ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఒక జీవిత కాలం - మొదటి భాగం

దిలీప్ కి చిన్నప్పుడు పుస్తకాల పురుగు, ఆదర్శ విధ్యార్థి వంటి బిరుదుల చాలా ఉండేవి. కాని ఎప్పుడూ తను చాలా మంది ముందు తను చాలా తక్కువ అనే అనుకునే వాడు. పోటీ తత్వం అనేది చిన్నతనం నుండి లేదు. ఏ పాఠమైనా పూర్తి గా చదువుకోవాలి అనే తప్ప పోటీ ఉండేది కాదు. ఒక సారి ఒక చిన్న పరీక్ష పెట్టి గురువు గారు మార్కులు ఇచ్చారు. దిలీప్ వెనక్కి ఇచ్చిన పేపర్ చూసుకుంటున్నాడు ఎక్కడెక్కడ తప్పులు చేసాడో నని. అప్పుడు వచ్చాడు అతని స్నేహితుడు అప్పల రాజు. 

"ఒరేయ్ నీకెన్ని మార్కులు వచ్చాయిరా?" అని అడిగాడు. 
"ఇరవై మూడు వచ్చాయిరా!" అన్నాడు. 
వాడు వాడి పేపర్ లో చూసుకుని "బలరామ్ కి ఎన్ని వచ్చాయి?" అన్నాడు. 
"తెలియదు రా!" అన్నాడు. అతనికి జవాబు చెప్పలేక పోయినందుకు కొంచెం బాధ కలిగింది. అప్పలరాజు అంతగా పట్టించుకోకుండా వెంటనే వెళ్లి బలరాం కి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుని వచ్చాడు. 
"వాడికి ఇరవై రెండు" అన్నాడు. "చలపతి కి ఇరవై" అని కూడా చెప్పాడు. 
"మరి నీకో?" అన్నాడు దిలీప్ నోరు తెరుచుకుని. 
"నాకు కూడా ఇరవై రెండు" అన్నాడు ఒక ముఖం పెట్టుకుని. 
"నీకే అందరి కన్నా ఎక్కువ వచ్చాయి" అన్నాడు మళ్ళీ. దిలీప్ కి  చిత్రం గా అనిపించింది తను ఇంత వరకూ ఇటువంటివి పట్టించుకోలేదని ఆశ్చర్యపోయాడు. 

గురువు గారు తన పేరు చదివి అందరి చేతా చప్పట్లు కొట్టించారు.ఆరోజు దిలీప్ కి చాల గర్వం గా అనిపించింది. అప్పటినుంచి దిలీప్ కూడా తన తోటి వారు ఎలా చదువుతున్నారో తెలుసుకోవటం మొదలు పెట్టాడు. ఆ అవసరం లేదనీ "సర్వ్ జనాః సుఖినోభవంతు" అని తెలుసుకోవటానికి జీవిత కాలం పట్టింది. అంతే కాదు మార్కులు  శాసించవనీ ఒక మనిషిలా బ్రతకటం అన్నింటి కన్నా ముఖ్యమనీ తెలుసుకోవటానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో?

ఒక రోజు దిలీప్, అప్పలరాజు కలిసి ఇంట్లో  చదువుకుంటుంటే,  చలపతి వచ్చాడు. "ఒరేయ్! మొన్న ఒక రోజు బడి కి రాలేదు కదా!నీ పుస్తకం ఇవ్వరా చదువుకుంటాను" అన్నాడు. ఇది తనకి కొత్త కాదు. అందరూ తన దగ్గరకి వస్తారు. వారికి తను పుస్తకం ఇచ్చే వాడు. కానీ ఇప్పుడు ఇవ్వబోతుంటే ... అప్పలరాజు దూరం నుంచి సైగ చేసాడు పుస్తకం ఇవ్వద్దని. దిలీప్ కి అర్ధం కాలేదు. అప్పటికే పుస్తకం చలపతి చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాడు వెళ్ళిపోయాడు. అప్పలరాజు కోపం గా దగ్గరికి వచ్చి "వాడి కెందుకిచ్చావు రా. వాడు నీ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నీకు బావుంటుందా?" అన్నాడు.   
"బాగుండదనుకో. కానీ అందుకని వాడికి నోట్సు ఇవ్వకపోతే ఎలా? వాడు ఆ రోజు రాలేదు కదా!....."
"వాడు స్కూల్ కి రాకపోతే మిస్సయిన క్లాసులు ఎలా చదువుకుంటాడో అది నీకనవసరం.  ఇప్పుడు నువ్వు వాడికి సాయం చేసావు. వాడు నీకవసరమైనప్పుడు సహాయం చేస్తాడో లేదో చూసుకో. అప్పుడు తెలుస్తుంది" 
"....."

నాన్న మా మాటలు విన్నట్టున్నారు. 

భోజనాల సమయం లో అడిగారు "ఏరా, చదువెలా సాగుతోంది?"
"బాగానే ఉంది నాన్నా" 
"నీ స్నేహితుడు చలపతి ఎలా చదువుతున్నాడు?"
"బాగానే చదువుతున్నాడనుకుంటా. కానీ ఈరోజు నా దగ్గరికొచ్చి నోట్స్ అడిగాడు. ఆ పాఠం ఇంకా చదవాలి. వాడు తిరిగి ఇచ్చాక చదువుతాను"
"వాడికి నోట్స్ ఇచ్చావా? మంచి పని చేసావు. లేకపోతే వాడెలా చదువుకుంటాడు?"
"కానీ వాడు ఆ పాఠం చదవకపోతే ఈసారి కూడా నాకే మొదటి స్థానం వస్తుంది కదా!" అన్నాడు.
నాన్న పకపకా నవ్వారు.
"నీకు మొదటి స్థానం వస్తే ఏం జరుగుతుంది?" అన్నారు.
"ఎప్పుడూ మనం ముందు ఉండాలి కదా?"
"అవును. కానీ ముందు ఉండటం అంటే నువ్వనుకున్న అర్ధం సరైనది కాదు. నీ చదువు నువ్వు చదువుకుని నీకు కావలసిన జ్ఞానం సంపాదించుకో. మార్కులదేముంది. అవి నీకు పెద్ద చదువులకి కావలసినంత వస్తే చాలు. అంతకన్నా ఎంత ఎక్కువ వచ్చినా అనవసరమే. కానీ ఆ చదువు నుంచి ఎంత జ్ఞానం సంపాదించుకున్నావో అది ముఖ్యం"

నీ లఖ్యం ఏమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. నీ లఖ్యం సాధించుకోవటానికి మొదటి స్థానం అవసరమైతే అప్పుడు  ప్రయత్నించు. కానీ అది నీ శ్రమ ఫలితం కావాలి తప్ప అందుకు మరొకడి వైఫల్యం అవసరం లేదు.

"కానీ రేపు నేనొక ఉద్యోగాని వాడితో పాటు ఇంటర్వ్యూ  వెళ్తే అప్పుడు నేను గెలవాలంటే వాడు ఓడిపోవాలి కదా?"
"నిజం! కానీ నువ్వు గెలవటం ముఖ్యమా వాడు ఓడిపోవటం ముఖ్యమా?"
దిలీప్ మాట్లాడ లేదు.

మర్నాడు చలపతి వచ్చాడు "ఒరేయ్ నన్ను క్షమించు. నిన్న నువ్విచ్చిన నీ నోట్స్ పోయిందిరా"
దిలీప్ నిష్చేష్టుడయయాడు. ఇంత మోసమా?

"ఎంత పని చేసావు రా? ఇప్పుడు నేనెలా చదువుకోవాలి?" దిలీప్ కళ్ళనుండి నీళ్ళు కారిపోయాయి.
"నన్ను క్షమించరా!  అసలు ఇది ఎలా జరిగిందో అర్ధం కావటం లేదు. ఇంటికి వచ్చి నా సంచి చూసుకుంటే పుస్తకం లేదు. దారంతా వెతికారా!"
దిలీప్ బాధ తట్టుకోలేక మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
నాన్న తో చెప్పాడు "నాన్నా! మీరు వాడికి నోట్స్ ఇమ్మన్నారు. కానీ నేనెంతో నమ్మకం తో ఇస్తే వాడిప్పుడు పుస్తకం పోయిందంటున్నాడు. ఇలా అయితే ఎవరినైనా ఎలా నమ్మాలి? ఇక ముందు చచ్చినా ఎవరినీ నమ్మను"

నాన్న ఓపిగ్గా విని అన్నారు "మనం అందరినీ నమ్మాలి. మోసపోయే వరకూ నమ్మాలి. కొంత మంది మోసం చేస్తారని అందరినీ నమ్మకపోతే ఎలా?"

"వీడిని ఇకముందు చస్తే నమ్మను"
నాన్న మళ్ళీ శాంతం గా అన్నారు "చలపతి కు కూడా నమ్మాలి"

"ఇంత జరిగాక కూడానా?"
"వాడు నిన్ను మోసం చేసాడో లేక నిజం గానే పుస్తకం ఎక్కడో పడిపోయిందో! నీకు ఖచ్చితం గా వాడు మోసం చేసాడని తెలిసిన రోజు వాడిని నమ్మటం మానెయ్యి"

దిలీప్ మాట్లాడలేక పోయాడు. అలా  జరిగి ఉండచ్చు. కానీ తను నమ్మలేకపోతున్నాడు. చలపతి మీద కసి తగ్గటం లేదు.

అప్పలరాజు అన్నాడు "వాడు ఖచ్చితం గా నన్ను దాటి మొదటి స్థానం చేరటానికి ఆ పథకం వేసాడు. అమాయకం గా పుస్తకం  అడిగి ఎక్కడో పారేసాడు."

ఈ విషయం నాన్న కి అర్ధం కావటం లేదు. ఇప్పుడు ఎం చెయ్యాలి? దిలీప్ వెళ్లి బలరాం ని నోట్స్ అడిగాడు.
"చలపతి నా నోట్స్ తీసుకున్నాడు రా. వాడు ఇవ్వగానే నీకిస్తాను"
అర్ధమయ్యింది. తన పోటీ దారులనందరినీ ఒకటే పద్ధతి లో అడ్డు తప్పించుకున్నాడు చలపతి.బలరాం కి ఏం చెప్పాలో అర్ధం కాక తలూపి వచ్చేసాడు. దిలీప్ చదివేది ఒక దుంపల బడి. కాస్త బాగా చదువుకునే వారు ఈ నలుగురే. వేరే వాళ్ళ దగ్గర నోట్స్ ఉండటానికి అవకాశం లేదు. ఇక తన టెక్స్ట్ బుక్ నుంచే నోట్స్ తయారు చేసుకోవాలి.

రెండ్రోజుల తర్వాత రాత్రి తలుపు చప్పుడయ్యింది.దిలీప్ వెళ్లి తలుపు తీసాడు. ఎదురుగా చలపతి!
ఒక్క సారి రక్తం మరిగిపోయింది. ఇంకా ఏమి చేద్దామని ? మిగిలిన సబ్జక్ట్స్ తాలుకు నోట్స్ కూడా తీసుకుంటాడా? నాన్న చెప్పిన ప్రకారం వాడు అడిగితే ఇవ్వాలి. వాడిని నమ్మాలి . మోసపోయే వరకూ నమ్మాలి! హు! ఇలా ఎంతో కలం జరగదు.

ఏమనాలో తెలియక చూస్తూ ఉంటే "ఒరేయ్! బలరాం దగ్గర నోట్స్ తీసుకుని అంతా రాసేసాను రా. ఇది తీసుకో. ఈ పుస్తకం  నువ్వు రాసుకున్నంత బాగా ఉండదు కానీ ఇంతకంటే ఏమీ చెయ్యలేక పోతున్నాను రా" అన్నాడు.

"ఏమిటి ? మొత్తం మనం ఇంత వరకూ జరిగిన పాఠాల మొత్తం నోట్స్ మళ్ళీ తిరగ రాసావా?" ఆశ్చర్యం గా అడిగాడు.

"మరేం చేస్తాం రా? నీ నోట్స్ లో ఉన్నదంతా పోయింది కదా?"

దిలీప్ కి  అర్ధం కావటానికి కొంత  సేపు పట్టింది.
వాడి భుజం మీద చెయ్యి వేసాడు.
"లోపలకి రారా! మనమిక్కడే కలిసి రోజూ చదువుకుందాం. నీకు కూడా నోట్స్ లేదు కదా!"

(మొదటి భాగం సమాప్తం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు