ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి .
నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు .
"అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె .
"వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది .
"అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?"
ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికున్నంత వరకు డాన్సు చేసి నిద్రపోతాడు . ఇంత హాయిగా బతుకున్న బుజ్జి అరుణ్ గాడు టన్నుల బరువున్న పుస్తకాల సంచి వీపు మీద వేసుకుని టిఫిన్ బాక్స్ పట్టుకుని నిద్రమొహం  తో దీనం గా పొద్దున్నే స్కూల్ కి వెల్లటమా? సుబ్రహ్మణ్యం గుండె కరిగిపోయింది .
అతడు ఆలోచనలలో ఉండ గానే భార్య అందుకుంది .
"మన చుట్టు పక్కల  వాళ్ళంతా ఇంచక్కా రోజూ పిల్లలకి కోచింగ్ ఇచ్చుకుంటున్నారు . మీరే ఎంత సేపూ ఆఫీసంటూ ..."
"నాన్సెన్స్ , ఆపు నీ పసరు గోల !" చిరాగ్గా అన్నాడు సుబ్రహ్మణ్యం .
"వీడు చేరే బోడి నర్సరీ క్లాసు కి ఇంటర్వ్యూ కూడానా? దానికి కోచింగా? మన పొరుగువాళ్లకి బుద్ది లేక పోతే నీ బుడ్డి కూడా తగలడిందా? ఏదో నాలుగు ముక్కలు నువ్వే చెప్పు . సీటు వస్తుంది . రాక పోయినా కొంప మునిగేదేమీ లేదు.వచ్చే ఏడాది చేరతాడు . వాడికింకా  మూడేల్లె. " అనేసి లేచిపోయాడు .
ఆఫీసు కి వచ్చాక కూడా సుబ్రహ్మణ్యం ఒళ్ళు మండిపోతోంది . ఇంటర్వ్యూట వెధవలు! రోగ్స్! రాస్కేల్స్! వీళ్ళంతా ఫుట్ పాత్ మీద చదువుకుని ఇప్పుడు మా పిల్లలకి నర్సరీ లో చేరటానికి కూడా ఇంటర్వ్యూ లు చేస్తారా? రబ్బిష్ !

మామూలుగానే ప్రమోషన్ రిజల్ట్  ఇంకా రానందున చికాగ్గా ఉన్నాడతడు . ప్రమోషన్ వచ్చినా రాకపోయినా విషయం ఏదో ఒకటి  తెలిసి చస్తే బాగుండునని అతని బాధ .

"నమస్కారం సర్ !" అంటూ కేబిన్ లోకి వచ్చాడు హెడ్ క్లర్క్ .
"ఆ ఏమిటి పని?" వాడేదో వెధవ పని చేయటానికి పర్మిషన్ కోసం వచ్చాడని ఊహిస్తూ అడిగాడు సుబ్రహ్మణ్యం .

"ఏం లేదు సార్! నాకు హాఫ్ డే లీవ్ కావాలి "
"ఏం ముంచుకొచ్చిందట?"
"మా వాడి ని కాన్వెంట్ లో చేర్పించాలి సార్! ఇక్కడున్నదొకటే కాన్వెంట్ . ఇంటర్వ్యూ కి వారమే టైముంది . వాడిని చదివించాలని ..." చేతులు నలుపుతూ అన్నాడతను .
సుబ్రహ్మణ్యం రక్తం మరిగిపోయింది . వీడి పిండం . సెలవు పుచ్చుకుని మరీ పాఠాలుచెప్తాదన్న మాట . ఉద్యోగాని రిజైన్ చేసి చెప్పకూడదూ? సరే ఏదో చావనీ!

అతనికి పర్మిషన్ ఇచ్చేసాడు . అతను ఆనందం గా వెళ్ళిపోయాడు . కాసేపు అలాగే కూర్చుని ఎం చేయాలో తెలియక తన కొలీగ్ కి ఫోన్ చేసాడు .
"శివ ప్రసాద్ ఉన్నాడండీ?"
"ఈ రోజు రాలేదండీ . వాళ్ళమ్మాయి ని చదివించాలట. ఈ వారం రోజులూ రారనుకుంటా . " చెప్పాడు ప్రసాద్ పక్క సీటాయన.
సుబ్రహ్మణ్యం బుర్ర తిరిగిపోయింది .
"అది సరే గానీ ప్రమోషన్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో తెల్సిందా ? " నీరసం గా అడిగాడు .
"ఈ రోజు రావాలంటున్నారండీ "
ఈ మాటే నెల రోజులనుంచీ వింటున్నాను విసుగ్గా అనుకున్నాడు సుబ్రహ్మణ్యం.
అతనలా ఆలోచిస్తుంటే ఆఫీసు అటెండెంట్ లోపలికి వచ్చి టేబుల్ మీద నీళ్ళ గ్లాసు పెట్టాడు . తర్వాత అడగకుండానే టేబుల్ మీద ఫైల్స్ సద్డటం ప్రారంభించాడు . వాడి వ్యవహారం వెనక ఏదో కుట్ర ఉందని గమనించిన సుబ్రహ్మణ్యం "ఏమిటి సంగతి? మీ పిల్లోడిని చదివించటానికి కూడా సెలవు కావాలా?" అని అడిగాడు వెటకారం గా . 
సుబ్రహ్మణ్యం  పగిలిపోయేలా "అవున్సార్!" అన్నాడు వాడు . 
సుబ్రహ్మణ్యం ఒక్క క్షణం నిష్చేస్టుడై తేరుకుని "నువ్వు కూడా వెళ్ళిపోతే ఇక్కడ మిగిలే చవట నేనొక్కడినేనా?" అన్నాడు బొంగురు గొంతుతో . 
"లేదు సార్! భాస్కర్ సాబ్ కూడా ఉన్నారు సార్ అవతల " అన్నాడు వాడు  "నువ్వు కాకుండా మరొక చవట కూడా ఉన్నాళ్ళే" అన్నట్టు . 
"అంటే? ఇంకెవరు రాలేదా? ఆఫీసు కి? భాస్కర్ తప్ప?"
"లేదండీ మనాఫీస్ లో అందరి పిల్లలూ ఈ ఏడాదే కదండీ ఇంటర్వ్యూ కి వెళ్ళేది? అందుకే నలుగురూ రాలేదండి "
సుబ్రహ్మణ్యం కి విరక్తి కలిగింది . అంతా వెళ్ళిపోయాక ఈ ప్యూను  గాడు మాత్రం దేనికి సున్నం పిడత మొహం తో  ? వీడిని కూడా పొమ్మంటే సరి. ఆ భాస్కర్ ఉన్నా లేకపోయినా ఒకటే . తను ప్రమోషన్ కోసం  చూస్తున్నట్టు అతను సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ కోసం  చూస్తున్నాడు . అతన్ని కేబిన్ లోకి రమ్మని పిలిచాడు .  ఇద్దరూ ఒక చోటే ఏడవటం నయం !
"ఈ  వెధవలు చూశావటోయ్! ఒక్కడూ రాలేదు. వచ్చిన వెధవలంతా లీవులు పుచ్చుకుని పోయారు . కాన్వెంట్లో పిల్లల్ని చేర్చటానికి ఇంత హడావుడేమిటో?" అన్నాడు సుబ్రహ్మణ్యం కేబిన్ లోకి వచ్చిన భాస్కర్ తో . 
"అదే ఏమిటోనండీ. మా పని మనిషి కూడా నా బుర్ర తినేసి రోజూ వాళ్ళబ్బాయికి కోచింగ్ ఇప్పించుకుంటోంది. ఈ నెలకి జీతం కూడా వద్దనుకుంటోంది." అన్నాడు భాస్కర్ . 
" మై గాడ్!" అని తల పట్టుకున్నాడు సుబ్రహ్మణ్యం . 
" ఏమైంది సార్. మంచి నీళ్ళు కావాలా?"
"వద్దు . నా తల తిరిగి పోతోంది ." అంటూ వెనక్కి వాలిపోయాడు సుబ్రహ్మణ్యం. 
నిజం గా నర్సరీ సీటు ఇంత ప్రియమైపోయిందా?  కాలం మారిపోయిందా? మా కాలం లో జరిగినట్లు పిలిచి స్కూళ్ళలో సీట్లిచ్చే రోజులు అయిపోయాయా? ఇన్నాళ్ళూ లోకంలో ఎం జరుగుతోందో నేను పట్టించుకోలేదా?
సుబ్రహ్మణ్యం కళ్ళ ముందు తల్లిదండ్రులంతా తమ తమ పిల్లల వీపుల మీద బస్తాల్లా పుస్తకాల సంచులు వేసి తళ తళ మెరిసే ఇస్త్రీ బట్టలు తొడిగి గర్వంగా కాన్వెంటు కి తీసుకు పోతున్నారు . అరుణ్ గాడు ఇంట్లో అగ్గి పుల్లలు కాల్చుకుంటుంటే , అక్కడ  అతని హెడ్  క్లర్క్,డ్రైవరూ, ఆఖరికి  ప్యూన్ తాలూకు పిల్లలంతా కాన్వెంట్లో సోమిదేవమ్మల్లాంటి టీచర్ల దగ్గర చదువుకుంటున్నారు . 
"అమ్మో!" అంటూ లేచి నిల్చున్నాడు సుబ్రహ్మణ్యం . 
భాస్కర్ ఏమిటని అడిగే లోపు అతని గడ్డం పట్టుకుని "బాబూ నీకు ఉంటుంది, ఈ రోజుకి నా సీట్లో కుర్చుని పని చూసుకో! నేనిప్పుడే వస్తాను " అన్నాడు . 
"మీ సీట్లో కూర్చో మంటే కుర్చుంటాను కాని పనెలా చేస్తాను? మీకసలు పనంటూ ఉంటె కదా?"
"జోకులు తర్వాత భాస్కరం! నేను వెళ్తున్నా" అంటూ ఒక్క దూకులో రోడ్డు మీదకి గెంతి శర వేగం తో ఇల్లు చేరాడు . 
***
"సావిత్రీ! సావిత్రీ!" అంటూ తలుపు దగ్గర్నుంచే అరుస్తూ వస్తున్న భర్తని చూసి కంగారు పడుతూ "ఏమైందండీ?" అని అడిగింది  సుబ్రహ్మణ్యం భార్య .
"  అరుణ్  గాడి ఇంటర్వ్యూ కి సిలబస్ ఏది?" అడిగాడతను .
అరగంట తర్వాత నేల మీద మఠం వేసుకుని సిలబస్ చూస్తున్నాడు సుబ్రహ్మణ్యం .
సిలబస్ చూస్తున్న కొద్దీ అతని బుర్ర వేడెక్కసాగింది . రక రకాల పళ్ళు , పువ్వులు చూసి , (ఇంగ్లీషు లో) గుర్తించాలాట . వాడిని "వాటీజ్ యువర్ నేమ్?' అని అడిగితే వాడు తన పేరు ఇంగ్లీషు లో చెప్పాలట. అరుణ్ గాడికింకాతెలుగే సరిగ్గా రాదు. ఇక ఇంగ్లీషే0 మాట్లాడతాడు? ఆ మాట కొస్తే ఏలకుకాయ ని, ముళ్ళ  పందినీ  ఇంగ్లీష్ లో ఏమంటారో సుబ్రహ్మణ్యం కే తెలియదు .  గంట తర్వాత సుబ్రహ్మణ్యం నీరు కారిపోయాడు .
ఇవన్నీ చెప్పాలంటే తన వళ్ళ కాదు! వీడు ఇలాగే ఇంటర్వ్యూ కి వెళ్తే సీట్ కాదు కదా ఒక్క మార్కు  కూడా  రాదు. ఇప్పుడెలా?
సుబ్రహ్మణ్యం మనసులో ఓ మెరుపు మెరిసింది . నర్సరీ క్లాసు చెప్పే టీచర్ ని ఎవరినైనా ఈ వారం రోజులూ కోచింగ్  అడిగితే సరి! తర్వాత నర్సరీ టీచర్ వెంకాయమ్మ ని కలవటానికి  పట్టలేదతనికి .
కాని అతని గోడు పూర్తిగా వినకుండానే వెంకాయమ్మ ఘట్టిగా నవ్వేసి "నేనెలా చెప్తానండి? నేను టీచర్ ని . పేరెంట్ ని కాదు " అంది.
సుబ్రమన్యానికి కాసేపు ఆవిడ చెప్పింది అర్థం కాలేదు .
"నర్సరీ టీచర్ మీరే చెప్పలేనంటే ... "
"భలే వారే! మీకు  పాటాలేలా జరుగుతాయో తెలియదనుకుంటా !" అంది వెంకాయమ్మ .
అయోమయం గా చూసాడు సుబ్రహ్మణ్యం .
"మా పని రోజూ హోం వర్క్ ఇవ్వటమే! పిల్లలు ఇంటికి వెళ్లి పేరెంట్స్ చేత చేయించుకుని వస్తారు. 'గుడ్' అని కొంత మందికీ 'నాట్ బాడ్' అని కొంత మందికి నోట్సుల్లో రాస్తూ ఉంటె మా పని అయిపోయినట్లే!" అంది పదో క్లాసు పది సార్లు తప్పిన వెంకాయమ్మ .
సుబ్రహ్మణ్యం విచారం గా బైటికి వచ్చాడు . ఈసారి అతనికి భాస్కర్ గుర్తుకొచ్చాడు. "బ్రహ్మ చారి గాడు. ఖాళీ గా ఉన్నాడు కదా! అరుణ్ కేమైనా చెప్పగలడేమో!" అనుకుని గబగబా ఆఫీసు కి ఫోన్  చేసాడు. కాని మళ్ళీ సుబ్రహ్మణ్యం నీరు కారి పోయేలా భాస్కర్ 'నో' అనేసాడు .
" సారీ  సార్! సివిల్ సర్వీసెస్ కి కోచింగ్ ఇమ్మంటే ఇస్తాను గాని నర్సరీ కి  మాత్రం నా వాళ్ళ కాదండీ. చాల ప్రేపరషన్ కావాలి . మా పని మనిషి కొడుక్కి సీట్ రాకపోయినా పరవాలేదు కనుక ఏదో చెప్తున్నాను . మీ అబ్బాయి విషయం లో అలా చేయలేను  కదా?" అన్నాడు భాస్కర్ .
సుబ్రహ్మణ్యం ఇక గంగలోనే దూకాలనుకుంటుంటే - "ఓ పని చేయండి సార్!" అన్నాడు భాస్కర్.
"ఏమిటి?" ఆశ గా అడిగాడు సుబ్రహ్మణ్యం.
"క్లాసు వన్ లోనో టూ లోనో చదువుతున్న కుర్రాడు మీ వాడికి చాలా సులువు గా కోచింగ్ ఇవ్వ గలడు. అలాంటి వాడినేవడినైనా పట్టుకోం ...."
అతని మాటలు పూర్తయ్యే లోపు సుబ్రహ్మణ్యం శర వేగం తో రోడ్డు మీద పడ్డాడు సుబ్రహ్మణ్యం . మరి కొన్ని యుగాల్లో ఇల్లు చేరి మళ్ళీ "సావిత్రీ! సావిత్రీ!" అని గావు కేకలు పెట్టాడు .
"మీ గావు కేకలు తగలేట్టా! ఎవరైనా వింటే ఖూనీ జరగిందనుకుంటారు " అంది సావిత్రి కోపంగా .
"నాకు వెంటనే జవాబు ఇవ్వక పోతే నిజం గానే ఖూనీ జరుగుతుంది . మన చుట్టూ పక్కల  ఒకటో క్లాసు గానీ రెండో క్లాసు గానీ చదివే వాళ్లెవరైనా ఉన్నారా?"
"ఎవరో ఏమిటి? మీ చిన్నప్పటి స్నేహితుడని పరిచయం  గా  రామారావని?వాళ్ళబ్బాయి రెండో క్లాసు" అందామె తాపీగా .
సుబ్రహ్మణ్యం రామారావు దగ్గరికి బైల్దేరాడు . చిన్న నాటి స్నేహితుడై తన  కాలనీ లో ఉన్నా వాళ్ళింటికి ఒకే సారి మూడేళ్ళ క్రితం వెళ్ళాడు . ఆ మాట కొస్తే తను వెళ్ళింది వాళ్ళబ్బాయి కి కాన్వెంట్ లో సీటోచ్చిన సందర్భం గా జరిగిన పార్టీ కే. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ పని మీద వాళ్ళింటికి వెళ్ళటం బాధ గానే ఉంది . అయినా తప్పదు! రామారావు కొడుక్కి అరుణ్ ని అప్ప జెపితే ఇక తనకి నిశ్చింతే. కాని అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం నందనవనం అయిపోను .
.
రామారావు సుబ్రహ్మణ్యం సమస్యని ఓపిగ్గా విని "నువ్వు రెండు రోజుల క్రితం వచ్చినా బాగుండేది రా . మా వాడికి ఇప్పటికే పది మందయ్యారు .  ఇంత కంటే చెప్పటం వాడి వల్ల అయ్యే పని  కాదు " అన్నాడు తాపీగా .
సుబ్రమన్యానికి తను ఎ లోకం లో ఉన్నాడో అర్థం కాలేదు . భాస్కర్ చెప్పినదేదో బ్రిలియంట్ ఐడియా అనుకుని వీడి దగ్గరికి వస్తే అప్పటికే ఆ ఐడియా పది మందికి రావటమూ, వీడి కొడుకుని "బుక్" చేసుకోవటమూ జరిగిపోయాయి .

ఏడవలేక ఒక నవ్వు నవ్వి "ఇట్సాల్  రైట్ ! మీ వాడి క్లాసు మేట్స్ ఎవరైనా ...." అని అడగబోతుంటే "భలే వాడివే! అటువంటి అవకాశం ఉంటె ముందే చెప్పేవాడిని కదా! వాళ్ళంతా ఈ సీజన్లో చాలా బిజీ గా ఉంటారు "


సుబ్రహ్మణ్యం కళ్ళల్లో  తిరిగాయి .

"అయిపోయింది! అంతా అయిపొయింది . ఇక తననెవ్వరూ రక్షించలేరు . అన్ని వైపులా నుంచి అవకాశాలు చేజారిపోయాయి . ఇంత క్లిష్టమైన పరిస్థితి లో ఉంది కూడా ఏమి చెయ్యకుండా నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నందుకు తగిన శాస్తి జరిగింది . " అనుకున్నాడు సుబ్రహ్మణ్యం .

అతను రామారావుకి కనీసం వెళ్లోస్తానని కూడా చెప్పకుండా బైటికి నడిచాడు.గమ్యం లేకుండా రోడ్డు మీద ఎటో నడుస్తున్నాడు.ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు .  నిజానికి ఇంటికి వెళ్ళాక ఏమైన్దోనని ఆశగా ఎదురొచ్చే భార్య కి తను ఏం జవాబు చెప్పగలడు?


'పాపారావు 

డైరెక్టరు - అంబికా కానుమెంటు '

అని రాసి ఉన్న బోర్డు తాలూకు ఇంటి దగ్గర ఠపీమని ఆగిపోయాడు . తన జేబులోని కాగితం తీసి చూసుకుని అరుణ్ గాడు చేరవలసినది ఈ 'కానుమేంట్' లోనే నని నిర్ధారణ చేసుకున్నాడు. ఈ పాపారావు దగ్గరకెళ్ళి కాళ్ళ మీద పడతాను. జాలేసి సీటివ్వచ్చు. ఎలాగు పోయేదేమీ లేదు సంకెళ్ళు తప్ప .


సుబ్రహ్మణ్యం గేటు తీసి లోపలకు వెళ్లి తలుపు తట్టాడు.

నల్లగా చింతపండు రంగు లో ఉన్న ఒక బట్ట తల కళ్ళ జోడతను తలుపు తీయగానే సుబ్రహ్మణ్యం ముఖంలో రంగులు మారిపోయాయి .
"ఓరి ఓరి పాపారావంటే నాకంటే పదేళ్ళు ముందే చేరి నాతో పాటు చదువుకున్న (?) ప్రాణ స్నేహితుడు పప్పూ గాడా?" అంటూ ఆనందం గా అతనిని కౌగలించుకున్నాడు.
సుబ్రహ్మణ్యం ఆనందం పాత  స్నేహితుడిని చూసినందుకు కాదనీ, ఆ జిడ్డు మొహం ఏడుపు గొట్టు స్నేహితుడే అరుణ్ గాడు చేర బోయే కాన్వెంట్ కి డైరెక్టర్ అని తెలిసినందుకని ఎ తల మాసిన వెధవ కైనా తెలుస్తుంది .

"అయితే కాన్వెంట్ నడుపుతున్నావన్న మాట" ఓ పద్దతిలో అన్నాడు సుబ్రహ్మణ్యం .

"ఆ! ఏటుంది కాన్మెంటు నడిపీ టానికి? నలుగురు టీచరమ్మలని తోలుక రావటం, రెందేసొందలు పడీటం. " అన్నాడు పాపారావు .

"నీకేమిటి పిల్లలా? కాన్వెంట్ లోనేనా చదివేది?"

"ఆరుగురు పిల్లలు ఉండార్లే. పెద్ద పోరికీ చిన్న పోరికీ పెళ్లి చేసేసా . పోరళ్ళు డిల్లీ లో సదకతన్నారు . గవర్నమెంటు సోమ్మిస్తంటే ఈడ సదివే కర్మ ఆల్లకేంటి ? ఆల్లెవరూ అయిఏయస్సుకి తగ్గర్లే!" చెప్పాడు పప్పూ .

సుబ్రహ్మణ్యం మనస్సు చివుక్కుమన్నా 'మన బతుక్కి వీడి కాన్వెంటే గతి కదా!' అనుకుని మొహమాటం గా "మా వాడిని మీ కాన్వెంట్ లో చేర్చాల్రా . నువ్వు తల్చుకుంటే పనయిపోతుంది " అన్నాడు .


పప్పూ ముఖం గంభీరం గా అయి పోయింది .

"ఎంత పని సేసావు రా! నాల్రోలు ముందు రావాల ఇట్లాటివేతన్నాఉంటె! ఈడ ఒహటే కానుమెంటు. డిమాండు ఇపరీతం. నా సేతిలో నాలుగు సీట్లున్డాయి గానీ ఎమ్మెల్యే లెవెల్లో రికమండేషన్ లు జరిగిపోనాయి . ఐనా నా  పెయత్నం నే సేస్తా లే . కానీ ఖరారు సెయ్యలేను. ఈళ్ళు  మెరిటూ మెరిటూ అంట ఉండారు కందా! మీవోడ్ని కాస్త సదియించు. నా వేపు నేనూ సూత్తా" అన్నాడు .
సుబ్రహ్మణ్యం వసుదేవుడిలా పాపారావు చేతులు పట్టుకుని "గురూ! ఇవి నీ కాళ్ళే. కాస్త నా సంగతి గుర్తుంచుకో" అని చెప్పి ఇంటికి వచ్చాడు .

లాభం లేదు . తనే ఏదో రకం గా (ముందు తను నేర్చుకుని) అరుణ్ గాడికి చెప్పాలి . మరో దారి లేదు .

అప్పుడే ఇసకలో ఆడుకుని వచ్చిన అరుణ్ చేతిలోని బాట్ తో ఫ్రిజ్ మీద భడేల్మని కొట్టాడు .
"ఓరి భడవా!అలా కొడితే పాడయిపోదూ?" కోపం గా అన్నాడు సుబ్రహ్మణ్యం .
"బాట్ కేమీ కాలేదు నాన్న గారూ!" అని దగ్గరకోచ్చి చూపించాడు అరుణ్ .
అసలే శివమేట్టిపోతోందేమో సుబ్రహ్మణ్యానికి , అరుణ్ గాడి వంటి మీద పటపట మని దెబ్బలు పడిపోయాయి . వాడు ఏడుస్తుంటే అతను తల పట్టుకుని కూర్చున్నాడు .

తర్వాతేలాగో సర్దుకుని వారం రోజులూ రాత్రీ పగలూ కష్ట పడి అదుపులో ఉందని అరుణ్ గాడిని అవసరమైనప్పుడల్లా చితక్కొడుతూ ఎలాగో పరీక్ష, ఇంటర్వ్యూ అయ్యిందనిపించాడు సుబ్రహ్మణ్యం.జి  అరుణ్ గాడు ఇంటర్వ్యూ గురించి చెప్పిన దాని ని బట్టి వాడు బాగానే చేసాడనిపించింది . కానీ నెల రోజులనుంచీ పిల్లలకి కోచింగ్ ఇప్పించిన (ఇచ్చిన) తలిదండ్రుల పిల్లల కంటే వీడు బాగా చేసాడో లేదో !

ఇవే ఆలోచనలతో విచారం గా కూర్చున్న సుబ్రహ్మణ్యం కి ఎవరో చెప్పారు కాన్వెంట్లో నర్సరీ సీట్ల ఎలాట్ మెంట్ అయిందని . వెంటనే అదురుతున్న గుండెని చేత్తో పట్టుకుని వెల్లాడతను. అక్కడ గుంపులు గుంపులు గా పిల్లల పేర్లు చూసుకోవటాని వచ్చిన తలి దండ్రుల ని చూస్తే అతని గుండె చప్పుడు ఇంకా పెరిగి పోయింది .లిస్త్ చూసుకుని వస్తున్న చాలా మంది ముఖాలు విచారం గా ఉంటున్నాయి . ఇక ఆగలేక సుబ్రహ్మణ్యం జనాలని తోసుకుంటూ లిస్టు దగ్గరికి వెళ్ళాడు. లిస్టు దగ్గరే ఉన్నా వెనుకనున్న జనం పేర్లని నింపాది గా చూడనివ్వటం లేదు. ఒక్కొక్క పేరూ చదువుతూ కిందకు  కడులుతున్న కొద్దీ  టెన్షన్ పెడుగుతూ రక్త నాళాలు పగిలి పోతాయేమో అనిపిస్తోంది .
"టీ. అరుణ్ , సన్నాఫ్ టీ. సుబ్రహ్మణ్యం" అని కనిపించగానే తన కళ్ళు తానే  నమ్మలేక పోయాడు సుబ్రహ్మణ్యం. మరో సారి మరో సారి .. కనీసం పది సార్లు చూసుకున్నాడు. ఒక్క సారి గా మనసులో భారం దిగిపోయింది . అప్పుడు గంభీరం గా (గర్వం గా కూడా) బయటికి వచ్చాడు - సంతోషం అణుచుకుంటూ.
అతను (గాలిలో) నడుస్తూ వస్తూ ఉంటె , అతని కొలీగ్ ప్రసాద్ కనిపించి "ఏం సార్! పార్టీ ఎప్పుడు?"  అయినా మీ విషయం లో నాకేమీ అనుమానం లేదు లెండి . యు వారాల్వేస్  ఎక్ష్ లెంట్ " అన్నాడు .
"నాదేముందండీ! వాడు ఇంటర్వ్యూ బాగా చేసాడు సంపాదించుకున్నాడు"
"ఎవరండీ ఇంటర్వ్యూ బాగా చేయటం ? నేను చెప్పేది మీ ప్రమోషన్ గురించి"
"వాట్ ? నేను ప్రమోట్ అయ్యానా ?" ఆశ్చర్య పోయాడు సుబ్రహ్మణ్యం. కాని ఎందుకో అంత ఆనందం కలగలేదు మరి.
"హయ్యో!  తెలియదా? భాస్కర్ కూడా ఐయ్యేయస్ ఆఫీసర్ అయ్యాడు. మీరిద్దరూ పార్టీ ఇవ్వాలి "
"భాస్కర్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ కావటం , నేను మేనేజర్ కావటం పెద్ద గొప్ప విషయాలేమిటండీ " అన్నాడు సుబ్రహ్మణ్యం.
"అదేమిటండీ అయితే పార్టీ ఇవ్వరా?"
"తప్పకుండా ఇస్తాను . మా వాడికి కాన్వెంట్లో సీటొచ్సినందుకు తప్పకుండా ఇస్తాను" 

(సమాప్తం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్