ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వికాసం

నేను ఉద్యోగం లో చేరిన కొత్తరోజులు. అప్పుడే ఒక సంవత్సరం శిక్షణ  పూర్తి చేసుకుని పశ్చిమ వంగ దేశం లో ఫరక్కా అనే చిన్న గ్రామం లో నడుపుతున్న విద్యుత్కేంద్రం లో పని ప్రారంభించి రెండు నెలలు కావస్తోంది. 16 రోజుల్లో నాకు నాలుగో సంవత్సరం పరీక్షలు ఉన్నాయనగా నాన్న మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఉద్యోగం చాల అవసరమయ్యింది. ఖరగపూర్ లో పెద్ద చదువు కి చేరినా ఉద్యోగ ప్రయత్నాలు మానలేదు.  చివరకి ఈ ఉద్యోగం ఖరారయ్యింది. నాన్న లేని బెంగని మరిచిపోవటానికి నా దృష్టంతా పని లోకి మళ్లించుకుని మొదటి సంవత్సరం శిక్షణ లో ప్రథమ స్తానం లో ఉత్తీర్ణుడినయ్యాను. చివరి ఆరు నెలల శిక్షణ లో నేను అన్ని విభాగాలలోనూ ఒక్కొక్క వారం కూర్చుని అంతవరకూ నేర్చుకున్న విద్యని ఆచరణ లో పెట్టటం లో కూడా ప్రావీణ్యం సంపాదించాను. మా విద్యుత్కేంద్రానికి ఉన్నతాధికారి ప్రత్యేకంగా నేను కూర్చునే కార్యాలయానికి వచ్చి మా జట్టులో అందరికన్నా ఉన్నత  స్థాయిలో నేను ప్రదర్శించిన పనితీరు గురించి నన్ను నా సహచరుల ముందు అభినందించారు. పెద్దల నుంచి ముఖ్యంగా నాన్న నుంచి రావలసిన తోడ్పాటు లేని నాకు అప్పుడు ఎంతో సంతోషం ఉద్వేగం నా మీద నాకు నమ్మకం కలిగాయి. వీటన్నిటితో పాటు గర్వం కూడా వచ్చిందనీ ఆ ఒక్కటీ అణిగి పూర్తి వికాసం కలగటానికి నేను ఊహించని వ్యక్తుల నుండి సహాయం వస్తుందని ఆ రోజు నాకు తెలియదు. 

విద్యుత్కేంద్రం కనుక మేము ప్రతి పూటా (shift) పని చెయ్యాలి. ప్రతిపూటా పని పూర్తయ్యేటప్పుడు నా స్తానం లో కూర్చునే సహోద్యోగికి మొత్తం యంత్రాంగం ఇంకా ఇతర పరికరాల పనితనం గురించి సమాచారం ఇవ్వాలి. మా ప్లాంటు తాలూకు విభాగాలు కొన్ని ఎకరాల విస్తీర్ణం లో విస్తరించి ఉండటం వలన ఒక్కొక్క విభాగం లో కొంతమంది సాంకేతిక నిపుణులూ, ఒక పర్యవేక్షకుడూ ఉంటారు. ఒక్కొక్కరూ సేకరించిన సమాచారం తీసుకుని లాగ్ బుక్ లో నివేదించాలి. నా అధికారి రంజన్ కుమార్ నాకు ఈ పని అప్పగించాడు. నేను వెంటనే ఒక్కొక్కరికీ కాల్ చేసి సమాచారం తీసుకోవటం ప్రారంభించాను. ఆ ప్రయత్నంలోనే సీల్ ఆయిల్ సిస్టం దగ్గర సమాచారం తీసుకుంటున్నప్పుడు నాకు ప్రతిఘటన వచ్చింది. 

ఆ విభాగం పర్యవేక్షకుడు పేరు ఝా. నేనతనికి ఫోన్ చేసి అతన్ని తన విభాగంలో పరిస్థితి వివరించమని అడగగానే 'దిలీప్ గారూ! మీరెవరో నేను ఇంతవరకూ చూడలేదు. మీకు నేను సమాచారం ఎలా ఇస్తాను? రంజన్ కుమార్ కి ఫోన్ ఇవ్వండి ' అన్నాడతను. 

నేను  వెంటనే తప్పు తెలుసుకుని 'ఝా గారూ! నా పేరు దిలీప్.  దేశవ్యాప్తం గా శిక్షణ లో ఈ ఏడాది ప్రప్రధమ స్తానం లో నిలిచిన వ్యక్తీ గా నా పేరు నోటీసు బోర్డు లో చూసే ఉంటారు' అన్నాను. 

అదేమీ పట్టించుకోకుండా 'క్షమించండి. నేను మిమ్మల్ని ఒక్కసారి కూడా కలవకుండా మీకు ఏ సమాధానమూ చెప్పలేను' అంటూ ఝా ఫోన్ పెట్టేసాడు. 

నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఫోన్ చెయ్యచ్చు గానీ ఇంకాస్త అవమానం ఎదుర్కోవటానికి ధైర్యం చాలలేదు. వెంటనే  అవమానం అనుచుకుంటూ రంజన్ తో ఈ విషయం చెప్పాను. ఈ విషయం చెప్పగానే రంజన్ కుమార్ స్వయంగా ఝా తో మాట్లాడి తనకి కావలసిన గణాంకాలూ సమాచారమూ తీసుకున్నాడు. నా మనసు చివుక్కుమంది. ఝా కి నన్ను పరిచయం చేసి నా హోదా తెలియజేసి నా మార్గం సుగమం చేసే ప్రయత్నమేమీ చేయకుండా రంజన్ ఆ రోజు కి కావలసిన పని పూర్తి చేసుకోవటం నాకు నిరాశ కలిగించింది. ఆ తర్వాత కూడా రంజన్ నుండి నాకు ఏ సహాయమూ రాలెదు. ప్రతిరోజూ నేను వివరాలు తీసుకోవటానికి ప్రయత్నించటం ఝా నాకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా రంజన్ కోసం అడగటం రంజన్ కూడా ఏ ఇబ్బందీ లేకుండా అతని నుంచి రిపోర్ట్ తీసుకోవటం జరుగుతోంది. కొత్త ఉద్యోగం లో ఇటువంటి పరిష్కారం కనబడని సమస్య ఎదురయ్యేసరికి నేను సతమతమవ్వసాగాను. రాత్రులు నిద్ర కూడా సరిగా పట్టటం మానేసింది.

ఒకరోజు నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సమస్య నేనే పరిష్కరించుకోవాలి. నేను పని చేసే కంట్రోల్ రూం నుంచి 10 ఫ్లోర్ లు దిగి కిందికి వెళ్లాను. మొట్టమొదట వచ్చే గదిలో టర్బైన్ ఆపరేటర్ లంతా కూర్చుంటారు. నిజానికి వాళ్ళు కూర్చోవలసిన సమయం తక్కువా ఫీల్డ్ లో తిరిగే సమయం ఎక్కువా ఉండాలి. కానీ ఏదయినా పని చెప్పినప్పుడు తప్ప అందరూ ఆ గదిలో కూర్చుంటారు. మొత్తం పూటంతా పని లేకుండా కూర్చోవటానికి వారికి ఏ అభ్యంతరమూ ఉండదు. నేను గది లోకి ప్రవేశించేసరికి పన్నెండు మంది కూర్చుని పనికిమాలిన విషయాలు మాట్లాడుకుంటూ పెద్దగా నవ్వుకుంటున్నారు. నన్ను చూసి మాటలు ఆపి నేనెవరన్నట్టు చూసారు. 

'నమస్తే! నా పేరు దిలీప్. కొత్తగా చేరిన ఇంజనీర్ ని. ' అన్నాను . వారితో పాటు కూర్చున్న ఝా వెంటనే నేనెవరో ఊహించి నా దగ్గరికి వచ్చాడు.

'రండి దిలీప్ గారూ!' అని అతనితో పాటు లోపలి తీసుకు వచ్చి ఒక్కొక్క ఆపరేటర్ ని పరిచయం చేసాడు. నేను ప్రతి సారి చేతులు జోడించి నమస్తే అని పలకరిస్తుంటే ఒక్కొక్కడూ ఒక్కొక్క రకంగా ప్రతిస్పందించారు. ఒక మనిషి చేతులు ముడిచి వెటకారంగా చూస్తె మరొకడు అర్ధం లేని వెకిలి నవ్వు నవ్వాడు. ఇంకొకడు ప్రజలని ఉద్దేశించి ఒక దేశనాయకుడు చేయ్యూపినట్టు సలాం చేసాడు. ఇదంతా ఇంకాస్త ఇబ్బందికరం గా పరిణమిస్తుంటే ఝా నన్ను తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళాడు.
'దిలీప్ గారూ! ఈ విద్యుత్కేంద్రం లో మేము కూడా పని చేస్తున్నాం. మాకు కూడా మేము చేసే పనికి గౌరవం కావాలని కోరుకోవటం లో తప్పు లేదు కదా?' అన్నాడు ఝా.
'కానీ ... నేను మిమ్మల్ని ఏమీ అవమానించలేదే?'
'ఎవరో మనిషి నేనెప్పుడూ ఒక సారి కూడా కలవని మనిషి మొదటి సారి కలిసి నేరుగా నా పని ని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది దిలీప్ గారూ? నేను ఇరవై సంవత్సరాల నుండి పని చేస్తున్నాను. నాతో పని చేసే బర్మన్, మైతీ, జానా వీళ్ళందరూ పది పన్నెండేళ్ళ నుంచి పని చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి కదా!'

నాకు కొంచెం బాధా చిరాకూ కలిగింది. వీళ్ళని నేను గౌరవించటం లేదని ముందే నిర్దారించేసుకుని ప్రవర్తిస్తున్నారా? లేక నా లో నిజంగానే లోపముందా?

నేను అటువంటిదేమీ లేదని చెప్పేలోపల బర్మన్ అన్నాడు 'మీరేమీ అనుకోకపోతే ఒక మాట. మీ ఇంజనీర్లు పుస్తకాలలో చదువుకుని మా మీద దాష్టీకం చేయటంతప్ప మీకు పనేమీ తెలియదు'

నాకు మరింత  కోపం వచ్చినా అనుచుకుంటూ 'అలా ఏమీ లేదండీ నేను కూడా ఆరు నెలలు పని చేసిన తర్వాతే నా ఉద్యోగం ఖరారు అయ్యింది' అన్నాను. బర్మన్ ఒక వంకర నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళాడు. వెనకే జానా నడుస్తూ బర్మన్ ను అభినందిస్తున్నట్టు చేయి కలిపాడు.

'ఝా గారూ! ఇక మనం అపార్ధాలు మరిచిపోయి పని చేద్దాం.' అన్నాను.
అక్కడితో సమస్య పరిష్కారమయ్యిందని అనుకున్నాను. కానీ ఏమీ తేడా లేదు. నేను ఏపని చెప్పినా ఏదో ఒక కారణం తో పని ముందుకెళ్ళటం లేదు. రంజన్ చెప్పగానే పని అయిపోతోంది. 

నిజానికి ఇందువల్ల నా జీతం తగ్గదు, ఇంక్రిమెంట్ ఆగదు. కానీ నాకది నచ్చలేదు.

ఒక రోజు అర్జెంటు గా ఒక వాల్వ్ తెరిపించటానికి ఆపరేటర్ రూం కి కాల్ చేసాను. ఆ వాల్వ్ తెరవకపోతే ఆయిల్ ప్రవహించటం సరిపోక యంత్రం ఆగిపోవచ్చు జామయిపోవచ్చు.ఇంకా ప్రమాదం కూడా జరగొచ్చు/ 

'ఈ పని అవ్వదు' చెప్పాడు జానా చాలా నిర్లిప్తంగా.

'ఎందుకు జానా గారూ?' వీలయినంత మర్యాదగా అడిగాను.

'కిందికొచ్చి చూస్తె తెలుస్తుంది' ఏమాత్రం మర్యాద లేకుండా చెప్పాడు జానా. 

కిందికి వెళ్తేనే తెలుస్తుందట లేకపోతే తెలియదట! ముందు విపరీతమైన కోపం వచ్చి కిందికి వెళ్లి దులిపేద్దామనుకున్నాను. మరో క్షణం లో భయమేసింది. కానీ నేను అడిగిన పని  ఇప్పుడు చెయ్యకపోతే చాలా ప్రమాదం. కొన్ని క్షణాల ఆలోచనల తర్వాత లేచి బైల్దేరాను. జానా దగ్గరికి కాదు. సీల్ ఆయిల్ సిస్టం దగ్గరికి వెళ్ళాను. నాకు తెరవవలసిన వాల్వ్ నెంబర్ తెలుసు. ఆ మాట కొస్తే ఆ మొత్తం సిస్టం తెలుసు. శిక్షణ పూర్తవుతున్నప్పుడు ముగ్గురు అధికార్లు ఇటువంటి విషయాల గురించి ఎంతో లోతుగా అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా సమాధానాలు చెప్పినపుడు నన్ను వారు ఫలితాలు చెప్పకుండానే చాలా అభినందించారు. 

నేను కిందికి వెళ్లేసరికి జానా కనిపించాడు. నా లోపల ఉన్న బెరుకు కనపడనివ్వకుండా అతన్ని పని పూర్తి చెయ్యమన్నాను. మళ్ళీ వంకర నవ్వుతో జానా అడిగాడు 'ఆ వాల్వ్ చూపించండి. నేను ఓపెన్ చేస్తాను. పని వాళ్ళు లేరు కనక ఇంతవరకూ చెయ్యలేదు' అన్నాడు. వాల్వ్ చూపించామనగానే నాకు చాలా అవమానమనిపించింది.

'జానా! ఇది చాలా అత్యవసరం గా చెయ్యవలసిన పని. దయ చేసి ఆలస్యం చెయ్యద్దు' అన్నాను.

'ఇప్పుడు వప్పుకుంటారా? మీకేమీ తెలియదు. చేసేదంతా మేమే! మీరు మాత్రం వచ్చి మమ్మల్ని ఆ పని చెయ్యీ ఈ పని చెయ్యీ అని అజమాయిషీ చేస్తారు' అన్నాడు జానా తాపీగా కిళ్ళీ తింటూ.

కోపం అనుచుకుంటూ 'ఇది మీ పనే కదా!  ఇది చెయ్యటానికి కూడా ఎందుకు ఇబ్బంది పెడతారు?' అన్నాను.

"ఇబ్బంది ఏముంది? ఆ వోల్వ్ ఎక్కడ ఉందొ చూపిస్తే పని చేస్తానన్నాగా!" అన్నాడు జానా నవ్వు ఆపుకుంటూ. 

ఎన్నెన్నో వంపులతో మెలికలతో ఉన్న ఆ చమురు గొట్టాలని చూస్తూ నాకు కావలసిన వాల్వ్ గుర్తించాలని ప్రయత్నించాను. నాకు మొత్తం ఆ సర్క్యూట్ తెలుసు. ఇప్పుడే అడిగితె మొత్తం బొమ్మ గీచి చూపించగలను. కానీ ఎదురుగా కనబడుతున్న ఈ గొట్టాల వలయం ఎక్కడ ప్రారంభమవుతుందో కూడా తెలియటం లేదు. నేను విసురుగా కంట్రోల్ రూం కి వెళ్లిపోతుంటే గుడుగుడు మని జానా నవ్వటం వినపడింది.

నేను రూం కి వెళ్లి ప్లాంట్ మొత్తం లేఔట్ విశదీకరించిన చిత్రాలు తీసుకుని కిందికి వచ్చాను. అత్యవసరమైన పని అని తెలుసు కానీ తొందర పడితేనే ఆలస్యం అవుతుంది. నాకు తెలిసిన ఏదో ఒక్క ప్రాంతం ముందు గుర్తించాలి. అది తెలిస్తే మొత్తం లైన్ ఎక్కడికి పోతుందో ఏ వాల్వ్ ఎక్కడ ఉందో నాకు తెలిసిపోతుంది. 

సెంట్రిఫ్యూగల్ పంప్ అన్నింటికన్నా అతి తక్కువ గొట్టాలు ఉన్న స్కీం. అక్కడ శుబ్రమయ్యిన చమురు టర్బైన్ వైపు వస్తుంది. అందుకే ముందు అక్కడికి వెళ్లాను. నేను తెచ్చుకున్న సుద్దముక్క తో ఒక్కొక్క గొట్టాన్నీ గుర్తించి చమురు ఎటు పోతుందో బాణం గుర్తులు పెట్టాను. ఒకసారి చమురు ఎటు పోతోందో తెలియగానే ఒక్కొక్క వాల్వ్ కీ టాగ్ చుట్టి దాని మీద వాల్వ్ నెంబర్ వ్రాసాను. నేను తెరవవలసిన వాల్వ్ దగ్గరికి రావటానికి అరగంట పట్టింది. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని వాల్వ్ తిప్పాను. వాల్వ్ తెరిచే ఉందని గమనించాను. 

అమ్మయ్య,! ఇక ప్రమాదం లేదు. వాకీ టాకీ లో కాల్ చేసి పంప్ ప్రారంభించ మని చెప్పాను.

నా షిఫ్ట్ అయిపోతోంది.

కానీ నేను ఆగలేదు. ఒక్కొక్క స్కీమూ చూసుకుంటూ గొట్టాల మీద గుర్తులు పెడుతూ ఒక్కొక్క వాల్వ్ కీ నెంబర్ ట్యాగ్ తగిలిస్తూ ముందుకు కదిలాను. సమయం గడుస్తోంది. భోజనం కూడా చెయ్యకపోవటం వలన నీరసం వస్తోంది. కానీ ఇంతకు మించి కసీ తీవ్రమైన ఆవేశం మరింత ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్లోర్ లో ఉన్న అన్ని స్కీములూ పూర్తి చేసి తర్వాత అంతస్తులోకి ఎక్కాను. 

'కంటికి పెద్ద చేతికి చిన్న' అని మా బామ్మ గారు చెప్పినట్టు ఎంతో కష్టమనుకున్న పని నెమ్మది గా చేసుకుపోతుంటే నాలో తెలియని ఒక చిత్రమైన సంతృప్తీ ఒక అసాద్యమనుకున్న పని సాధించానన్న గర్వం కలుగుతోంది. కానీ నాలో శక్తి సన్నగిల్లుతోందని తెలియలేదు. రెండో అంతస్తు మెట్లు ఎక్కుతుంటే కళ్ళు మసకలు కమ్ముతున్నాయని అనిపించింది. ఆధారంగా మెట్ల పక్క స్తంభాన్ని పట్టుకోవాలనుకుంటుంటే స్పృహ తప్పింది. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియలేదు. 
...........

ఎంత సమయమయ్యిందో తెలియదు నాకు మెలుకువ వచ్చింది. కానీ కళ్ళు తెరవలేదు. తెరవలేకపోతున్నానేమో కూడా తెలియదు. నా నుదుటికి తడి గుడ్డ కట్టి ఉందని తెలుస్తోంది.

'రొట్టి కాల్చి కూర మద్యలో పెట్టాను. ఈ హాట్ ప్యాక్ మంచం దగ్గర పెడతాను'  ఎవరిదో తెలిసిన గొంతు.

'టీ కూడా ఫ్లాస్క్ లో పోసాను. ఇక్కడే అందుబాటు లో పెట్టు' ఇంకో కంఠం. ఇది ఝా గొంతు లా ఉంది?

'జ్వరమైతే లేదనుకుంటా ఝా అన్నా! అలసటే అనుకుంటా. దిలీప్ అన్న కి తెలివి వచ్చేవరకూ నేనూ జానా ఒక్కొక్కరం  ఇక్కడే కూర్చుంటాం. మీరు వెళ్ళండి' బర్మన్ అంటున్నాడు.

ఝా ఇంకా వెళ్తున్నట్టు లేదు. 'నువ్వు వెళ్ళన్నా! దిలీపన్న కి ఏమీ భయం లేదు. నా ఇల్లు ఇక్కడే కనుక నేనే ఉంటాను' నేను మళ్ళీ నిద్ర లోకి వెళ్తుంటే జానా అంటున్నాడు. 

నేను మళ్ళీ కళ్ళు గట్టిగా మూసుకుని పడుకున్నాను. 

Rachana 2015

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు