ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆడది అబలా?

"నువ్వు లేకపోతే నేను బతకలేను రాణీ !" అన్నాడు రాజు . 
"నువ్వు ఉంటేనే బతుకంటూ ఉంది రాజ్!" అండ్ రాణి 
"ఐ లవ్ యు హనీ "
"ఐ లవ్ యు జానీ"
ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు విశాఖ బీచ్ లో వెన్నెల మెరుపులో చూసుకుంటూ ఉండిపోయారు . 
'ఎవరది?' అని హుంకరించిన గొంతు వినిపించగానే కప్ప ని తొక్కినట్టు ఉలిక్కిపడ్డాడు రాజు . 

'మిమ్మల్నే అడుగుతున్నాను . ఎవరు మీరు? ఇంత రాత్రి మీకేం పని?' అంటూ టార్చి లైటు ముఖాల మీదికి ఫోకస్ చేసాడు పోలీసు .
పోలీసుకి ఏ మాత్రం కళా హృదయం  ఉన్నా 'ఏం  పని  మీకు ' అని మాత్రం అడిగే వాడు కాదు .
'ఐ యాం   రాజు ఎమ్మే .  థిస్  ఈస్  రాణి ...."ప్రమాదం లో ఇంగ్లీష్ మాట్లాడితే పని జరుగుతుందనే నమ్మకం తో కొనసాగిన్తుండగా ... 
'ఇంగిలీసాపవయ్యా " అన్నాడు పోలీసు . 
ఇంగ్లీష్ ఆపటంతో రాజు నోట మాట కూడా ఆగిపోయింది . 
రాజూ రాణీ ప్రేమించుకుంటున్నారనీ కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదనీ కనుకే రాత్రి పన్నెండు గంటలకి బీచ్ లో ఉన్నారనీ ఏ తల మాసిన వాడికైనా అర్థమవుతుంది . కానీ మాయటానికి తలే లేని గుండు పోలీసు కి ఈ  నిజం చెప్పటం ఆ పోలీసనే కొరివి తో తల గోక్కోవటమే నని రాజు కి తెలుసు . మరింకేం చెప్పాలా అని తన సొంత బుర్ర గోక్కుంటూ నిలుచున్నాడు . 
'చూస్తుంటే ఇది ఇక్కడ తేలే విషయం లా లేదు . పదండి స్టేషన్ కి' అన్నాడు పోలీసు .
రాజు తన కంగారు బైట పడకుండా ఉండాలని ప్రయత్నిస్తూ 'చూడండి మిస్టర్! స్టేషన్ వరకూ ఎందుకు?' అంటూ జేబులో చేయి పెట్టి తర్వాతేం చేయాలో తెలియక ఆగి పోయాడు . నిజానికి డబ్బులు ఎలా ఆఫర్ చెయ్యాలో తెలీదు గోల్డ్ మెడలిస్ట్ రాజు కి .
అతను జేబులో చెయ్యి పెట్టటం చూసి రాణి అతని చేయి పట్టుకుని 'ఏమిటయా నీ గోల? భార్యా భర్తలు బీచ్ కి ఎందుకొస్తారో చెప్పాలా?' అంది పోలీసుతో.
పోలీసు గొంతు తగ్గించకుండా 'భార్య భర్తలా ?అందుకు రుజువేమిటి?స్టేషన్ కి పదండి . అక్కడే తెలుద్దురు గాని' అన్నాడు .
రాణి తన గొంతు కూడా పెంచి  'అలాగే పదండి . రంగనాథం మావయ్య కి ఫోన్ చేస్తే గాని ఆ తిక్క కుదరదు ' అంది రాజు తో .
పోలీసు చేతిలో లాఠీ కింద పడింది .
అయినా అనుమానం తో 'ఐ జి గారు మీ మావయ్యా అమ్మా?' అన్నాడు నెమ్మది గా .
'స్టేషన్ కి వెళ్తే అన్నీ తెలుస్తాయి పదవయ్యా . మరీ అంత తొందరయితే లాసన్స్ బే కి పద . మావయ్య ఉండేది అక్కడే ' అంది రాణి .
గుండు పోలీసు గుండె జారి పోయింది . ఐ జి గారిల్లు ఉండేది లాసన్స్ బే లోనే మరి .
వెంటనే 'అమ్మా! అమ్మా! క్షమించండి .నా ఉద్యోగం పోతుంది . ఆయన తో ఈ విషయం చెప్పకండి . ఇంత రాత్రి మీరిక్కడ ఉండటం మంచిది కాదు కనుక జీప్ లో మిమ్మల్ని ఇంట్లో   దింపేస్తాను . రండి' అన్నాడు .
'జీప్ దొరకటం మంచిదే అయ్యింది లెండి . మీరు రాసిన "పురుష సమాజం లో స్త్రీ " కథ ఫెయిర్ చేసి రేప్పొద్దున్నే పంపించేయచ్చు .' అంది రాణి (జీపు లో)పోలీసుకి వినపడకుండా .
అప్పటికి తేరుకున్న రాజు తలూపాడు .
* * *

ఫ్లాట్ఫారం మీద తల పట్టుకుని కూర్చున్నాడు రాజు. వాళ్ళు  అందుకోవలసిన రైలు , వీళ్ళు వస్తున్న రైలు లేటు కావటం వలన వెళ్ళిపోయింది . మరో గంటలో ఇంకో ఎక్ష్ ప్రెస్  వస్తుందట. కానీ అందులో రిజర్వేషన్ ఉండదు . మామూలుగా అయితే జనరల్ కంపార్ట్ మెంట్లో  ప్రయాణం చేసాడేమో గాని ఇప్పుడు పక్కన పెళ్ళాం , ఆమె తో అంచె  లంచెలు  గా పెరిగిన పది సామానులూ ఉన్నాయి . వద్దు వద్దన్నా అన్ని శాల్తీల లగేజ్ తయారు చేసినందుకు  రాణి మీద మండిపోతున్నాడు రాజు . ఇదంతా కాక తమున్నది హిందీ తప్ప ఇంగ్లీష్ మాట్లాడని ఉత్తర భారతం లో .
 
రాజు ఇలా మధన పడుతూ ఉండగానే గంటన్నర పూర్తయ్యి రైలు ఝామ్మని వచ్చేసింది. కొత్త అగ్గి పెట్టెలో పుల్లల్లా ఉన్నారు జనం . పది సామాన్లూ  వాటి కన్నా పెద్ద లగేజీ అయిన భార్య నీ వెంట పెట్టుకుని అన్ని పెట్టెలూ తిరిగి కెపాసిటీ కన్నా కేవలం రెండున్నర  మాత్రమే నిండి ఉన్న ఓ పెట్టె ఎంచుకుని భార్య ని ఎలాగో ఎక్కించాడు . మిగిలిన పది సాల్తీలూ అంత మంది జనంలోనూ నానా అవస్థ పడుతూ ఎక్కిస్తుంటే అతి ముఖ్యమైన అప్పడాలూ , వడియాలూ  వంటి విలువైన వస్తువులతో నిండిన మూట తన చేతిలో ఉండగానే రైలు కదిలిపోయింది . ఆ మూట కూడా విసిరేసి రాజు రైలు ఎక్క బోతే అతను మెట్ల మీద నుంచోవటానికి సెంటీ మీటర్ చోటు కూడా లేదు . 
"భాయీ సాబ్, జాగా దీజియే . మేరీ బీవీ అందర్ హై " (అయ్యా, కొంచెం చోటివ్వండి , నా భార్య లోపల ఉంది) వచ్చీ రాని హిందీ లో అన్నాడు రాజు కంగారుగా . 
"ఉస్కేలియే హం క్యా కరేంగే , మేరె శర్  పర్ బైఠో గే క్యా?" (అందుకు నేనేం చేస్తాను? నా నెత్తి మీద కుర్చున్తావా?) అన్నాడొక పుచ్చు గాడు. 
రైలు నెమ్మదిగా వేగం పెంచుతుంటే మరో దారి లేక దొరికిన పెట్టె ఎక్కి (దొరికిన మెట్టు అనాలి) కమ్మీ పట్టుకుని వేలాడుతూ ఒంటి కాలి మీద నిల్చున్నాడు రాజు. తెలియని భాష  తో, మర్యాద తెలియని నార్త్ ఇండియన్ ల మధ్య తన భార్య ఎలా ఉందొ నని భయ పడుతూ , ఆంధ్రా లో ఎప్పుడూ అటువంటి ప్రయాణం చేయని తన దుస్థితి కి విచారిస్తూ కమ్మీ కి వేలాడుతున్నాడు రాజు. రైలు యమ స్పీడు గా పోతోంది . మధ్య లో ఏదో నది మీద నుంచి రైలు పోతుంటే చేతికి చెమట పట్టి జారి పోతున్నట్టనిపించింది . వెనక జేబులో పర్సులో నాలుగు వేలు దాకా ఉన్నాయి . ఎవడైనా తీస్తున్నట్టు తెలిసినా 'పోతే పోయింది' అనుకోవలసిన పరిస్థితి . ఇలా దాదాపు గంట పైగా ప్రయాణం చేసాక రైలు ఏదో స్టేషన్ లో ఆగింది . వెంటనే దిగి పరుగెత్తాడు . తన ప్రయాణమే ఇంత భయంకరం గా ఉంటె రాణి ఎంత అవస్థ పడుతోందో ఏమో!
ఆమె ని ఏ కోచ్ లో ఎక్కించాడో కూడా తెలియక గుర్తు రాక పిచ్చాడిలా వెతక సాగాడు . సమయం గడుస్తున్న కొద్దీ అతని గుండె వేగం పెరుగుతోంది . 
ఇంతలో 'ఏమండీ!' అని రాణి గొంతు వినిపించింది . ముందు తన భ్రమ అనుకుని అయోమయం గా దిక్కులు తీస్తుంటే -
'ఇక్కడండీ ఇలా రండీ' అని మళ్ళీ పిలిచింది . 
అటు  చూస్తే ఆశ్చర్యం! రాణి హాయి గా అటు వైపు కిటికీ పక్కన కూర్చుని ఉంది . లోపలకు చూస్తే తమ సామానులన్నీ చక్కగా సర్ది ఉన్నాయి . రిజర్వేషన్ కంపార్టుమెంటు . అది కాక జనం తో నిండి ఉంది . అటు వంటప్పుడు రాణి కి సీట్ ఎలా దొరికింది?
"రండి . ముందు లోపలకి  రండి " అందామె . ఇంకా ఆశ్చర్యం తో ఉక్కిరిబిక్కిరవుతూ , ఏమయితేనేం రాణి క్షేమం గా ఉందని సంతోష పడుతూ లోపలకు వచ్చాడు . 
"ఇలా కూర్చోండి" చోటు చేసింది పక్కన . అక్కడ నిజానికి చోటు లేనే లేదు . రాజు సంశయిస్తుంటే , "అన్నయ్య గారూ కొంచెం జరుగు తారా?" అంది ఈ చివర కూర్చున్న (వేలాడుతున్న) ఓ అమాయకుడితో . అతను లేచి నిల్చుని "ఆప్ బైఠియే!" అన్నాడు రాజు తో . 
"అయ్యో అన్నయ్య గారూ! మీరు నిల్చోవటం దేనికి? అందరం కూర్చుందాం" అంది రాణి అతనితో . 
"పరవాలేదు, చాల సేపు కుర్చుని కాళ్ళు పట్టేసాయి" అన్నాడతను హిందీ లొ. 
రాజు ఇకా తటపటాయిస్తుంటే అతన్ని లాగి కూర్చోపెట్టిందామే. రాజు మొహమాటం గా కుర్చుని "ఇంతకీ ఆయనెవరు?" అన్నాడు . 
"అయ్యో! ఈ అన్నయ్య గారే నాకెంతో సహాయం చేసారండీ! బెహన్ జీ మీరిక్కడ కూర్చోండీ అన్చెప్పి నన్ను కూర్చోబెట్టి సామానంతా ఆయనే సర్ది పెట్టారు . మీ కోసం వెతుకుదామని ఇందాక దిగారు కూడా . ఇంతలో మీరే వచ్చారు" అంది రాణి . 
"థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్" అని అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాజు . 
"ఎ తో హమారా ఫర్జ్ హై " అన్నాడతను మెలికలు తిరుగుతూ . 
రాణి కి ఇంకా సందేహాలున్నాయి . హిందీ ఏమాత్రం తెలియని రాణి వాడితో ఎలా కమ్యూనికేట్ చేసిందీ, వాడేలా అర్థం చేసుకున్నాడూ' లాంటివి . ఏమయితేనేం తన భార్య కేమీ ఇబ్బంది కాలేదు . అదీ కావలసినది . 
అతను నిశ్చింత గా వెనక్కి వాలి కూర్చుంటుంటే -
"ఇందాక ఎవరో తెలుగాయన చేతిలో కన్పిస్తే తీసుకున్నా . మీ వ్యాసం "స్త్రీ కి స్వాతంత్రం ఎప్పుడు?" పబ్లిష్ అయ్యింది" అంది రాణి . 
"నిజమా?" అంటూ తన వ్యాసం , వ్యాసం పక్కన తన పేరూ చూసుకుని మురిసాడు రాజు . 
* * *
రాజు చిరాగ్గా ఉన్నాడు . గాస్ అయ్యిపోయింది . కొత్త సిలిండర్ తెచ్చుకోవాలి . పది రోజుల నుంచీ ఈ విషయం మీదే చాలా విసుగు చెందుతున్నాడు. కాని చేసిందేమీ లేదు . ఎందుకంటే ఆ డీలర్ గాడి మొహం చూడాలంటే అసహ్యం గా ఉంది . 
గ్యాస్ అయిపోయిన రోజే వెళ్లి ఆ డీలర్ గాడి ముందు నిల్చుని కొత్త సిలిండర్ ఎప్పుడు రావచ్చని వీలైనంత మర్యాద గా అడిగాడు రాజు . రాజు ని చూడ గానే వాడికి ప్రపంచం లోని అన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుకొచ్చి , టేబుల్ మీద పేపర్లన్నీ సర్దటం, ఇటు పక్క ఫైల్స్ అటు పెట్టటం వంటి అప్పుడే చేసి తీర వలసిన పనులన్నీ రాజు జవాబు కోసం నిరీక్షిస్తూ అరగంట నిల్చున్నా తలెత్త లేదు . బెంగాల్ లో ఉద్యోగం వచ్చిన కొన్ని గంటల తర్వాత నుంచీ సహనం పెంచుకున్న రాజు మర్యాద గా మళ్ళీ అదే ప్రశ్న వేసాడు . 
అప్పుడు మనుషుల తల రాతలు రాస్తున్నబ్రహ్మ బ్రహ్మాండం బద్దలయితే తలెత్తినట్టుగా పైకి చూసి-
"రేపు" అన్నాడు వాడు క్లుప్తం గా . 
"రేపు ఖచ్చితం గా వస్తుందా?"
"అనే నా నమ్మకం" అనేసి మళ్ళీ దేశ సమస్యలు విచారించటం లో మునిగి పోయాడు . 
రాజు కంపరం తో రగిలి పోతూ వచ్చేసాడు . తర్వాత ఎప్పుడు అటు వైపు వెళ్ళాలన్నా సత్యజిత్  రే లా ఇన్తెల్లెచ్తుఅల్ ఫై పోజులో సిగరెట్టు కాలుస్తూ కాశ్మీర్ సమస్య చర్చిస్తున్న ప్రధాని కన్నా బిజీ గా ఉన్నట్టు కనిపించే ఆ బెంగాలీ డీలర్ ని చూసే ధైర్యం ఉండటం లేదు .  వాదంతట వాడు సిలిండర్ పంపనూ లేదు . 
ఈ రోజు ఎవరో సలహా ఇచ్చారు . సిలిండర్లు ఇచ్చే వాన్ ఒక్కొక్క చోట ఆగుతుందట . అక్కడికి వెళ్లి తీసుకోవచ్చు . 'ఇది బాగానే ఉంది గాని ఇందులో ఏం లోసుగుందో? బెంగాల్ లో పనులు అంత సులువు గా అయి చస్తాయా?" అనుకుంటూ ఇంటికి బైల్దేరాడతను ఆఫీసు లో పర్మిషన్ తీసుకుని. 
దారి లోనే సిలిండర్ ల వాను కనిపించింది . ఖాళీ సిలిండర్ ల తో క్యూ లో నిల్చున్న జనాలు కన్పించారు . తను ఇంటికి వెళ్ళే సరికి వాన్ వెళ్ళిపోతుందేమో వాడిని వెయిట్ చెయ్యమని అడుగుదామని (వాడెలాగా వెయిట్ చెయ్యడు. అది వేరే విషయం ) స్కూటర్ ఓ పక్కన ఆపాడు. ముందుకు వెళ్ళబోతూ రోడ్డు కి ఇవతల స్టూలు మీద కూర్చుని ఉన్న ఒక అమ్మాయి ని చూసి ఆగాడు రాజు . 
"నువ్విక్కడ కూర్చోమ్మా, నీ సిలిండర్ వరకూ లైన్ రాగానే నేను కొత్త సిలిండర్ తో మార్పిస్తాను " అంటున్నాడు . ఎవడు? వాడే! సత్యజిత్  రే గాడే! తల రాతలు రాసే వెధవ . వాడికి ఇంట మర్యాద తెలుసా?
ఇంతలో 'దాదా! నెంబర్ టా ఆష్చే' (అన్నా! నెంబర్ వచ్చింది) అని అరిచాడు ఓ బల్ల దగ్గర కుర్చుని సిలిండర్ లు ఇష్యూ చేస్తున్న మరో సిద్దార్థ్ శంకర్ రే . తన గ్యాస్ సిలిండర్ పాస్ బుక్ వాడి దగ్గరే ఉంది. 
"సరే! కొత్త సిలిండర్ రిక్షా ఎక్కించు. అమ్మాయి గారు తీసుకెళ్తారు" అని బెంగాలీ లో చెప్పి "నీ పని అయిపోయిన్డంమా! కాస్త మజ్జిగ తాగి వెళ్ళు . అసలే ఎండా" అన్నాడు సత్యజిత్ రే . 
"పర్లేదులే తాతా! వెళ్తాను మా ఆయన వచ్చేస్తారు"
"మీ ఆయనంటే ఆ బాబేనా అమ్మా? కళ్ళద్దాలతో సన్న గా రివట లా ఉంటాడు?"
రివట లా ఉంటానా? నీ మొహానికి చవటలా ఉంటాను? అనుకున్నాడు రాజు . 
"అవును. నీకు తెలుసా?"
"ఎందుకు తెలీదమ్మా! సిలిండర్ కోసం వచ్చాడు కదా! ఇక్కడ ఎవరూ సరిగా పని చేయరు నేనొక్కడినే ఎన్నని చూడ గలను? అందుకని తర్వాత రమ్మన్నాను . పోనీలే ఈ రోజు నీ పని అయిపొయింది"
'ఓరి సన్నాసీ . నువ్వోక్కడే పని చేస్తున్నావా? ఈ లెక్కన నీ ఉద్దేశ్యం లో పని చేయని వాడంటే  ఎవరు?'అనుకున్నాడు. 
రాణి వెళ్ళే వరకూ ఆ పక్కనే ఆగి తర్వాత స్కూటర్ అక్కడా అక్కడా తిరిగి కావాలనే ఇంటికి ఆలస్యం గా వచ్చాడు . లోపలకు రాగానే 'గ్యాస్ వచ్చేసిందండీ ' అంది రాణి . 
నిజమా? అన్నాడు రాజు తెలియనట్టు . 
'నిజమేనండీ ఆ డీలర్ కి మీరు చాలా బాగా (ఒక వాజమ్మ లా) తెలుసు . నన్ను చాల మర్యాద చేసి సిలిండర్ రిక్షా ఎక్కించి మరీ పంపాడు'
'వెరీ గుడ్'
 
'ఇక పోతే "ఆడది ఎప్పటికీ అబలేనా?" అనే టాపిక్ తో మీరు అఖిల భారత మహిళా జనోద్దరణ సమితి తాలుకు మీటింగ్ లో ఉపన్యసించాలట. ఈ రోజే ఉత్తరం వచ్చింది . 
"అలాగా" అన్నాడు రాజు . 
"అంతే కాదు . స్త్రీ వాదం తో  రచనలు చేస్తున్న మీకు సన్మానం కూడా ఉందట"
ఈ సారి రాజు మురిసి పోలేదు . కానీ మరొకందుకు నవ్వుకున్నాడు. 
"ఆడది అబల అన్న చవట ఎవడంటా ?"
 
 

(సమాప్తం )
జూన్ 1996 లో ఆంధ్ర ప్రభ లో ప్రచురితం.

ఈ కథ సరదా గా రాసాను తప్ప స్త్రీ వాదం మీద ఎటువంటి అభిప్రాయం రుద్దటానికి వ్రాయలేదు . మీ అభిప్రాయాలు చెప్పండి 
 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్

అరుణ్ గాడి చదువు

"ఏమండీ! అరుణ్ గాడిని కాన్వెంట్ లో చేర్పించాలండీ " అంది సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి . నెల రోజుల నుంచి రావలసి ఉన్నా రాని  ప్రమోషన్ రిజల్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సుబ్రహ్మణ్యం తలెత్తి చూసాడు . "అరుణ్ గాడిని నర్సరీ లో చేర్పించాలి . ఇంటర్వ్యూ కి వారమే టైముంది." అందామె . "వాట్? ఇంటర్వ్యూ నా?" ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యం . మేనేజర్ ప్రమోషన్ కోసం రెండు నెలల క్రితం ఇంటర్వ్యూ కి వెళ్లి వచ్చిన అతనికి తన మూడేళ్ళ కొడుక్కి ఇంటర్వ్యూ ఉందన్న విషయం చాలా అవమానం కలిగించింది . "అదేమిటండీ అలా అంటారు? ఇదేమైన మీరు చదువుకున్న దుంపల బడి అనుకున్నారా? పిలిచి సీటివ్వతానికి నర్సరీ లో చేరటానికి ఇంటర్వ్యూ ఉండదూ?" ఆవిడ మాటలు అక్షరాలా నిజం . సుబ్రహ్మణ్యం నీరసంగా పడక్కుర్చీ లో వెనక్కి వాలి తన కొడుకు వైపు చూసాడు . అతని సుపుత్రుడు అరుణ్ అక్కడే నేల మీద కూర్చుని లక్కముక్కలతో రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నాడు . వాడు రోజు తొమ్మిది గంటలకు నిద్ర లేస్తునాడు . వాడికి నచ్చినప్పుడు తయారై పక్కింటి గర్ల్ ఫ్రెండ్ తో ఆడుకుంటాడు . రాత్రి టీవీ చూస్తూ అందులో వచ్చే పాటలకి ఓపికు