ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న. 

ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. 

మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం?

నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు. 

"వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే. 

"సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?"

నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను. 

"ఆ కొంత మంది ఎవరో తెలుసా?" 

"ఎలా తెలుస్తుంది?" 

"...."

"మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నాం. నమ్మినపుడు నిజాయితీ పరులలో ఆత్మ విశ్వాసం పెరిగి సమాజం  బాగుపడుతుంది కదా!" అన్నారు. 

నాన్న లెక్కలతో మాయ చేసి తన సిద్ధాంతం రుద్దుతున్నట్టు అనిపించింది. కానీ వాదించే జ్ఞానం లేక ఊరుకున్నాను. 

అయినా నాన్న అన్నారు. "ఈరోజు నుంచి జరిగే ప్రతిఘటనా గమనించి చూడు. ప్రతి సారీ నీ అనుభవం నిజాయితీగా రాసుకో.  నీకే తెలుస్తుంది. నమ్మటానికీ నమ్మకపోవటానికీ తేడా ఉండదని"

"ఇలా ఎంత కాలం నమ్మాలి?" 

"నమ్మాలి. మోసపోయేవరకూ నమ్మాలి. మనం మోసపోయామని నిర్దారించుకునే వరకూ నమ్మాల్సిందే" అన్నారు నాన్న. 

ఇది కొంచెం మొండి వాదం లా అనిపించినా అంగీకారంగా తలాడించేసాను. 

***

"ఒరేయ్ ! ఈసారి నువ్వో నేనో ప్రథమ స్థానం లో ఉండాలిరా" అన్నాడు రాజు. 

మా తరగతిలో 150 మంది ఉన్నారు. కానీ చాలా బాగా చదువుకునేవారు ముప్పై మంది కన్నా ఉండరు. వారిలో నాకు, రాజుకీ చలం, రాము లతో పోటీ ఉంది. అందరం గాఢ స్నేహితులం అయినా రాజు కీ నాకూ వారితో పోటీ ఉంది. ఈ విషయం మిగతా ఇద్దరికీ తెలియదు. ఆమాట కొస్తే ఈ పోటీ తత్త్వం కూడా రాజు నాకు నేర్పాడు. 

"మనం గెలవాలంటే మనం బాగా చదువుకోవాలి. సాయంత్రం మన చెట్టు కింద చదువుకుందాం" అన్నాను. 

రాజు ఏదో చెప్పేలోపల చలం నా దగ్గరికి వచ్చాడు. 

"ఒరేయ్. మొన్న వారం రోజులు నేను బడికి రాలేదు కదా! నీ వ్రాత పుస్తకం నాకిస్తే నేను హాజరు కాని పాఠాల సారాంశం నీ పుస్తకంలోంచి రాసేసుకుంటా" అన్నాడు. 

"సరే! ఈరోజు లెక్కల పుస్తకం తీసుకో. ఇలా రోజుకొకటి తీసుకుంటే సరి" అన్నాను. చలం ఆనందంగా నా పుస్తకం తీసుకుని తన సైకిల్ వెనక క్యారేజ్ కి తగిలించుకుని ఇంటికి వెళ్ళాడు. వాడిలా వెళ్ళగానే రాజు "ఓరి చవటా! వాడికెందుకిచ్చావు? వాడిప్పుడు నాలుగు రోజులు ఆ పుస్తకం ఉంచేసుకుంటాడు. లెక్కల్లో వాడికి ఉన్న బలహీనత తెలుసుగా " అన్నాడు. 

"వాడు అంతా రాసుకుని నాకు ఇస్తే సమస్య లేదు కదా!ఈలోపు వేరేవి చదువుకుంటాను" అన్నాను. 

"అదే నీ చవట తనం. నువ్వే చూడు. ఈ సారి లెక్కల్లో నీకు మార్కులు తగ్గిపోతాయి" అని చెప్పి రాజు కోపంగా వెళ్ళిపోయాడు. 

"ఇంతకీ వాడికి పుస్తకం ఇచ్చావా?" అడిగారు నాన్న విషయం నా నోట విని. 

"ఇచ్చాను" అన్నాను భయంగా. 

"సరైన పని చేసావు. వాడు తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాడు. మన చిన్న ఇబ్బంది మరొకరికి సాయం అయితే తప్పకుండా చెయ్యాలి" అన్నారు . 

అలా అయితే బావుండునని అనుకున్నాను కానీ రాజు మాటలు నా మనసులో మెదులుతున్నాయి. 

***

మర్నాడు నేను, రాజూ మధ్యాహ్నం క్లబ్ దగ్గర కూర్చున్నపుడు చలం బెరుకుగా వచ్చాడు. 

నేను విషయమడిగే లోపల చెప్పాడు "ఒరేయ్! నీ పుస్తకం దారిలో ఎక్కడో పడిపోయిందిరా"

నా గుండె ఝల్లుమంది. "అయ్యో! ఇప్పుడెలా" అన్నాను కంగారుగా. ప్రతి పాఠం వినేటప్పుడు నేను చాలా చక్కగా సారాంశం రాసుకుంటానని గొప్ప పేరు. ఇప్పుడది పోయింది. 

"క్యారేజ్ కొంచెం వదులుగా ఉందిరా. ఇంటికెళ్ళేసరికి నా పుస్తకాలూ ఒక్కటీ లేవు. అన్నీ పడిపోయాయి. వెనక్కి నడిచి వెతికినా కనపడలేదురా" అన్నాడు. 

రాజు కోపంతో "అలా ఎలా చేసావురా? ఇప్పుడు వాడెలా చదువుకుంటాడు? పరీక్షలెలా రాస్తాడు? " అన్నాడు. చలం జవాబు చెప్పలేక "నేను కావాలనయితే చెయ్యలేదు కాదురా" అని నీరసంగా నడుచుకుని వెళ్ళిపోయాడు. 

"ఇప్పుడు బుద్దొచ్చిందా?" అన్నాడు రాజు. నాకు కూడా రగిలిపోతోంది. 

"వాడు నిజంగానే పోగొట్టున్నాడేమో!. నువ్వు వాడిని ఇంకా నమ్మాలి" అన్నారు నాన్న. 

"ఇంత జరిగాక కూడానా? "

"మనకి ఇంకా నిజం తెలియదు కదా! కనుక నమ్మాల్సిందే" అన్నారు నాన్న. 

"......" 

***

"ఒరేయ్ చలం గాడు ఏం చేసాడో తెలిసిందా? " అంటూ వచ్చాడు రాజు. 

"చలం గాడు ఈరోజు రాము దగ్గర వ్రాత పుస్తకం తీసుకున్నాడు. లెక్కల పాఠాలే!" 

"నిజమా?"

"వాడు తన పోటీదారుని ఒక్కొక్కడినీ తప్పిస్తున్నాడు. రాము వాడికి పుస్తకం ఇచ్చేస్తే కొంతవరకూ మనకి మంచిదే గానీ చలం గారి యుక్తులు బైట బడుతున్నాయి.రేపు వాడు నన్ను కూడా ఇదే  అడుగుతాడు. " అన్నాడు రాజు. 

నాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. నాన్నకి చెప్పినా ఆయన దృక్పథం మారలేదు. అందువలన నాకు ఇంకా మండుతోంది. 

రెండు రోజుల తర్వాత నేనూ రాజూ ఇంట్లో చదువుకుంటుంటే చలం వచ్చాడు. 

"ఏరా పుస్తకం కావాలా?" వెటకారంగా అన్నాడు రాజు. 

"అవునురా. సామాన్య శాస్త్రం కావాలి" అంటూ నావైపు చెయ్యి చాచాడు. వాడు నా పుస్తకం తీసుకోవటానికి చేయి చాచాడేమో అని చూస్తే వాడి చేతిలో కొత్త వ్రాత పుస్తకం ఉంది. కానీ అట్ట మీద వాడి  దస్తూరితో నా పేరు కనిపించింది. 

"ఇదేమిట్రా?" అన్నాను. 

"నీ పుస్తకం పోగొట్టాను కదురా! రాము దగ్గర తీసుకుని మొత్తం ఈ పుస్తకంలో రాసేసాను. మరో నకలు నాకోసం రాసుకోవటానికి మరోరోజు వాడి పుస్తకాన్ని ఉంచుకోవటానికి రాము ఒప్పుకున్నాడు" చెప్పాడు చలం. 

నేను నిర్ఘాంతపోయాను. 

"సామాన్య శాస్త్రం ఇవ్వరా. నేనీ సారి సైకిల్ మీద రాలేదు. నడుచుకుంటూ తీసుకుపోతాను." అన్నాడు చలం (మా భయం అర్ధమయినట్టు). 

అప్పుడే తేరుకున్న రాజు "ఎందుకురా. నేను నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను. ఇక్కడే కలిసి చదువుకున్నాక వెల్దువుగాని" అన్నాడు. 

నేను కూడా మెచ్చుకోలుగా చూసాను. 

మేము ముగ్గురూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అమ్మ చేసిన చేగోణీలు తింటూ చదువుకుంటుండగా చూసాక నేను వివరించవలసిన అవసరం లేకుండానే నాన్నకి అంతా అర్ధమయ్యింది. నా భుజం తట్టి వెళ్లిపోయారు. 

కొన్ని సందర్భాలలో మాటలు అనవసరం. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు