట పెద్ద మొనగాడిలా? ఏం తప్పు చేసాడు? " అని అడిగాడు అనిల్. 

హనుమంతు నోటమాట రాలేదు. 

"పోలీసులకి అప్పజెప్తానన్నావట?"

అయినా హనుమంతు కిక్కురుమనలేదు. 

అనిల్ మూర్తి వైపు తిరిగి "చూడండి సార్! నిన్న మావాడు ఒంటరిగా దొరికితే విషయం తెలుసుకోకుండా చెంపలు వాయిస్తున్నపుడున్న పొగరంతా ఏమయిపోయింది ?"అంటూ పక్కన ఉమ్మేసాడు. తన ముఖం పైనే ఉమ్మేసినట్టు అవమాన పడిపోయాడు హనుమంతు. 

మూర్తి సిసలైన కార్మిక నాయకుడిలా ఉన్న అనిల్ భుజం మీద చేయి వేసి "పోనీలే బాబూ జరిగిందేదో జరిగింది. ఆయన తప్పయిపోయిందంటున్నాడు. ఆ అబ్బాయికి ఇతని చేత క్షమాపణ చెప్పిస్తాను"  అన్నాడు. 

అనిల్ ఆశ్చర్యం ప్రకటిస్తూ "అదేమిటి సార్ అలా అంటారు? తప్పేమీ లేకుండా దవడ వాయించి క్షమించమని ఒక మాట చెపితే సరిపోతుందా? మా వాడికి ఇప్పటికే తలంతా దిమ్ముగా ఉండి పనికి పోవటం లేదు. కళ్ళు తిరుగుతున్నాయంటున్నాడు. వైద్యానికి కనీసం రెండు మూడు వేలవుతుందంటున్నారు డాక్టర్ " అన్నాడు. 

అప్పుడు నేను కల్పించుకుని "సరేలే వైద్యానికి ఎలాగూ రెండూ మూడూ కలిపి అయిదు వేలు ఇస్తాడు లేవయ్యా. కొట్టినందుకు వైద్యం ఎలాగూ చేయించాలి. ఇక అతని చేత క్షమాపణ చెప్పించేస్తే సరిపోతుంది'" అన్నాను. 

అయిదు వేలు అంత సులువుగా వస్తాయని ఊహించని అనిల్ ముఖం వెలిగిపోయింది కానీ కొంచెం బింకం చూపించి మూర్తి చేత బతిమాలించుకుని "సరే మావాడి వైద్యానికి ఖర్చులిస్తామన్నారు కనక ఒప్పుకుంటున్నాను. ఆ పెద్ద మనిషి చేత చెప్పించవలసినది చెప్పించండి"అన్నాడు. 

రెండు మూడు వేలకు తేలిపోయేదానికి అయిదు వేలివ్వవలసి వస్తోందని నన్ను మింగేసేలా చూస్తూ హనుమంతు పొరబాటయిందనీ క్షమించమని చెప్పాడు. 

అనిల్ తన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. 

మేమిద్దరం వెనక్కి వస్తుంటే "ఏరా! నిస్సహాయతపై ఆడుకునే వారు అన్ని వర్గాలలో ఉన్నారని ఇప్పుడైనా అర్ధమయిందా? నిన్న రిక్షా వాడి ఒంటరితనం చూసుకుని నువ్వు ముందూ వెనకా ఆలోచించకుండా కొట్టావు. ఈరోజు బలం వాళ్ళది కనుక నీ తప్పుకి పదింతలు వసూలు చేసుకుని వెళ్లారు వాళ్ళు"అన్నాను. 

హనుమంతు కోపంతో తలెగరేసి "ఈరోజు నువ్వూ మూర్తీ నన్ను రక్షించారు కదా నేను మీ వైపు వచ్చేస్తానని ఆశ పెట్టుకోవద్దు. ఒకటి రెండు సంఘటనలకు లొంగిపోతే ఈ యడ్ల హనుమంతు సిద్ధాంతాలకు విలువేముంది?"అని చెప్పి విసవిసా వెళ్ళిపోయాడు. 

ఊహించని ఆ సమాధానానికి సాముహిక స్పృహ తప్పాను. 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు