ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆరాధన

ఆరాధన 
రచన జనవరి 2014 లో ప్రచురింపబడింది 



ఆరాధన 


గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. దిలీప్ తలెత్తి చూసాడు .అప్పటికి తన సహోద్యోగులంతా వచ్చి ఉన్నారు. ప్రతి రోజూ ఇలాగే వస్తారు. కానీ ఇక్కడ అందరూ హాజరు కావాలని నియమం లేదు. అసలు రోజూ హాజరు ఇవ్వవలసిన పని లేనే లేదు. సాంకేతికంగా అనుకూలించటం వలన వారు ఈ పనులు ఎక్కడినుంచయినా పని చేసుకోవచ్చు. అంతా నమ్మకం మీద నడుస్తుంది. పని ఎంత జరిగింది అన్నది ముఖ్యం. ఎన్ని గంటలు పని లో కూర్చున్నారు అని కాదు. అతను అతని సహధ్యాయులూ అందరూ ఒకే పెద్ద గది లో కూర్చుంటారు. కేవలం పొద్దున్న ఒక రెండు గంటలు దిలీప్ తన కోసం కేటాయించిన చిన్న గది లో ఏమైయినా సున్నితమైన విషయాలు నిర్వహించటానికి కూర్చుంటాడు. ఎనిమిది గంటల తర్వాత నుండి ఆ గది తలుపు మీద "walk in" అని రాసి ఉంటుంది. అంటే ఎవరైనా ముందస్తు గా అనుమతి తీసుకోక పోయినా రావచ్చు. ఆ తర్వాత దిలీప్ పెద్ద గది లో కూర్చుని సహాధ్యాయులతో పని చేసుకుంటాడు. 


"స్నేహమంటే రోజు సరదా గా కలిసి కాఫీ తాగటం కాదు. అవసరమైనప్పుడు పక్కన ఉండాలి" 


చటుక్కున తలఎత్తాడు దిలీప్. బోధిసత్వ కార్యాలయం లో ఉద్యోగస్తులు టీవీ చూస్తున్నారు.(పని చేస్తూ టీవీ చూడటం ఇక్కడ తప్పు కాదు). టీవీ లో ఏదో ధారావాహిక లో కథ నాయిక కాబోలు అంటోంది. కాని ఈ మాటలు తను ఎప్పుడో విన్నాడు. ఇప్పటికీ మరిచిపోలేదు కూడా. మాధవి తన జీవితం లో ఎప్పటికీ ఉపయోగపడే ఇటువంటి ఎన్నో మాటలు చెప్పింది. ఆమె చెప్పినప్పుడు తను ఒక మామూలు మనిషి (తన స్నేహితుల భాష లో మబ్బు గాడు). వ్యావహారికం గా చెప్పాలంటే ఈరోజు ఎంతో మంది దృష్టి లో తను నిజం గానే చాల ముందుకు వెళ్ళాడు. ఒక పెద్ద సంస్థ కి అత్యుత్తమమైన అధికారి - సీఈఓ అంటారు తనని. కేవలం అదే కాకుండా తను ప్రారంభించి "స్వచ్చందం గా" నడిపిస్తున్న ఎన్నో స్వచ్చంద సంస్థలు తనకిష్టం లేకున్నా తన పేరు రోజూ తలుచుకుంటూ ఉంటారు. అయినా ఈ రోజు ఇంతకు ముందు తెలియని దిలీప్ ని చూసి మాధవి ఏమంటుందో అన్నది తనకి ముఖ్యం. ఎక్కడుందో మరి. 
మొదటి సారి మాధవి ని చూచినప్పుడు ఏమీ అనిపించలేదు. తను ముగ్గురు అన్నదమ్ములలో ఒకడు. చెల్లెళ్లు లేకపోవటం వలన అడ వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు. మాట్లాడాలని కూడా అనిపించేది కాదు. మధ్య తరగతి కి చెందటం వల్ల బైటకి వచ్చినప్పుడల్లా ఒక రకమైన బెరుకు ఉండేది. చదువు తప్ప మరొక ధ్యాస లేదు. ఆ చదువు ధ్యాస లోనే మాధవి ని ఆరాధించాడు. 


ఆ రోజులలో కంప్యూటర్ అంటే సినిమాలలో చూసే మర బొమ్మలని అనుకుంటూ ఉండే వారు. అదేదో మనకు సంబంధించినది కాదు చేయగలిగినది కాదు అనుకుంటూ ఉండే వాళ్లు. అటువంటి సమయం లో మాధవి కంప్యూటర్ లో అద్భుతాలు చేస్తుంటే మొదటి సారి గా ఆ అమ్మాయిని కలిసి అభినందించాడు. నిజం గా నిజాయితీ గా ఆలోచిస్తే తనను తాను అడిగితే అప్పుడు ఏదో ఆకర్షణ లోనే ఆ అమ్మాయిని కలిసాడెమో తెలియదు. ఆ రోజులలో తెలియని అమ్మాయిలతో మాట్లాడటం చాల అరుదైన విషయం. అంతే కాదు చాల ప్రమాదం కూడా ఉండేది. అయినా వెళ్లి పలకరించాడు. ఆడవారితో ఎలా మాట్లాడాలో తెలియక తన మగ స్నేహితులని సంబోధించినట్టే ఆమె ని ఏక వచనం లో సంబోధించాడు. తను ఏమీ అనుకో లేదనుకుంటా కాని ఒక రకం గా నవ్వింది. ఈ రోజు ఆ నవ్వు ఏమిటని ఆలోచిస్తే "ఎవరీ పద్దతీ పాడూ తెలియని చవట?" అని నవ్వుకుందేమో మరి. కాని ఎంతోకొంత నిజాయితీ గానే తన నుండి నేర్చుకోవాలనుకున్నాడు. ఆమె ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవటం వల్ల కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతుంది. తనకి అది కొంచెం కష్టం గా ఉండేది. అలాగే ఆమె పద్దతులు ఆ రోజులలో కొంచెం మాడరన్ గా ఉండేవి. ఇడ్లీ, కారప్పొడీ తప్ప మరొక టిఫిన్ తెలియని కుటుంబం నుండి తను వచ్చాడు. మిగిలిన స్నేహితులు (?) ఆ విషయంలో తనని ఎప్పుడూ వేళాకోళం చేస్తూ ఉండే వారు. అందుకని వారితో హోటల్ కి కానీ మరెక్కడికైనా వెళ్ళాలంటే భయం. అటువంటి వాడిని తనని మామూలు మనిషి గా చూస్తూ ఆమె మాట్లాడుతుంటే చాలా బాగుంటూ ఉండేది. 




ఆ రోజులు ప్రేమించలేదనో లేక తనతో సినిమాకి రాలేదనో అమ్మాయిలపై ఆసిడ్ పోసే రోజులు కాదు. అమ్మాయిలని ఆరాధించేవాళ్ళుతప్ప వాళ్ళ అనాటమీ మీద చర్చలు చేస్తూ కూర్చోలేదు. "ఓపెన్ మైండ్" పేరు తో చెత్త కబుర్లు మాట్లాడుకోవటం, గుప్తం గా ఉన్న భావాలని సరదా కబుర్ల పేరుతో వ్యక్త పరచటం వంటి ఆత్మవంచనలూ కపట నాటకాలూ లేవు . కాని ఇప్పుడు కుర్రవాళ్ల కున్న మనసు విప్పి మాట్లాడే ధైర్యం కూడా చాల మందికి అప్పుడు లేదు. అనుకోని పరిస్థితుల్లో ఆమె పరిచయం జరిగింది. 


తను కొత్తగా ఇంజనీరింగ్ లో చేరాడు. రాంక్ బాగానే వచ్చింది గాని మిగిలిన వారికున్న స్పీడ్ తనలో లేదు. కారణాలు ఎన్నొ. అందులో కొన్ని తనకి ఇంగ్లీష్ సరిగా రాకపోవటం, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి రావటం సనాతమైన కుటుంబం కావటం వంటి కారణాలు ఉన్నాయి. తన కాలోనీ లోనే రాజేష్ అనై ఒక అందగాడు, తన క్లాస్మేట్ ఉండే వాడు. వాడిది హీరో పర్సనాలిటీ. డబ్బు కూడా ఉంది. తల్లి తండ్రులు చాల పెద్ద ఉద్యోగాల్లో ఉండే వారు. ముప్పై ఏళ్ల క్రితం రోజుల్లోనే వాడు కార్లో కాలేజీ కి వచ్చే వాడు. వాడి వెనక ఎప్పుడూ ఒక పెద్ద మంద ఉండేది. తను అదే కాలనీ లో ఉండే వాడు. కాలేజ్ పది కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇంట్లో ఒక సైకిల్ ఉంది గాని అది అన్నయ్య వాడే వాడు. రాజేష్ ఎలాగా వెళ్తున్నాడు కదా తను కూడా వాడితో వెళ్ళవచ్చు అనుకునే వాడు గాని అలా జరిగే ది కాదు. మిగతా ఫ్రెండ్స్ లూనాల్లో టీవీఎస్ ఫిఫ్టీ లలో వచ్చి రాజేష్ ఇంట్లో పెట్టి వాడి కార్ లో వెళ్ళే వారు. తనని ఎందుకు రానిచ్చే వారు కాదో మొదట్లో తెలియలేదు. మెల్లిగా తెలిసిందేమిటంటే తన తొ వెళ్ళటం వాళ్ళ కి అవమానమని. తను దిట్టంగా తలకి నూనె రాసుకుని వదులైన చొక్కా, పాత ఫాంటు (నాన్న ఫాంటు సైజు చేయించుకుని) వేసుకుని వాళ్ళ తో తిరిగితే వారికి బాగుండదట. సాయి శ్రీనివాస్ అనే వాడు అందులో కొంచెం ఎక్కువ అవమానం చేసేవాడు. ఎవరో పిలుస్తున్నారనో, తనని పుస్తకాలు తీసుకుని రమ్మనో చెప్పే వాడు. తను ఆ పని చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు కాలేజీ కి వెళ్ళిపోతూ ఉండే వారు. అంతవరకూ వాళ్లతో వెళ్లిపోతాననుకున్నాక అప్పుడు పది కిలో మీటర్లు నడవాలని తెలిసే సరికి ప్రాణం ఉసూరుమంటూ ఉండేది. ఇక వాళ్ళ తొ పెట్టుకోకుండా తన మానాన నడుచుకుంటూ కాలేజీ కి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. నడక ఎంత అలవాటయ్యిందంటే టే ఎప్పుడో సైకిల్ మీద వెళ్ళే అవకాశం వచ్చినా కాలేజ్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు సైకిల్ విషయం మర్చిపోయి నడుచుకుంటూ వచ్చేసి అన్నయ్య దగ్గర తిట్టు తినే వాడు. 


మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉండేది. తన దగ్గర అన్నయ్య వాడిన ఎల్ స్క్వేర్ ఉండేది. మిగిలిన వారు అంతా మినీ డ్రాఫ్తెర్ తో వచ్చి ఎల్ స్క్వేర్ తో పని చేస్తున్న తనని చూసి నవ్వే వారు. తనకు తేడా ఏమిటో తెలిసే ది కాదు . ఎల్ స్క్వేర్ తొ కూడా డ్రాయింగ్ కి కావలసిన పనులు అన్నీ చెయ్యచ్చు కాని దాని ఖరీదు తక్కువ కనుక నవ్వాలా? మొదట్లో తనకి డ్రాయింగ్ సరిగ్గా రాలేదు. మొదట్లో ఇచ్చిన పని ఒక వృత్తాన్ని 36 భాగాలు చెయ్యాలి.మిగతా అందరూ అరగంటలో చేసి వెళ్ళిపోయే వారు. తన కి మూడు గంటలు సరిపోయే వి కాదు. వాళ్ళు అంత త్వరగా ఎలా చేయ్యగలుగుతున్నారో తెలిసే ది కాదు. . తను పది డిగ్రీలు కొలిచి డివైడర్ తో సర్కిల్ మీద మార్క్ చేస్తూ పోతుంటే ఆఖరి భాగం మిగిలిన భాగాల కన్నా చిన్న దై పోతోందని మళ్ళీ మొదలెట్టే వాడు. ఎన్ని సార్లు తన తోటివారిని అడిగినా వాళ్ళు "నువ్వు నేర్చుకోవాలి బాసూ, నీకు రావటం లేదు ..." అంటూ వెళ్ళిపోతూ ఉండే వారు.ఇక తప్పని సరి పరిస్థితి లో మాధవి ని సహాయం అడిగాడు. వెంటనే తన టేబుల్ దగ్గరి కి వచ్చి తాను చేసిన పని చూచింది. మాధవి నవ్వలేదు. "మీరు అప్పగించిన పనిని చాలా ఖచ్చితంగా చేయాలనుకుంటున్నట్టున్నారు. అంత ఖచ్చితం గా చేయవలసిన అవసరం లేదు. వృత్తం ఆఖరి భాగం కొంచెం చిన్నదయితే ఏమవుతుంది? ఒకట్రెండు మార్కులు తగ్గుతాయి.మీరు డివైడర్ తో మార్క్ చేసినప్పుడల్లా ప్రతి భాగం లోనూ కొంచెం ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఆఖరుకోచ్చే సరికి ఆ తేడా పెద్దదై పోతుంది. ఇది అందరికీ జరిగేదే మీరు ఇలాగే సబ్‌మిట్ చెయ్యండి" అంది. ఏదో అద్భుతమైన పరిష్కారం చెప్తుందేమో అనుకుంటే ఇదే విధం గా సబ్‌మిట్ చేయమందేమిటి, అని తాను అయోమయం గా చూస్తుంటే "నేను చేసిన వర్క్ చూడండి" అంది. వెళ్లి చూస్తే ఆమె చేసిన డ్రాయింగ్ కూడా అంత "గొప్ప" గానే ఉంది. అంటే అందరూ ఇలాగే సబ్‌మిట్ చేసి వెళ్ళిపోతున్నారా? 


"మెనీ టైమ్స్ క్విక్ అండ్ డర్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పెర్ ఫెక్ట్ బట్ లేట్" అంది మాధవి. నా వెర్రి ముఖం చూసి మళ్ళీ తెలుగులో అంది "చాలా సార్లు నూరు పాళ్ళు ఖచ్చితం గా చెయ్యటం కన్నా తొంభై పాళ్ళు ఖచ్చితం గా అయినా తొందరగా చెయ్యటం కూడా ముఖ్యం". 


అది నా మొదటి పాఠం. తర్వాత ఉద్యోగం లో చేరినప్పుడు ఆ విషయం చాల త్వరగా అర్ధం అయ్యింది. 
"మాధవీ ఈరోజు నాకు చాల ముఖ్యమైన విషయం తెలిసింది. చాలా థాంక్స్" అన్నాడు. తను నవ్వ్వేసి వెళ్ళిపోయింది. ఆ నవ్వు ఎంతో నచ్చింది. ఎందుకంటే అది నా మిగిలిన స్నేహితులు నన్ను చూసి రోజూ వేళాకోళంగా నవ్వే నవ్వులా లేదు. 
తర్వాత డ్రాయింగ్ లోనే ఆలోచించి చేయవలసిన పాఠాలు ప్రారంభమయ్యాయి. "పర్స్పెక్టివ్ వ్యూస్" (perspective views), "ఫ్రొజెక్షన్స్" (Projections) ఇలాంటివి అందరికీ అర్ధం కాలేదు. ఎందుకంటే చాలా ఊహ కావాలి. ఒక కారు పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో , పక్కనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో ఇవన్నీ ఊహించి బొమ్మలెయ్యాలి. అక్కడ కొచ్చే సరికి తన సోదరులు చతికిలబడ్డారు. తాను ఈ పనులన్నీ గంటలో చేసి కూర్చొనే వాడు. ఒక రోజు తననుఎప్పుడూ వీలైనంత అవమానం చేస్తుండె సాయి శ్రీనివాస్ ఇక తట్టుకోలేక "ఈ మబ్బు గాడు ఎలా చేస్తున్నాడు ?" అనేసాడు. తనువెంటనే "నువ్వు నేర్చుకోవాల్రా, నీకు అర్ధం కావటం లేదు" అందామనుకున్న్నాడు. కాని ఎందుకో ఆ పని తన వాళ్ళ కకాలేదు. అందరూ అంత నికృష్టం గా ఉండలేరేమో? "పద నీకర్థమయ్యేలా నేను చెప్తాను" అన్నాడు. అతను చేసిన అవమానాలు మర్చిపోయి సహాయం చేస్తానన్నా వాడు అవమానమే ఫీలయ్యాడు. ఎందుకొ వాడికే తెలియాలి. 


కాని కొంత మంది తనని మనిషి లా చూస్తున్నారని గమనించాడు. చాలా మంది మంచి స్నేహితులు దొరికారు. తప్పంతా తనలోనే లేదని గ్రహించాడు. మొత్తానికి తన మీద తనకు నమ్మకం పెరిగింది 


మాధవి తన కాలేజ్ లో ఉన్న NSS (నేషనల్ సర్వీస్ స్కీం) టీం లో చేరింది. ఆమె కి సమాజ సేవ చాలా ఇష్టం. తాను కూడా చెరాడు . ఆమె చేరిందనే తాను కూడా చేరాడా? ఏమో! నిజానికి తను ముందే చేరాడు గానీ మొదట్లో క్రమం తప్పకుండా వెళ్ళేవాడు కాదు. చాల మంది లా మానేయకుండా ముందుకు వెళ్ళటానికి మాధవి కారణం కావచ్చు. తమ కాలేజ్ ఆడిటోరియం కి తామే పునాది తవ్వారు. పిచ్చా సు పత్రి కి వెళ్లి అక్కడి రోగులతో కొన్ని రోజులు గడిపాడు. కొన్ని వందల చెట్లు నాటారు. చాలా పనులు మామూలు గా మా రోజు వారీ పనులలో చెయ్యని పనులు (ఇంట్లో కూడా చేయ్యనివీ) అందరితో కలిసి ఆడుతూ పాడుతూ చేసారు. అక్కడ కూడా మాధవి చాల నిష్ట తో పని చేసే ది. అందరితో కలుపు గోలు గ ఉంటూనే చాల హుందా గా ఉండేది. 


ఒక సారి తమ కార్యక్రమాలు పూర్తి అయ్యాక అయిపోయిన తర్వాత గురువు గారు అప్సర హోటల్ లో పార్టీ ఇచ్చారు (ఈరోజుల్లో లాంటి గాజు గ్లాసుల పార్టీ కాదు. అందరూ పొద్దున్నే పది గంటలకి వెళ్లి టిఫిన్ చేసారన్నమాట). అప్సర అప్పట్లో విశాఖపట్నంలో ఒక పెద్ద హోటల్. అక్కడ ఎలా తినాలో తెలియదు కనుక తనకు భయ మేసి తప్పిన్చుకున్దామనుకున్నాడు. కాని క్యాంపు లో అందరూ ఒక చోటే ఉండటం వలన తానొక్కడే తప్పించుకోవటం కుదరలేదు. అది కాక తన అంతట తాను వెళ్లి పోవాలంటే డబ్బులు కూడా లేవు. అక్కడికి వెళ్ళగానే హోటల్ గేటు దగ్గరే తనకు సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎటునుంచి హోటల్ లోపలికి వెళ్ళాలా తెలియక తికమక పడుతూ ఉంటే, సోదరుల వేళా కోలాలు ప్రారంభమయ్యాయి. తనకు భయ మేసి మాధవి పక్కన ఉన్న కుర్చీ దగ్గరకు గబ గబా వెళ్లి కూర్చొన్నాడు. నినాద్ గాడు కూడా మాధవి పక్కనే కూర్చో బోయి అప్పటికే ఆలస్యం కావటంతో తనకేసి వికారం గా చూసి ఎదురు గా కూర్చొన్నాడు. మిగిలిన వారు కుడా ఆ టేబుల్ దగ్గరే సర్దుకున్నారు. అందరూ తనకు తెలియని వీ అర్ధం కానివీ పదార్ధాలు ఆర్డర్ చేసారు. తను ఇడ్లీ చెప్పాడు. వెంటనే నవ్వులు. ఆ హోటల్ ఎటువంటి దో గాని ఇడ్లీ కూడా తను సరిగా తినలేడేమో అనిపించింది. రెండు ఇడ్లీలున్న పళ్లెంతో పాటు రెండు కత్తులూ, ఫోర్క్లూ ఇంకా ఏమిటో వచ్చాయి. కొంచెం సేపు చూసి తెగించి చేతితో తినటం ప్రారంభించాడు. వెంటనే స్టాలిన్ గాడు నవ్వు ప్రారంభించాడు "నువ్వు మారవు రా. ఎదగవు కూడా" అంటూ. 


"మీ ఇంట్లో ఎన్ని నూనె సీసాలు కొంటార్రా ?" అన్నాడు రాకేశ్ నున్నగా దువ్విన తన జుట్టు వైపు చూస్తూ. 


"వీడికి ఆ విషయం కూడా తెలియదేమో రా! ఎందుకంటే ఖర్చంతా వాళ్ళ అమ్మ గారిదే. వీడికి బస్సు డబ్బులు కూడా అవసరం లేదు కదా! నడిచొస్తాడు." అని నినాద్ గాడు. వాడి కోపానికి కారణం అర్ధం చేసుకొవచ్చు.కానీ మిగతా వారెందుకు? 
"ఇడ్లీ కాకుండా ఏదయినా నీకు తెలిసిన ఇంకో ఐటెం పేరు చెప్పు. నీకు పది రూపాయలిస్తా" 
"నీ జేబులో డబ్బులు ఎంతున్తాయిరా! ఒక రూపాయినా ఉంటుందా?" 
తన పక్కన మాధవి ఉండటం వలనా, ఆమె పక్కన కూర్చొనే అవకాశం నేను ఇవ్వకపోవటం వల్లనా నన్ను అవమానించటానికి వాళ్ళు చాలా రెచ్చిపోయారు. ఎంతో కష్టం తో భరించాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయేమో అని భయ మేసింది. ఎందుకు తన మీద వీళ్లకి ఇంత చులకన? తనెప్పుడూ వీళ్ళని శత్రువులు గా చూడలేదే? 
అతి కష్టం మీద టిఫిన్ తింటున్నాడు. అందరూ టిఫిన్ తినేసి కాఫీలు చెప్పారు. తను కూడా చెప్ప బోయే లోపల "వీడు మబ్బు గాడు. వీడికి హార్లిక్స్ గాని బోర్నువీటా గానీ ఇవ్వండి" అన్నాడు నినాద్ గాడు. మళ్ళీ నవ్వులు. 
"తనకి కావలసిన ది తనని చెప్పనివ్వండి" అంది మాధవి. అందరూ ఒక్క సారి నిశ్శబ్దమైపొయారు. నిజానికి ఆ మాటలు మాధవి కొపం గా కూడ అనలేదు. చాల మామూలుగా కానీ స్పష్టం గా అంది. అయినా ఆమె తన తరపున మాట్లాడుతుందని వాళ్ళు అనుకోలేదు. 
అంతా అయ్యాక తను ఇంకా తింటుంటే వాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ "మీరు రండి వాడు ఇప్పట్లో రాడు" అన్నాడు స్టాలిన్ మాధవి తో. 
"ఒక్కరినీ ఎలా వదిలేస్తాం? నెనుంటాన్లెండి" అంది మాధవి. వాడు మళ్ళీ నావైపు వికారం గా చూసి వెళ్ళిపోయాడు. 
"చాలా థేంక్స్ అండి. కాని మీరు వెళ్లి చేతులు కడుక్కోండి " అన్నాడు. 
"ఎందుకండీ? ఒకరిని వదిలి ఎలా వెళ్ళిపోతాం? పది నిముషాల్లో ఇద్దరం వెళ్ళవచ్చు " 
"లేదండీ. మీకు బోరే మో. నాకు చాలా విషయాలు తెలియదు. ఇంగ్లీష్ సరిగా రాదు. టేబుల్ మానేర్స్ తెలియవు. నేనంటే నా స్నేహితులకి అందుకే చిరాకు...." 
"మీరు తెలిసిన ప్రతివాళ్ళనీ స్నెహితులంటుంటారా? స్నేహమంటే రోజు సరదా గా కలిసి కాఫీ తాగటం మాత్రమే కాదు. అవసరమైనప్పుడు పక్కన ఉండాలి" అంది మాధవి. 
*** 
హఠాత్తుగా ఫోన్ మోగింది. మూర్తి అటునుంచి. 
"దిలీప్! మాధవి ఎక్కడుందో తెలిసింది" గట్టిగా అన్నాడు. వాడి గొంతులో ఉద్వేగం తెలుస్తోంది 
ఒక్క క్షణం దిలీప్ గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభించింది. "నిజమా?" అన్నాడు. ఎప్పటికైనా ఆమె ని కలుస్తానని అనుకోలేదు. కాని మూర్తి కి తెలుసు తన మనసులో ఏముందీ. ఇంత అద్భుతమైన జీవితం అని అందరూ అనుకుంటున్నా తన మనసు లో ఉన్న ఒక్క వెలితి అతనికి తెలుసు. మరి వాడు నా స్నేహితుడు. 
"తను అమెరికా లో ఉంది . అడ్రస్ కూడా తెలుసుకున్నాను ...." 
"టికెట్స్ బుక్ చేశావా?" 
ఒక్క క్షణం నిశ్శబ్దం. "చేశాను.ఎల్లొండికి చేసాను " 
"అంత కన్న ముందు కుదరదా?" 
"కనుక్కుంటాను" మూర్తి మళ్ళీ ట్రావెల్ ఏజెంట్ కి ఫొన్ చెసాడు. మరొక పది నిముషాల్లో దిలీప్ ఫొన్ చెసాదు. 
"మూర్తీ. చాల థేంక్స్ రా. నన్ను క్షమించు మాధవి గురించి తెలిసింది అనగానే నాకు కాసేపు ఏమీ తెలియలేదు. ఎంత తొందరగా వెళ్దామా అన్న ధ్యాస లో సరిగా మాట్లాడ లేదు. నా వెనక తోడు గా ఉంటూ నా కోసం ఎంత చేసావు రా!" అన్నాడు. 
'ఏడిసావ్లే" ఫొన్ పెట్టెసాడు మూర్తి. ఇంత ముఖ్యమైన విషయం చెప్పిన తర్వాత వాడు వెంటనే టికెట్స్ గురించి మాట్లాడితే తను కూడా కొంచెం నొచ్చుకున్నాడు. కానీ దిలీప్ అంత త్వరగా మారిపోడు. వాడికి హృదయం ఉంది. అందుకే వెంటనే మళ్ళీ కాల్ చేసి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తి వాడి దగ్గర ఉద్యోగం చేస్తున్నా బైట ఇద్దరూ ఇప్పటికీ స్నేహితులే. 


నాలుగేళ్ల చదువులో దిలీప్, మాధవి తో చాలా స్నేహం పెంచుకున్నాడు. కాని ఆ స్నేహం ఆ ఎప్పుడూ ఒక దేవత ని అరాదిస్తున్నట్లుండేది. 
నాలుగేళ్ల చదువు అయ్యాక దిలీప్ ఖరగ్ పూర్ లో చేరాడు. ఆ రోజు ఒక్క డే రైలు ఎక్కాడు. విశాఖపట్నం దాటి ఒంటరిగా వేరే ఊరు వెళ్ళటం అదే మొదటి సారి. అంతే కాదు, ఖరగ్ పూర్ బెంగాల్ లో ఉంది. తనకి ఇప్పటికీ ఇంగ్లీష్ అంత బాగా రాలేదు. ఇక పరభాషా ప్రాంతంలో ఎలా ఉంటుందో? చాలా ఒంటరితనం గా దిగులు గా కూర్చొన్నాడు. అన్నయ్య ఐ ఐ టీ లో చేరినప్పుడు దాదాపుగా 25 మంది వచ్చి సాగనంపారు. అప్పుడు నాన్న ఉన్నారు. ఈరోజు ఎవరూ రాలేదు. అమ్మ ఇంట్లో దిగులు గా ఉంది. అందరూ ఇంటి దగ్గరే ఉండి పోయారు. రైలు కదల గానే దిగులు ఇంకా పెరిగింది. 
ఒక్క డూ కూర్చొంటే ఒక కుర్రాడు వచ్చి "నువ్వు కూడా ఖరగ్ పుర్ కే కదా!" అన్నాడు. 
"అవును" అన్నాడు తను. 
"పద అక్కడ మన గ్యాంగ్ ఉంది. నువ్వు కూడా చేరిపో" అన్నాడు. ఇంకా అయోమయం గా చూస్తుంటే "నా పేరు మూర్తి. పద మరి" అన్నాడు తన సామానులలో రెండు తీసుకుని. 
అక్కడికి వెళ్ళే సరికి పది మంది కూర్చొని పేక ఆడుతున్నారు. 
"మరొక మెంబర్ గురూ !" అన్నాడు మూర్తి. ఆ గ్యాంగ్ మధ్యలో దీనం గా కూర్చొన్న ఒక పెద్దాయనని "సార్. మిమ్మల్ని 11 వ బెర్త్ కి తీసుకెళ్లాం" అన్నాడు మూర్తి. ఆ అడగటంలో ఒక అందం ఉంది. ఆయన అభిప్రాయం అడగ లేదు మూర్తి. తన నిర్ణయం చెప్పాడాయనకి. అయినా ఆయన ఆనందం గా లేచాడు. 


తనకి పేక రాదు. కాని ఆ విషయం చెప్ప లేదు. "మీ బలహీనతలు తెలిసే వాళ్ళకు ఎలాగూ తెలుస్తాయి. మీ అంతట మీరు చెప్పవలసిన అవసరం లేదు." అని చెప్పింది మాధవి. బాగా గుర్తు పెట్టుకున్నాడు. ఆమె తనని మీరు అనేది. తను మొదటి నుంచి నువ్వు అనే వాడు. అయిన మిగిలిన వారితో గౌరవం గా మాట్లాడాలని ఆమె నుంచి నేర్చుకున్నాడు. తను పని మనిషి తో సహా అందరినీ "మీరు" అని సంబోధిస్తుంటే కొంతమంది నవ్వే వారు. కొంత మంది చిరాకు పడే వారు. కాని తను పట్టించుకోలేదు. ఆ పట్టించుకోక పోవటం కూడా మాధవి నుంచే నేర్చుకున్నాడు. 
"ఈ ఆట ఎప్పుడూ ఆడలేదండీ" అన్నాడు పేక ఎప్పుడూ ఆడ లేదని అనకుండా. "నో ప్రాబ్లం. నేను చెప్తాను" అన్నాడు ఒకడు. షారుఖ్ ఖాన్ లా ఉన్నాడు. పేరు కన్నబాబని తర్వాత తెలిసింది. 
నెమ్మదిగా ఆటలో పడ్డాడు. రైలు ఖరగ్ పుర్ చేరే సరికి చాల మంది ఫ్రెండ్స్ అయ్యారు. వారిలో ఎవరూ తనని గేలి చెయ్యడం లేదు. ప్రతి వాడికి మిగిలిన వారి మీద గౌరవం ఉంది. ఆ అనుభవం చాలా బాగుంది. తన బెంగ పోగొట్టుకోవటానికి అందరితో స్నేహం చేసుకున్నాడు. రీసెర్చ్ స్కాలర్స్ , టీచర్స్ ,స్టూడెంట్స్ , హాస్టల్ స్టాఫ్ , అందరితో స్నేహం పెంచుకున్నాడు. మాధవి గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక తనతో మళ్ళీ మాట్లాడే అవకాశం లేదు . 
తండ్రి పరీక్షల టైం లో చనిపోవటం, పరీక్షలు అలాగే బెంగతో వ్రాయటం , తర్వాత ఇక్కడ అడ్మిషన్ రావటం వరసగా జరిగిపోయాయి. ఒక సారి మాధవి కనిపించింది. కాని అప్పుడు ఏవో నో అబ్జక్సన్ లెటర్స్ తీసుకుంటున్నాడు. తండ్రి పోయిన తర్వాత అందరూ పరామర్శలు చేస్తుంటే ఎవరినీ కలవాలనిపించేది కాదు. ఆమె కనిపించినప్పుడు కూడా ఏదో బెరుకు గా అనిపించింది. ఆమె బహు శా తనని పలకరించాలని అనుకుని ఉందని అనిపించింది. కానీ ఆగిన తర్వాత ఆమె తన తో మాట్లాడకపోతే? అందుకని తనే ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోయాడు. అలా ఎందుకు చేశాడో ఇప్పటికీ అర్ధం కాలేదు. ఆమె జ్ఞాపకం వస్తూనే ఉండేది. 


నిజానికి తను ఆఖరి పరీక్ష వ్రాసినప్పుడు భయ పడుతూ ఆమె ని ఫోటో అడిగాడు. ఆమె అదోలా చూస్తే "మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు. ఒక ఫోటో ఇస్తే అది జ్ఞాపకం గా ఉంటుంది" అన్నాడు. ఒక రకం గా మనం ఇక కలవం అని చెప్పేశాడు. ఆమె మర్నాడు మౌనం గా ఫోటో ఇచ్చింది. బహుశా అందుకే ఆ తర్వాత ఆమె కనిపించినా, మళ్ళీ ఆమెతో మాట్లాడటం ఇబ్బందిగా అనిపించిందేమో! ఆరోజుల్లో అమ్మాయిలూ ఎవరికీ ఫోటోలు ఇచ్చేవారు కాదు. ఇచ్చారంటే ఎంతో నమ్మకం ఉన్నట్టే. 


ఇప్పుడు ఎంత మంది తో స్నేహం చేసుకున్నా ఎన్ని కబుర్లు , జోకులేసుకున్నా రూం లో వచ్చాక ఒంటరితనం భయంకరం గా ఉండేది. మాధవి ఫోటో చూసుకుంటూ గడిపే వాడు. తను ఎదురుగా ఉన్నట్టే ఉండేది. ఆమె దగ్గర ఎందుకో ఒక రకమైన ధైర్యం, నిశ్చింత అన్నింటినీ మించి కొలత లేని అభిమానం ఉండేది. మూర్తి లాంటి స్నేహితుడు అప్పటికింకా దగ్గర కాలేదు. తనకి డిగ్రీ లో కూడా స్నేహితులు ఉన్నారు. ఏమైనా అసైన్‌మెంట్ చెయ్యాలంటే తన సహాయం కోసం వచ్చే వారు. ఏదేనా స్ట్రైక్ చేసేటప్పుడు తన లాంటి "మబ్బు గాడు" ఎక్కడ సపోర్ట్ చెయ్యడో అని బతిమాలడానికి వచ్చే వారు. వాళ్ళేదైనా పిక్నిక్ కి పోయినా మరేం చేసినా తాను గుర్తొచ్చేవాడు కాదు. వారి సంతోషం లో తను ఉండడు. వాళ్ళ కష్టాల్లో తను కావాలి. మాధవి దగ్గర మాత్రమే తనకి అటువంటి అనుభవాలు కలగలేదు. అంతే కాదు,తన వల్ల కానిదేమైనా ఉంటే సహాయం అడగటానికి మాధవి మాత్రమే ఉండేది. మిగతా అందరూ తన దగ్గరి కి రావాలి తప్ప వారు తనకి చేసే ది ఏమీ లేదు. 
ఖరగ్పూర్ లో దౌర్భాగ్యం అని ఒక స్నేహితుడుందే వాడు. వాడు ఒక సారి నా పాత యూనివర్సిటీ కి వెళ్ళానన్నప్పుడు ఎంత సిల్లీ గా అనిపించినా "మాధవి అని ఎవరైనా కనిపించారా?" అని అడిగాడు.తను ఆశ్చర్యంతో కిందపడేలా "కలిసానండీ" అన్నాడు వాడు. 
"ఎలా?" అన్నాడు . 
"ఆ అమ్మాయి అక్కడే రీసెర్చ్ చేస్తోంది" అన్నాడు . 
వాడు కలిసినదీ తనకు తెలిసిన మాధవీ ఒకరేనా అని అపనమ్మకం తో చూస్తుంటే "లూనా మీద వస్తుంది ఆమే కదా!" అన్నాడు. నిజమే. మాధవి లూనా నడిపేది. "ఎప్పుడూ నవ్వు ముఖం తో ఉంటుంది" అని కూడా అన్నాడు. ఇది ఖచ్చితం గా నిజం. 
భయపడుతూ భయపడుతూ ఒక ఉత్తరం యూనివర్సిటీ అడ్రస్ కి వ్రాశాడు. తన ఇంగ్లీష్ కొంత ఇంప్రూవ్ అయ్యింది గాని అయినా భయమే. అసలు ఉత్తరం వ్రాస్తే ఏమనుకుంటుందో కూడా భయమే! ఉత్తరం పోస్ట్ చేశాడు కాని ఏమవుతుందో అని భయపడుతూనే ఉన్నాడు. జవాబు రాదని ఖచ్చితం గా నమ్మాడు. ఒక రోజు మెస్ లో భోజనం చేస్తుంటే నగేష్ వచ్చి ఒక లెటర్ చూపించాడు. ఫ్రం అడ్రస్ లో మాధవి పేరుంది. వాడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. తను చాలా బాధ పడిపోయాడు. మాధవి తనకెందుకు జవాబు వ్రాయలేదు? మధ్యలో ఈ దౌర్భాగ్యం గాడికి ఎందుకు వ్రాసింది? వాడు ఆనందం గా నవ్వుకుంటూ తిరగటమేమిటి? తనకు జవాబు కూడా రాకపోవటమేమిటి? తను అలా భాధ తో రగిలిపోతుంటే ఉంటే దౌర్భాగ్యం మళ్ళీ వచ్చి 'ఏమి వ్రాసింది గురూ?' అన్నాడు. 
"నాకేం తెలుసు?" అన్నాడు . 
"నీకు వ్రాసిన ఉత్తరం లో ఏముందీ నీకు తెలియాలి కదా?" 
ఆశ్చర్యం తో మళ్ళీ కవర్ చూచాడు. ఉత్తరం తనకే! తనకే వచ్చింది. తనే చూసుకోలేదు. వాడు ఉత్తరం చూపిస్తే వాడికి వచ్చిందని గొప్ప గా చూపించాడని అనుకున్నాడు. తను సంతోషిస్తాడని తెచ్చి చూపించాడని అనుకోలేదు. 
వెంటనే రూం కి వెళ్లి ఉత్తరం చదివాడు.3 పేజీలు ఉన్న ఆ ఉత్తరం ఎన్ని సార్లు చదువుకున్నాడో తెలియదు. తర్వాత ఎన్నో రోజులు ఎంతో గర్వం గా తిరిగాడు. అందరూ తననే చూస్తున్నట్టు ఊహించుకునే వాడు. ఉద్యోగం లో చేరాక కూడా ఉత్తరాలు ఆగ లేదు. తన ఉద్యోగం లో జరిగే విషయాలు అన్నీ చెప్పే వాడు. తన సలహాలు చెప్పే ది. తన రీసెర్చ్ గురించి వ్రాసే ది. ఆమె ఉత్తరాలు తన ఒంటరితనాన్ని మరిచిపోయేలా ఉత్సాహానికి జీవం పోశాయి. 
*** 
"గురూ! ఇంకో గంటలో బయలుదేరు. ఫ్లైట్ దొరికింది"అని మూర్తి చెప్పటం తో ఉలిక్కిపడ్డాడు దిలీప్ . మరొక రెండు గంటల్లో ఫ్లైట్ లో ఉన్నారు ఇద్దరూ. 
మూర్తి న్యూయార్క్ లో తమ మేనేజర్ కి ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్, దారి కనుక్కొంటున్నాడు. దిలీప్ కి చాలా ఉద్వేగం గా ఉంది. ఇరవై ఏళ్ల తర్వాత మాధవి ని చూడబోతున్నాడు. తను ఎలా చూస్తుంది. తన ఎదుగుదల చూసి ఆశ్చర్య పోతుందా? గర్వ పడుతుందా! అభినందిస్తుందా ? 


ఉద్యోగం లో చేరిన కొత్త లో తనకి విద్యుత్ కర్మాగారంలో మైంటెనన్స్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఏం పనులు పెండింగ్ లో ఉన్నాయా అనుకుంటూ లాగ్ బుక్ చదివాడు. బాయిలర్ లో ఆయిల్ గన్ ఒకటి పని చెయ్యటం లేదు. బొగ్గు తో పని చేసే బాయిలర్ కి ఆయిల్ గన్ పని చేయటం చాల ముఖ్యము. ఎప్పుడైనా బొగ్గు తక్కువైతే మంట స్థిరం గా ఉండటానికి ఆయిల్ వాడతారు. ఏ కారణం వల్లనైన ఆయిల్ గన్ స్థిరమైన అగ్నిజ్వాల లేనప్పుడు పని చేయక పోతే బాయిలర్ విస్పోటనం కూడా జరగచ్చు. తను జాయిన్ అయ్యిన మూడు రోజుల క్రితం అప్పాజీ అను సీనియర్ ఇంజనీర్ ఆ పని తీసుకున్నాడు. 3 రోజులనుంచి ఆ పని పూర్తి కాలేదు. అప్పాజీ ఎక్కడున్నాడో తెలియదు. అతని కింద పని చేసే వారు కూడా అతను మూడు రోజుల నుంచి కనపడటం లేదని చెప్పారు. అతను ఇప్పటి వరకూ ఎం చేశాడో కూడా లాగ్ బుక్ లో రాసి లేదు. ఇక లాభం లేదని తను బాయిలర్ దగ్గరి కి వెళ్ళాడు. గన్ తాలూకు స్పార్క్ ప్లగ్ పని చెయ్యటం లేదు. వెంటనే కొత్త ప్లగ్ స్టోర్ నుండి తెచ్చుకుని మార్చేశాడు. గన్ పని చేస్తుందని నిర్ధారించుకుని వర్క్ ఆర్డర్ క్లోజ్ చేశాడు . ఈ లోపు తన మేనేజర్ వచ్చాడు. 
"అప్పాజీ ఏడి ?" 
"తెలియదు సర్!" 
"వాడు రాగానే ఇద్దరూ రండి" 
మర్నాడు అప్పాజీ వచ్చాడు. అతను డిగ్రీ లో గోల్డ్ మెడలిస్ట్. చాలా పుస్తకాలు కూడా రాశాడు. 
రాగానే అడిగాడు "బాస్ నీ కోసం వెతుకుతున్నారు" 
"అలాగా. నేను దాదాపు పని పూర్తి చేసానండి. ఆయనకీ చెప్తాన్లెండి" 
"ఏం పని?" 
"అదే ఆయిల్ గన్ ఒకటి పని చెయ్యటం లేదు.స్పార్క్ ప్లగ్ పాడయ్యింది" 
తను ఆశ్చర్య పోయాడు. ఈ పని మీదనే ఇన్నాళ్ళు పని చేస్తున్నాడా? 
"ఏం చేసారు ఇంత వరకూ?" 
"మొట్ట మొదట లైబ్రరీ కి వెళ్లాను (???). స్పార్క్ ప్లగ్ ఎలా తయారు చేస్తామో తెలుసుకున్నాను. తర్వాత పాడయ్యిన స్పార్క్ ప్లగ్ చూచాను. ఎలా రిపేర్ చెయ్యా లో తెలిసిపోయింది. ఇక రెండు రోజులలో బాగు చేసేస్తాను" వెలిగి పోతున్న ముఖం తో చెప్పాడు అప్పాజీ. 
"ఆ పని అయిపోయింది. నేను కొత్త స్పార్క్ ప్లగ్ పెట్టేసాను" 
"అరె! రిపేర్ చెయ్యకుండానా. అందులో (రీప్లేస్ చెయ్యటం) లో గొప్పేముంది?" నిస్పృహతో అన్నాడు అప్పాజీ. 
"గన్ పని చేస్తోంది కదా!" 
"మరి పాడయిపోయిన దాని సంగతి?" 
"అంత కన్నా ముఖ్యం గన్ పని చెయ్యటం కదండీ?ఈ లోపల ఎప్పుడయినా గన్ అవసరమొస్తే ?" 
"..." 
"గన్ పని చెయ్యకపోతే ఏ క్షణమైనా ప్రమాదమే కదండీ?" మళ్ళీ అన్నాడు దిలీప్. 
"నిజమేననుకోండి. కాని మన చదివిన చదువు కి మనం పర్ ఫెక్ట్ గా పని చెయ్యాలి కదా!స్పార్క్ ప్లగ్ మనటెక్నీషియన్ కూడా మార్చగలడు " 
"నిజమే. కాని చదివిన జ్ఞానం ఉపయోగించటం తో పాటు ఇక్కడ ఏది ముఖ్యం అన్నది కూడా చూడాలి కదా! ఈ మూడు రోజులలో ఏ కారణం వల్లనయినా ఆయిల్ గన్ లేకపోవటం వలన ప్రమాదం ఏదేనా జరిగి ఉంటే మనందరికీ నష్టం అయ్యుండేది కదా?" 
"నిజమేనండీ" మన స్పూర్తి గా అన్నాడు అప్పాజీ. ఇతనికి చదువుతో పాటు తప్పు ఒప్పుకునే సంస్కారం కూడా ఉంది. వ్యావహారికం గా పని చెయ్యటం రాదు కాని ఆ విషయం వప్పుకుంటే అతి త్వరలో నేర్చుకోగలడు. 
"చాలా సార్లు నూరు పాళ్ళు ఖచ్చితం గా చెయ్యటం కన్నా తొంభై పాళ్ళు ఖచ్చితం గా అయినా తొందరగా చెయ్యటం కూడా ముఖ్యం " 
నవ్వుతూనే అన్నాను. అతను కూడా నవ్వాడు కానీ అందులో నేను చెప్పిన దానికి అంగీకారం ఉంది. 
నాలో నేనే ఆశ్చర్య పోయాను. నేను మరొక మనిషి, అది కూడా ఒక గొప్ప చదువు తో వచ్చిన పై స్థాయి ఉద్యోగి కి ఏది సరైన పద్ధతో చెప్తున్నానా? థేంక్స్ మాధవి! 


తర్వాత దిలీప్ కంపెనీ మారాడు. అక్కడ మూర్తి ని కూడా తెచ్చుకున్నాడు. మూర్తి కి తన గురించి, మాధవి గురించి తన ఫీలింగ్స్ అంతా తెలుసు. తను అతనికి ఎప్పుడూ సూటిగా చెప్పలేదు కాని నిజమైన స్నేహితులకి చెప్పవలసిన అవసరం లేదు. అతి త్వరలోనే దిలీప్ సొంత కంపెనీ ప్రారంభించాడు. కంపెనీ లో కేవలం పనిలో ప్రావీణ్యం మాత్రమే కాకుండా ఫలితం కోసం పని చెయ్యటం, ఫలితం ఏమి కావాలీ ముందే తెలుసుకొని పని చెయ్యటం నేర్పించాడు. పని తో పాటు స్వంత బాగోగులు కుడా చూసుకోవటానికి అవకాశాలు కల్పించాడు. అందరూ స్వచందం గా సమాజ సేవ కొంతైనా చెయ్యాలి. సమాజ సేవ అంటే ఒక చెక్ ఇచ్చి చేతులు దులుపు కోవటం కాదు. ఇది కూడా మాధవి దగ్గర తెలుసుకున్నదే. 


కాలేజీ రోజులలో ఒక సారి తమ కార్యక్రమాలలో భాగం గా బడుగు వర్గాల వారికి కడుతున్న ఇళ్లు సరిగ్గా కడుతున్నారా లేదో తనిఖీ చేసే బాధ్యత తీసుకున్నారు. మాధవి తనూ ఒక బృందం లోనే ఉన్నారు. సిమెంట్, ఇసుక సరిగా కలుపుతున్నారా చూసి నిర్ధారించటం తమ పని. అక్కడ ఉన్న బడుగు వర్గాల వారి నాయకుడి లాంటి ఒకతను తమ దగ్గరి కి వచ్చి గౌరవం గా టీ ఇచ్చాడు. 
"మీరు చాలా సహాయం చేస్తున్నారు బాబూ! మీ ఋణం తీర్చుకోలేము" అన్నాడు 
"అదేమిటండీ! ఇది ప్రభుత్వం చేస్తోంది. మేము కూడా మా వంతు చేస్తున్నాం" అన్నాడు తను. 
"అయినా ఇది మాకు చాలా సహాయం బాబూ! మాకు ఏమి తెలుస్తుంది ఇంజనీర్ బాబు మోసం చేస్తే?" 
"వాళ్ళు మోసం చెయ్యరు. ఇది ఒక రకం గా చెప్పాలంటే పద్ధతి ప్రకారం మేము పర్యవేక్షణ చెయ్యాలి కనుక చేస్తున్నా మంతే" 
"మీరు మరీనండీ. మీరు తనిఖీ చేస్తేనే అంతా సరిగ్గా ఉంటుంది. లేకపోతే ఏమయినా అవ్వచ్చు" 
తర్వాత అతనుతన పిల్లలనీ మిగిలిన కుటుంబాలనీ తీసుకుని వచ్చి పరిచయం చేశాడు . 
వాళ్ళు వెళ్ళిపోయా క మాధవి తో అన్నాడు "ఇంత మంచి పని లో మనం కూడా ఉండటం అదృష్టమే కదా!" అన్నాడు. 
ఎప్పటి లాగానే మాధవి మనోహరం గా నవ్వింది.దిలీప్ కి ఆ నవ్వు బాగుంది కానీ ఎందుకో అర్ధం కాలేదు. "అంటే ఏమిటర్ధం?" 
"దిలీప్ గారూ! మనం చేస్తున్నది మంచి పనే. కానీ మనం ఇంత కంటే బాగా చెయ్యచ్చు" 
"ఎలా?" ఆశ్చర్య పడుతూ అన్నాడు. 
"వీరికి ఈ రోజు ఉచితం గా ఇల్లు కట్టి ఇస్తున్నాం. అవి అవసరమైన వాళ్ళకి చెందుతాయని అనుకుంటాం. కానీ ఎవరికి ఇల్లు ఇవ్వాలో ఆ నాయకుడు నిర్ణయిస్తాడు. ఊరకే వచ్చిన ఇంటి మీద వాళ్లకి ఎంత గౌరవం ఉంటుందో తెలియదు. చాలామంది ఆ ఇల్లు ఎవరికో ఇచ్చేసి ఆ డబ్బు ఖర్చు పెట్టేసి మళ్ళీ గుడిసెల లోనే ఉంటారు. ఆ ఇల్లు తమకే కేటాయించటానికి ఈ నాయకుల వెనకాల తిరుగుతారు. అంతే కాదు. ఇంటికి లక్ష చొప్పున ఎంత మందికి ఇళ్ళు ఇల్లు కట్టిస్తాం? అందులో ఎంత మంది నిజమైన అవసరం ఉన్న వారికి ఈ ప్రయోజనం వెళ్తుంది?" 
"నిజమే! కాని పరిష్కారం ఏమిటి? అంతా మనం చెయ్యలేము కదా? ఎవరో ఒక నాయకుడితో మాట్లాడకుండా, ఆ నాయకుడిని నమ్మకుండా ఎలా?" 
అదే అడిగాడు . 
"మనం ఏమి చేస్తున్నా అందులో లబ్ది పొందే వారిని కూడా భాగస్తులని చేస్తే మనం పెట్టె ప్రతి పైసా ఖర్చూ వాళ్ళు కూడా గౌరవం గా ఖర్చు పెడతారు. ఊరికే ఇచ్చేటప్పుడు ఎవరికీ ఇవ్వాలి అనేది నాయకుడి ఇష్టం అవుతుంది. భాగస్తుడికి అలా కాకుండా హక్కు ఉంటుంది. బాధ్యత కూడా ఉంటుంది. భాగవతుల ట్రస్ట్ ని చూడండి. మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఇరవై గేదెల వ్యాపారం (ఆరోజుల్లో గేదె ఖరీదు యాభయ్ రూపాయలు) చేసుకోమని చెప్పటం సులువు. కాని 50 రూపాయలు ఇరవై మంది కి ఇచ్చి ఒక్కొక్క గేదె తో వ్యాపారం చెయ్యమన్నారు ఆయన. 3 నెలల తర్వాత ఋణం తీర్చటానికి వచ్చిన వారికి ఋణం మాపు చేసి అదే డబ్బులతో ఇంకొన్ని గేదెల్ని కొనుక్కోమన్నారు. దీని కీ మొదట అనుకున్న వెయ్యి రూపాయల రుణాలకీ తేడా ఏమిటంటే లబ్ది పొందిన వారు ఆయనతో పాటు భాగస్తులయ్యారు. ఋణం ఊరకే వచ్చిన డబ్బు అనుకోకుండా ఆ డబ్బుని నిర్లఖ్ష్యం గా ఖర్చు పెట్టేయ్యకుండా. అంతే కాదు. అటువంటి వారు ఎక్కువ కష్టపడి ఋణం తీర్చటానికి ప్రయత్నించారు. 50 రూపాయలు తీసుకుని పారిపోయిన వారూ ఉన్నారు. కాని లబ్ది పొందిన వారే ఎక్కువ మంది ఉన్నారు." 


దిలీప్ కి అర్ధమయ్యింది. భాగవతుల ట్రస్ట్ ఏమి చేసింది అప్పటికి తనకి తెలియదు. ఆ సంస్థ గొప్పతనం తర్వాత తెలిసింది కాని మాధవి చెప్పిన విషయం వెంటనే అర్ధమయ్యింది. ఏ ప్రభుత్వమైనా సులువు గా వచ్చే ప్రయోజనాలు ఇస్తోంది. కాని ఆ ప్రయోజనం పొందిన వారికి పూర్తి గా పరిష్కారం రావటం లెదు.ఆ ప్రయోజనాల మీద గౌరవం ఉండటం లేదు. అన్నింటి కన్నా ముఖ్యం. చేర వలసిన వారందరికీ చేరటం లేదు. 
గుర్తు పెట్టుకున్నాడు. 


మొట్ట మొదట గుడ్ విల్ అకాడమీ ప్రారంభించాడు. ఒక చిన్న అపార్ట్ మెంట్ అద్దె కి తీసుకున్నాడు. తన కంపెనీ లో పాత కంప్యూటర్స్ అమ్మకుండా చారిటి కి ఇచ్చేస్తా రు. గుడ్ విల్ అకాడమీ అటువంటిదే కనుక కొన్ని కంప్యూటర్ లు తీసుకున్నాడు. తను, మూర్తి మరి కొంత మంది పేద వారికి ట్రైనింగ్ ప్రారంభించారు. దౌర్భాగ్యం అప్పటికే నడుపుతున్న కంపెనీ కి వీరు పని చేస్తారు. 6 నెలల తర్వాత అనుభవం తో వేరే ఉద్యోగం తెచ్చుకుంటారు. కాని రెండేళ్లు గుడ్ విల్ అకాడమీ కి ట్రైనింగ్ లో ఖాళీ ఉన్న సమయాల్లో సహాయం చెయ్యాలి. ఈ మోడల్ మీద మూర్తి కి నమ్మకం లేదు. 
"గురూ! అందరూ ఉచితంగా గా ట్రైనింగ్ తీసుకుని పారిపోతారు. అంతే కాదు వారు మనకెందుకు పని చెయ్యాలి అనుకుంటారు" 
"కావచ్చు ఇరవై మందిలో పది మంది ఉపయోగపడినా చాలు. మాధవి ఇందే చెప్తూ ఉంటుంది" 
"మాధవి ఎవరు?" 
"నాకు ఏక లవ్య గురువు" 
మూర్తి వెటకారంగా నవ్వ బోయి తన ముఖం లో భావాలు చూసి ఆగిపోయాడు. 
మొదటి సారి 10 మంది వచ్చారు. 
"ఈ ట్రైనింగ్ తర్వాతా మాకు ఉద్యోగాలు ఖచ్చితం గా ఇస్తా రా?" ఇదే ప్రతీ వాడు అడిగే ప్రశ్న . అందరికీ ఓపిక గా చెప్పాడు. " ఉద్యోగం సంపాదించుకునే శక్తి ఇస్తాం తప్ప ఉద్యోగం ఇవ్వమని". అయినా కొత్త వాళ్ళు అదే ప్రశ్న. ఈ ధోరణి చూసి మూర్తి నీరు కారిపోయాడు. తనకి మాత్రం ఎప్పటికైనా ముందుకెళ్తామని నమ్మకం ఉండేది. కొంత మంది ఉద్యోగాలు వచ్చాక కనిపించకుండా పారిపొయినా కొంత మంది తమకి సహాయం చెయ్యటానికి వచ్చారు. 


వారిలో చక్రి ముందుకొచ్చాడు. తమ అకాడమీ లో శాశ్వతం గా చేరి పోయాడు. తన ఉద్యమం ఫలితాలిస్తుంటే దిలీప్ ఉప్పొంగిపోయాడు. నెమ్మదిగా గుడ్ విల్ అకాడమీ ముందు కి వెళ్ళింది. ఎన్నో సంస్థలు తమతో చేయి కలుపుతామన్నాయి. 
"బాగుంది గురూ! మనం వీరిలో ఒకరికి పూర్తి బాధ్యత ఇచ్చేయచ్చు" అన్నాడు మూర్తి. 
"అలా ఎందుకంటున్నావు మూర్తి! ఇంకా ఎన్నో లక్షల మంది ఉన్నారు, మనం కూడా వీరితో పాటు పని చెయ్యాలి." 
"అందరికీ మనమే చెయ్యలా?" 
"మనం చేయగలిగినంత మనమే చేద్దాం. వారిని వేరే చోట్ల ప్రారంభించమంటాం" 
చక్రి కొత్త చోట కి వెళ్ళాడు. మూర్తి ఒక చోట. తను ఒక చోట. 
కొత్త సంస్థల తో మీటింగ్ పెట్టాడు. 
"మేము సాఫ్ వేర్ తెలిసిన వాళ్లం కనుక ఈ పరిథిలో చేయగలిగిన సహాయం చేస్తున్నాం. మీరు త్వరగా సంపాదించుకునే విషంగా యువకులకు వృత్తి విద్యలు ఇదే విధం గా నేర్పగలరా?" అని అడిగాదు దిలీప్. 
"తప్ప కుండా. కాని వారికి పనులు ఇప్పించటం మా వల్ల కాకపోవచ్చు" 
"నా కస్టమర్స్ ఎంతో మంది ఉన్నారు. వారిని నేను సహాయం అడుగుతాను. కొంత తక్కువ రేట్లలో మనం వారికి పని ఇప్పిద్దాం. ఆదాయం మొత్తం వారికే వెళ్తుంది. కాని ప్రయోజనము పొందిన వారు రెండేళ్లు కొన్ని రోజుల ట్రైనింగ్ కి మన దగ్గర సహాయం చెయ్యాలి" 
"తప్పకుండా. మేము మీతో కలిసి పని చేస్తాం" 
"ఇంత త్వరగా మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు" వెలిగిపోతున్న ముఖంతో చెయ్యి చాస్తూ అన్నాడు దిలీప్. 
"మీలా ఇంకెవరు ఉండరని ఎలా అనుకున్నారు సార్! మాకు కూడా కొంత మంచి చేయాలని కోరిక ఉంది" 
మూర్తి ఆ రోజు తన వైపు ముగ్ధుడై చూచాడు. 
"నీ లో ఇంత ఫైర్ ఉందా బాసూ?" 
నవ్వేశాడు "ఈ ఫైర్ నాకు మాధవి నుంచి వచ్చింది" 
"ఈ మాధవి ఎవరు గురూ! నువ్వే మీ చెప్పటం లేదు. లవ్ లెటర్సా?" 
"చప్" నవ్వి ఊరుకున్నాడు. 
కానీ ఒక సారి గుండె ఝల్లుమంది. నిజం గా మూర్తి అలా అన్నప్పుడు ఆ మాటని ఎందుకు గట్టిగా ఖండించలేదు? 
చాల త్వరగా నే మాధవి తన జీవితం లో చాల ముఖ్యమైన వ్యక్తి అని మూర్తి కి తెలిసిపోయింది. తన ప్రతి అడుగు లోనూ మాధవి ఉంది. తనకున్న ఆ పరిచయం ఆమె నుంచి తనకి వచ్చిన స్ఫూర్తి , తన మీద తనకి నమ్మకం, జీవితం మీద ఉన్న స్థిరమైన దృక్పథం మూర్తి చూస్తూనే ఉన్నాడు. 
ఒక రోజు మాధవి నుండి శుభ లేఖ వచ్చింది. ఎవరో అప్పారావు. ఆ తర్వాత నుండి ఉత్తరాలు కూడా ఆగి పోయాయి.గుండె బద్దలయ్యింది. మూర్తి కి ఆ విషయం కుడా తెలుసు. తెలిసినట్టు కనపడ లేదు. కాని ఒకే మాట అన్నాడు జనాంతికం గా. 
"గురూ! ఎటువంటి పరిస్థితి లోనైనా నీకు ఎలా బతకాలి అన్నది మాధవి నీకు ఏదో ఒక సందర్భం లో సూటిగా గాని, పరోక్షం గా గాని చెప్పే ఉంటుంది కదూ?" అన్నాడు .అంతకంటే రెట్టించకుండా. 
వాడు ఆ శుభ లేఖ చూసే ఈ మాటలన్నాడని తనకి తెలుసు. తనకి తెలుసనే విషయం మూర్తి కి తెలుసనే విషయం కూడా తనకి తెలుసు. కాని ఎంతో సున్నితం గా చెప్పాడు. అయినా తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 
కాని ఇందులో ఎవరి తప్పైనా ఉందా? 
ఎన్నో సార్లు ఒక విషయం ఆమె కి చెప్పాలనుకునే వాడు. ధైర్యం ఎప్పుడూ రాలేదు. అసలు ఆమె తన గురించి ఏమనుకుంటుందో తెలియదు. ఇప్పటి సినిమాలలో చూపించే స్నేహం , ప్రేమల మధ్య దిక్కుమాలిన తేడాలు తనకు తెలియవు. మాధవి ఉద్దేశ్యం లో తను ఏమిటి? ఒక ధీరుడు అయితే ఎప్పుడూ కాదు. తను ఎప్పుడూ ఆమె దగ్గర భయంగా గౌరవంగానే ఉన్నాడు తప్ప ఒక హీరో లా తనతో ఎప్పుడైనా మాట్లాడాడా?ఆమె సమస్యలకి ఎప్పుడైనా పరిష్కారం ఇచ్చాడా? ఏ విధం గా తను వెళ్లి ఆమె తో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పగలడు? కాని తను నా జీవితం లో ఎంతో మార్పు తెచ్చింది. ఆమె ఎవరినో పెళ్లి చేసుకుంటే ఏమిటి? ఆ మాట కొస్తే తను ఆమెని పెళ్లి చేసుకుంటే ఆమె సుఖ పడేదా? ఏ అమ్మాయయినా ఒక వీరుడినీ, ఒక నాయకుడినీ, ఒక తెలివైన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తను ఆమె దగ్గర ఎప్పుడూ అలా లేడు. ఒక గురువు దగ్గ శిష్యుడు లా, ఒక యజమాని దగ్గర పని వాడిలా ఉన్నాడు. ఒక కథానాయకుడి దగ్గర విదేశికుడిలా. ఆమె హృదయాన్ని సొంతం చేసుకునే దీరుడిలా ఎప్పుడూ లేడు. 
ఎప్పుడూ ఖచ్చితం గా అనుకోక పోయినా మాధవి తన లోకం గా అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తనకి పెళ్లి అని తెలిసా క ఆమె గురించి ఆలోచించాలన్నా భయం కలుగుతోంది. ఒక్క విషయం అర్ధమయ్యింది. తను ఆమె కి తగిన వాడని ఆమె ఒక్క సారి కూడా అనుకుని ఉండదు. లేదా తనే ఆ విషయం చెప్పాలని అనుకుందా? కానీ అల్లా జరిగి ఉండే అవకాశం లేదు. తనకి తెలియదా నే నెటు వంటి వాడినొ! నా సంగతి తెలిసాక, నేను నా భావాలు ధైర్యం గా చెప్పగలడని ఎలా అనుకుంటుంది? ఎందుకు వేచి ఉంటుంది? ఎటు ఆలోచించినా ఆమె తన గురించి ఎప్పుడూ ఒక స్థాయి దాటి ఆలోచించి ఉండదనే అనిపించింది. కానీ ఇప్పుడు ఆమె కి తెలియాలి.నేను మారానని, ఎంతో ఎదిగాననీ. 
ఒక రోజు తను తీర్చిదిద్దిన ఈ జీవితం ఎంత ముందుకు పోయిందో మాధవి కి చూపించాలి. తర్వాత ఆగలేదు. మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాడు. తన ఎదుగుదల తో పాటు, ఎన్నో స్వచ్చంద సంస్థలు ప్రారంభించాడు. ఎంతో మందికి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాడు. కాని మాధవి ఎక్కడుంది? 
ఎక్కడ వెతికినా తెలియలేదు. ఇంటర్నెట్ యుగం లోకి వచ్చినా, పేస్ బుక్ , ట్విట్టర్ లూ ఉన్నా ఆమె ఎక్కడుందో తెలుసుకోవటం కష్టమే అయ్యింది. ఎందుకంటే మాధవి పేరు తప్ప తనకి ఏమి తెలియదు. తన ఇంటి పేరు కూడా తెలియదు. ఇది కాక పెళ్లి తర్వాత తన ఇంటి పేరు మారిపోతుంది కూడా. ఇప్పుడు ఈ కొత్త యుగం లో ప్రతి వాడి పేరూ ఇంటి పేరు తో సహా తెలుస్తున్నాయి. తన కాలేజీ రోజుల్లో అలా లేదు. 
ఈరోజు మూర్తి వలన ఆమె ఎక్కడుందో తెలిసింది. కొన్ని గంటల తర్వాత ఆమెని చూడబోతున్నాడు. మూర్తి ఏమిటో మాట్లాడుతున్నాడు కానీ తనకి వినపడటం లేదు. మాధవి ఫోటో చూస్తూ ఉన్నాడు. ఆమె చిరు నవ్వు. అందులోనే హుందాతనం. కళ్ళల్లో ఒక దివ్యమైన భావం. ఇన్నాళ్ళూ ఈ భావాలు తనలో ఉత్తేజం నింపుతూనే ఉన్నాయి. 
ఇంతలో మూర్తి అన్నాడు "గురూ ! ఈ కాలనీ లోనే ఉంటుంది. వంద మీటర్ల తర్వాత కుడి పక్కకి తిరిగితే రెండో ఇల్లు. ఇక్కడి నుంచి కనపడుతుంది ...... " తన దగ్గరున్న మ్యాప్ లో చూస్తూ చెప్పాడు. 
దూరంగా ఇల్లు కనపడుతోంది ఎవరో లీల గా కనిపిస్తున్నారు .. బహుశా మాధవే అయ్యుండచ్చు, ఇద్దరు స్కూల్ పిల్లలతో మాట్లాడుతోందా? 
ఎందుకో గుండె వేగం పెరిగి వళ్లంతా చమటలు పట్టాయి. "మూర్తీ ! టాక్సీ ఆపు." అన్నాడు దిలీప్ . 
"ఏమయ్యింది రా ?" ఆశ్చర్యం గా అన్నాడు మూర్తి . 
"ఏమి లేదు డ్రైవర్ తో మనని ఎయిర్ పోర్ట్ కి తీసుకుని పొమ్మను" అన్నాడు. 
"అదేమిటి గురూ. ఇంకొక్క నిముషం లో నువ్వెన్నేళ్ళ నుంచో కలవాలనుకున్న మాధవి ని కలవబోతున్నావు ఇప్పుడు ఇంతవరకూ వచ్చాక ..." 
"లేదు మూర్తి ! ఈ మాధవి నేను కలవాలనుకున్న మాధవి కాలేదు" అన్నాడు ఒక రకమైన నిరాశ తో. 
"అదెలా?" 
"నాకు తెలిసిన, నన్ను ఉత్తెజించిన మాధవి ఇప్పుడు లేదు.ఇప్పుడు ఆమె అంత అందం గానూ ఉండి ఉండచ్చు. అంత తెలివితేటలూ, నా మీద అంత అభిమానమూ ఉండి ఉండచ్చు. అయినా నాకు తెలిసిన మాధవి నాకు స్ఫూర్తి నిచ్చిన మాధవి ఇప్పుడు లేదు.ఉండదు కూడా.నా ఊహలలొ మాత్రం ఆ మాధవి ఎప్పుడూ ఉంది. ఆ ఊహలని అలాగే ఉండిపోనీ." 


(సమాప్తం) 













కామెంట్‌లు

  1. కథ చాలా బాగుంది సార్, ఫాంట్ సైజ్ కొంచం పెంచిఉండాల్సింది చదవడానికి ఈజీ గా ఉండేది....

    రిప్లయితొలగించండి
  2. ఈ కథ లో అప్పాజీ స్పార్క్ ప్లగ్ రిపేర్ చేయ్యాలనుకోవటం సహజం గా లేదనీ అంతకన్నా సహజమైన సంఘటన ఉంది ఉంటె బాగుందేమోనని ఒక విమర్శకుడు చెప్పారు (కృతజ్ఞతలు)కానీ ఈ సంఘటన యధాతధం గా నేను పని చేసిన ఒక కంపెనీ లో జరిగింది. ఆ ఉద్యోగి ని వేరే శాఖ కి మార్చేసారు.

    రిప్లయితొలగించండి
  3. Chala bagundandi katha. Mugimpu adbhutham ga undi. Title ki sariggaa saripoindi.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు