ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బుల్లి నాన్నచెప్పిన పెదనాన్న కథలు : తాతబ్బాయి



బుల్లి నాన్న చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ బుల్లి నాన్న కి ఒక బుల్లి స్నేహితుడు సన్యాసి రాజు. వీళ్ళిద్దరూ చదువైనా ఆటలైనా పాటలైనా ఇంటి పనులైనా ఇంకేమైనా కలిసే చేసేవారు. వీళ్ళిద్దరూ ఒకే బడి లో చదువుకునేవారు. ఒక్కొక్క తరగతిలోనూ నూరూ నూట యాభై మంది ఉన్నా అందరూ వీరికి స్నేహితులే. వారిలో తాతబ్బాయి ఒకడు. తాతబ్బాయి చాలా మంచి వాడు. ఎప్పుడూ ఒకరకమైన అమాయకమైన ముఖం తో ఉండే తాతబ్బాయి అంటే అందరికీ అభిమానమే! తాతబ్బాయికి ఉన్న ఒకే ఒక్క సమస్య ఏమిటంటే గురువులు చెప్పే ఒక్క ముక్కా అతనికి కొంచెం కూడా అర్ధం కాకపోవటం. పాపం వాడు శాయశక్తులా ప్రయత్నించినా ప్రతి గురువు కీ వాడొక తీరని సమస్యగా ఉండే వాడు.  బుల్లి నాన్నా , సన్యాసి రాజూ ఇద్దరూ జాలిపడి వాడికి వీలయినంత సహాయం చేసేవారు. ఎన్నో సార్లు వాడి హోమ్ వర్క్ వీళ్ళే చేసేవారు. అది కాక వాడికి అర్ధమయ్యేలా పాఠాలు మళ్ళీ చెప్తూండే వారు.  అయినా వాడికి ఏమీ అర్ధమయ్యేది కాదు. 

తాతబ్బాయికి చదువే సమస్య గా ఉంటె బుల్లి నాన్న కీ ఇంకా అందరికీ చదువులో ఒక పెద్ద సమస్య ఉండేది. అది హిందీ భాష !!! మన దేశ భాష అయిన హిందీ అందరూ నేర్చుకోవాలని హిందీ ఉపాధ్యాయిని గాయత్రి గారు ఎంత అందంగా వివరించినా తరగతిలో ఉన్న అందరికీ హిందీ ఒక కొరకరాని కొయ్య. హై అనాలా హూ అనాలా దగ్గర్నుంచి అన్నీ అనుమానాలే భయాలే. 

తాతబ్బాయి అందులో కూడా రెండాకులు ఎక్కువే. గాయత్రి గారు ఎంత సహనం తో ప్రయత్నించినా ఆ రోజు బోధన పూర్తయ్యేసరికి వాడి నుంచి వచ్చే సమాధానాలకి తట్టుకోలేక ఆవిడ కన్నీళ్లతో తరగతి వదిలి వెళ్లేవారు. మై తాతబ్బాయి హై ; తుం గాయత్రి థా లాంటి అందమైన ప్రయోగాలతో వాడు ఆవిడ సహనం నశించే వరకూ విసిగించే వాడు. ఒక రోజు ఆవిడ విసిగిపోయి హిందీ పుస్తకం ఇచ్చి మొత్తం పుస్తకమంతా రెండ్రోజులలో రాసుకు రమ్మంది. తాతబ్బాయి రాత్రీ పగలూ కష్టపడి మొత్తం రాసి రెండు రోజులలో ఇచ్చేశాడట. వాడికి ఈసారి తన్నులు తప్పవన్న వాడి స్నేహితులంతా ఇది విని ఆశ్చర్యపోయారు. ఎలా చేసావురా నీకు కష్టమనిపించలేదూ అని బుల్లి నాన్న అడిగితే 'చాలా కష్టంరా ! ఎలాగో చేసేసాను. ముఖ్యంగా ప్రతి పదానికి కింద గీత గీయటం చాలా చిరాకుగా అనిపించింది' అన్నాడు తాతబ్బాయి. వాడు చెప్పింది అర్ధం కావటానికి కొంచెం సమయం పట్టింది కానీ అర్ధమయ్యేసరికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు బుల్లినాన్నకి. వాడు పుస్తకం మొత్తం తలకిందులుగా చదివి అలాగే చైనీస్ అక్షరాలూ రాసినట్టు రాసేసాడు !!!

ఇలాగే రోజులు గడుస్తుంటే పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుల్లి నాన్న, రాజూ ఇంకా అందరు స్నేహితులూ రాత్రీ పగలూ చదువుకుంటున్నారు. వాడి స్థాయిలో తాతబ్బాయి కూడా. ఇంతలో హిందీ నేర్చుకోవటాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఈ పరీక్ష ఉత్తీర్ణం కావటానికి వందకి పదిహేను మార్కులు తెచ్చుకున్నా చాలని చెప్పింది. మిగతా పరీక్షలకి ఉత్తీర్ణం కావటానికి ముప్పై అయిదు మార్కులు రావాలి కానీ హిందీ కి పదిహేను మార్కులు చాలు. నిజానికి చాలా మంచి వార్త అయినా ఆ మార్కులు తెచ్చుకోవటం కూడా సులువు కాదు కనుక బుల్లి నాన్న కి అతని స్నేహితులకీ నిద్ర లేని రాత్రులు కొనసాగాయి. 

హిందీ పరీక్ష రోజు బుల్లి నాన్న పరీక్ష ప్రారంభానికి ముందు ప్రతి పది నిముషాలకి లఘుశంక కి వెళ్తున్నాడు. ప్రశ్న పత్రం ఇచ్చే వరకూ ఉత్కంఠ తో కూర్చున్న బుల్లి నాన్న కి ప్రశ్న పత్రం చూసాక ఎప్పటిలాగే గుండె దడ పెరిగింది. మళ్ళీ మళ్ళీ చదివాక కొన్ని ప్రశ్నలకి బాగానే సమాధానాలు వ్రాయచ్చని పించింది. పదిహేను మార్కులు రావచ్చు. నెమ్మదిగా అతి జాగ్రత్తగా సమాధానాలు వ్రాయటం ప్రారంభించిన రెండు నిముషాలలో కుయ్ కుయ్ మని వెనకనించిశబ్దాలు వినిపించాయి. ఒకసారి విస్మరించినా ఆ శబ్దం స్థాయి నెమ్మదిగా పెరుగుతుంటే వెనక్కి చూసాడు బుల్లినాన్న. బుల్లినాన్న లాగే మిగతా విద్యార్థులు కూడా వెనక్కి చూస్తుంటే తాతబ్బాయి బోరు బోరు మని ఏడుస్తున్నాడని అర్ధమయ్యింది. 

తాతబ్బాయి పరీక్ష పాసవటం ఎలాగూ జరిగే పని కాదు. వాడు ఇప్పటి వరకూ ఒక పరీక్ష పాసయిన దాఖలాలు లేవు. ప్రతిసారీ అటెండెన్స్ ఆధారంతో పాసవటమే. ఇంతోటి దానికి వీడు ఏడవటం కూడానా? అసలు మేము పాసవుతామో లేదో తెలియక చస్తుంటే? అనుకున్నాడు బుల్లి నాన్న. 
పరీక్ష నిర్వహిస్తున్న లెక్కల మాస్టారు గవర్రాజు గారు తాతబ్బాయి ఏడవటం చూసి వాడి దగ్గరికి వెళ్లి 'ఎందుకురా ఏడుస్తున్నావు?' అని అడిగారు. ఏడుపు ఆపకుండా ఇంకా గొంతు పెంచి వాడు ఏడుస్తుంటే 'సరిగ్గా చదవకుండా ఇక్కడికొచ్చి ఏడిస్తే ఎలా?' అన్నారు గవర్రాజు గారు. 

అప్పడు తాతబ్బాయి వెక్కుతూనే 'బాగానే చదివాను మాస్టారూ! కానీ తెలుగు మొత్తం చదువుకుని వచ్చాను. ఈరోజు పరీక్ష తెలుగు గురించి కాదనీ హిందీ అనీ ఇప్పుడే తెలిసిందండీ' అన్నాడు.

గవర్రాజు గారి గుండె కరిగిపోయింది. పాపం కుర్రాడు తెలుగు పరీక్ష అనుకుని బాగా చదువుకుని వచ్చాడు, ఇప్పుడు హిందీ అని తెలిస్తే ఏం చేయగలడు? నిష్కారణం గా పరీక్ష ఫైలయిపోతాడు అనుకున్నారు. తన విధి నిర్వహణ కి అడ్డమైనా మానవత్వం గెలిచింది. 'సరే! నీకు ఉత్తీర్ణుడవటానికి సరిపడినంత సహాయం చేస్తాను' అన్నారు గవర్రాజు గారు. 'పిల్లలూ మీకేమయినా అభ్యంతరమా? పాపం కుర్రాడు అన్యాయం గా పరీక్ష పేలవుతాడు' అన్నారాయన. 
తాతబ్బాయికి సహాయం చేస్తే ఎవరికీ అభ్యంతరం? అందరూ అలాగేనండీ అని మూకుమ్మడిగా అరిచారు.

గవర్రాజు గారు కష్టపడి తాతబ్బాయికి చెప్పగలిగినంత చెప్పి ఆ రోజు కి నడిపించారు.  బుల్లి నాన్న తో సహా అందరూ సంతోషమే చెందారు. 
పరీక్షల ఫలితాలు వచ్చాయి. బుల్లి నాన్నా, సన్యాసి రాజూ ఇంకా స్నేహితులూ మార్కులు చూసుకోవటానికి వెళ్లారు. అందరికీ ఉన్న భయం ఒక్కటే. హిందీ !!!

అతితక్కువ మంది లాగ బుల్లి నాన్న కి అన్ని అంశాలలోనూ ప్రథమ శ్రేణిలో మార్కులు వచ్చాయి. హిందీ లో ఊహించని విధం గా ఇరవై మార్కులతో పాసయ్యాడు. పదిహేను వస్తాయో లేదోనని భయపడుతున్న నాన్న కి ఇది చాలా సంతోషం. రాజు కూడా పంతొమ్మిది మార్కులతో పాసయ్యాడు.

ఒరేయ్ ఈ సారి మనం బ్రహ్మాడం గా చేసాం రా ! నీకు మొదటి స్థానము వచ్చినా ఆశ్చర్యం లేదు అన్నాడు రాజు. ఇద్దరూ సంతోషంగా నడుస్తున్నారు.

ఇంతలో పెద్ద గోల గా వాళ్ళ మిగతా స్నేహితులంతా  వీళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఏమిటీ హడావుడి అనుకుంటుంటే ఆ గుంపు మధ్య లో తాతబ్బాయి అదే అమాయకమైన ముఖం తో అయోమయంగా చూస్తూ కనిపించాడు. ఆంటోనీ వీళ్ళవైపు పరిగెత్తుకు వస్తూ 'ఒరేయ్ మీకు తెలుసా! తాతబ్బాయి హిందీ లో ఫస్ట్ వచ్చాడు' అన్నాడు.

బుల్లి నాన్న నిర్ఘాంతపోయి ' ఫస్టా? ఎన్ని మార్కులొచ్చాయి వాడికి?' అని అడిగాడు. ఇరవై కంటే ఎక్కువ వస్తాయా? అని మనసులో అనుకుంటూ. 
'ముప్పయి అయిదు' చెప్పాడు ఆంటోనీ. 

"..... "

ఇంత జరుగుతున్నా అందరూ అభినందిస్తున్నా తాతబ్బాయి కి నిజంగా సంతోష్ పడాలా లేదా అర్ధం కానట్టు అయోమయంగా నించున్నాడు. కొంచెం నిశితం గా చూస్తే వాడిలో ఒకరకమైన అపరాధ భావం కనిపిస్తోంది. వాడు మిగతా పరీక్షలు అన్నీ అనుకున్నట్టే ఫెయిల్ అయిపోయాడు. కానీ హిందీ లో స్కూల్ ఫస్ట్ !

అందరూ వెళ్ళిపోయినా ఇంకా నుంచున్న తాతబ్బాయి దగ్గరికెళ్లి 'ఏరా? నీకు ముప్పై అయిదు మార్కులు ఎలా వచ్చాయి రా?' అని అడిగాడు బుల్లి నాన్న. 
'తెలీదు' అన్నాడు వాడు బిక్కమొహం పెట్టి. (హిందీ లో ఉత్తీర్ణం చెందటానికి పదిహేను మార్కులు చాలని గవర్రాజు గారికి తెలియదు. ఆయన పాస్ మార్క్ ముప్పై అయిదు కి సరిపోయేలా వాడి ఆన్సర్ పేపర్ నింపేశారు.) ఇద్దరూ కలిసి కొడతారేమో అని భయపడుతున్నాడు.

బుల్లి నాన్నా, రాజు గాడూ పగలబడి నవ్వారు. 'ఒరేయ్ వీడికి హిందీ లో ముప్పై అయిదు మార్కులతో ప్రథమ స్తానం !!!' అన్నాడు బుల్లి నాన్న.  'తాతబ్బాయికీ జై' అని వెంటనే అరిచాడు రాజు. ఆ తర్వాత వాళ్లిద్దరూ వాడికి రెండు వైపులా నించుని  'తాతబ్బాయీ ఈ ఈ ఈ .... తాతబ్బాయీ ఈ ఈ ఈ ...' అంటూ అటువైపు నుంచి ఇటూ ఇటువైపు నుంచి అటూ నాట్యం చేయటం మొదలెట్టారు. వాళ్ళు ఎంత సేపు చేసేవారో గానీ వెనక నుంచి వచ్చిన గవర్రాజు మాస్టారు అలాగే వాళ్ళ వెనక కాసేపు నించుని వీళ్ళ నాట్యం చూసారు. చాలా సేపటికి గానీ ఆయన ఉన్నట్టు చూసుకోని  బుల్లి నాన్నా రాజు ఆయన్ని చూడగానే భయంతో నాట్యం ఆపి నిశ్శబ్దమైపోయారు.

గవర్రాజు గారు వాళ్ళిద్దరి చెవులూ పట్టుకుని 'ఊ పాడండి రా ! ఆపేశారేం? తాతబ్బాయీ ఈ ఈ ఈ .... ' అంటూ మాస్టారు కూడా పాట అందుకుని మధ్యలోనే నవ్వేశారు. బుల్లి నాన్నా రాజూ అమ్మయ్య అనుకుంటూ  నవ్వేశారు. తాతబ్బాయి కూడా నవ్వాడు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు