ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొవ్వొత్తి ప్రవ్రుత్తి










ఇంటి గుమ్మం తెరుచుకుని ఇంట్లోకి వస్తుంటే 'నిరసన బాగా జరిగిందా?' అంటూ ఎదురొచ్చింది నా భార్య. అప్పుడే నేను కొన్నివందల మంది సహచరులతో అన్ని రహదారుల మీదా కొవ్వొత్తుల నిరసన విజయవంతంగా చేసి వస్తున్నాను.సత్యేంద్ర దూబే అనే ఒక నిజాయితీ పరుడు ప్రభుత్వం లో జరుగుతున్న కొన్ని దారుణాలు ప్రధానమంత్రి కార్యాలయానికి పిర్యాదు రూపం లో మనవి చేసుకున్న కొన్నిరోజుల్లోనే అతన్ని దారుణంగా "ఎవరో" చంపేశారు. ఈ వార్తలు చూడగానే మా అందర్లోనూ ఆవేశం చెలరేగింది. నాతొ పని చేసే సహచరులతో పాటు మాకు బొగ్గు సరఫరా చేసే కంపెనీ లోనూ ఇంకా చుట్టు పక్కల ఉన్న కంపెనీ ల లోనూ పని చేసే వారందరం కలిసి కొవ్వొత్తులతో మా నిరసన వ్యక్తం చేసాం. ఈ నిరసన చాలా బాగా జరిగిందనీ ప్రఖ్యాత ప్రసార కేంద్రాల ప్రతినిధులంతా అక్కడే ఉండి సమాచారం ప్రసారం చేశారనీ మొత్తానికి ఈ నిరసన విజయవంతమయ్యిందనీ నా సహచరులు నాకు చెప్పారు. సమాజం లో జరిగే అన్యాయాలని నిరసించి అవినీతి పరులని కడిగేయటం లో మా జట్టు చాలానే ముందుకు పోతోంది. మొన్నటికి మొన్న క్రికెట్ లో జరిగిన అవినీతి కి నిరసనగా మేమంతా 10K మారథాన్ చేసి వార్తలో కెక్కాము. అందుకే నా భార్య ప్రశ్నకి సమాధానంగా 'మేము వెళ్ళాక విజయవంతం కాక మరేమవుతుంది?' అని గర్వం గా చెప్పాను.

సమాజానికి పనికొచ్చే ఒక గొప్ప పని చేశాననే  సంతృప్తి తో మా సైట్ కి వెళ్లి పని చేసుకుంటుంటే 'దిలీప్ గారూ! సమస్య ఇంకా అలాగే ఉందండీ' అంటూ వచ్చాడు మా కాంట్రాక్టర్ చంద్ర శేఖర్. అతని ముఖం చాలా విచారం గా మూడు లంఖణాలు చేసిన వాడి మొహంలా ఉంది.

'ఆ దొంగ వెధవలు నేను భోజనం చేస్తున్నప్పుడు డాగ్ హౌస్ కి వచ్చి నన్ను బెదిరించారు' చెప్పాడతను దిగులుగా. 

నేను పని చేసే విద్యుత్కేంద్రం సామ్యవాదం పేరుతొ దోచుకొనే వినూత్నమైన విధానాలకి పేరొందిన పశ్చిమ వంగ దేశం లో బంగ్లాదేశ్ సరిహద్దు కి దగ్గరలో ఉంది. కొత్త యూనిట్ ఎరెక్షన్ పనులలో చాలా భాగం వేగంగా పూర్తి చెయ్యటానికీ, ఏ పనికి ఏ ప్రజ్ఞ అవసరమో ఆ ప్రజ్ఞావంతులచే పని చేయించుకోవటం సరైనదనే భావంతో  నా సంస్థ అటువంటి పనులని వేరే కాంటాక్టర్ లకి గుత్తకి ఇస్తూ ఉంటుంది. అందులో భాగం గానే కొంత పని చంద్రశేఖర్ పని చేసే సంస్థ గుత్త కి తీసుకుంది. ఆంద్ర దేశం నుంచి వచ్చిన చంద్రశేఖర్ ఈ పని కోసం తన పనివారినందరినీ అక్కడినుంచే తెచ్చుకున్నాడు. తక్కువ ఖర్చుతో పని కావటమే కాక ఆయన తెచ్చుకున్న కార్మికులు ఈ పనిలో దిట్టలు కావటం కూడా ఆ మనుషులని అంత దూరం నుంచి తెచ్చుకోవటాని ముఖ్య కారణం. అయితే అతను వచ్చిన రోజే మినూ అనే ప్రాంతీయ నాయకుడు (వాస్తవానికి ఒక పచ్చ్చి గూండా) వచ్చి చంద్రశేఖర్ ని కలుసుకున్నాడు.

'నమస్తే చంద్ర దా! (చంద్రన్నా!) ఆంధ్రా నుంచి వచ్చారా?' మాటలో ఉన్న మర్యాద అతను మాటాడిన విధానం లో లేకపోగా కొంత వెటకారం కూడా కలిసింది. 

'అవునండీ' అన్నాడు చంద్రశేఖర్ అమాయకంగా. 

'మంచిది శేఖర్ గారూ! ఇదిగో మావాళ్ళు పన్నెండు మంది. వీరి రోజు కూలీ మీకు తెలుసుగా. సైట్ లోపలికి వెళ్లేచోటే ఒక బోర్డు మీద రాసుంటుంది. వీళ్ళని ఈరోజు నుంచి పనిలోకి తీసుకోండి. ప్రతివారం లెక్క తప్పకుండా వారికి పద్దతి ప్రకారం ఆ కూలీ ఇచ్చెయ్యండి' అన్నాడు మినూ. 

'మీ సహాయానికి చాలా సంతోషం మినూ గారూ! కానీ  నాకు సరిపడా నా కంపెనీ నుంచి వచ్చిన మనుషులే ఉన్నారు కదా? వీరి అవసరం నాకు లేదే? ఇదిగో ఈ పన్నెండు మందీ నా జట్టు. వారు కూడా ఆంధ్రా నుంచే వచ్చారు' అన్నాడు చంద్ర శేఖర్. 
'అలాగా చాలా సంతోషం. వారిచేతే పని చేయించుకోండి' అన్నాడు మినూ.
'అమ్మయ్య' అనుకుంటుంటే 'మా వాళ్లకి మాత్రం ప్రతి వారం డబ్బులిచ్చెయ్యండి' అన్నాడు మిను. 
ఊహించని ఆ దెబ్బకి చంద్రశేఖర్ కి నోటమాట రాలేదు.
'అలా ఎలా అవుతుంది మినూ గారూ! వీళ్ళు నాకు అవసరం లేదు కదా?'

'కానీ వాళ్లకి డబ్బు అవసరం ఉంది. వారికీ పని తెలుసు. మీరు కావాలంటే వీరితో పని చేయించుకోవచ్చు. అంతే గానీ వాళ్ళ పొట్ట కొట్టి ఎవరినో తెచ్చుకుంటే వీళ్లెలా బతుకుతారు?' నింపాదిగా చెప్పాడు మినూ. 

'నా వాళ్ళని తెచ్చుకున్నాక మళ్ళీ వీరితో నేనేం చేసుకోను?' అడిగాడు శేఖర్ అయోమయం గా. 

'అది మీ సమస్య. మీరు వారిని వెనక్కి పంపుకోవచ్చు. లేదా వారితోనే పని చేయించుకోవచ్చు. నా వాళ్లకి రోజు కూలీ ఇస్తున్నంత కాలం మీకిక్కడ ఏ సమస్యా ఉండదు' అన్నాడు మినూ ఎంతో మర్యాదగా. 

'నేను మా అధికార్లతో మాట్లాడి చెప్తాను' అన్నాడు శేఖర్ భయం భయం గా.

'ఏదైనా త్వరగా తేల్చుకుంటే మంచిది' అని మినూ వెళ్ళిపోయాడు. శేఖర్ తన అధికార్లతో ఈ విషయం మాట్లాడితే  బూర్జువా సంప్రదాయంతో వ్యాపారం చేస్తున్న ఆ కంపెనీ యాజమాన్యం నుంచో చాలా సులువైన సమాధానం వచ్చింది.

'స్థానిక సమస్యలు స్వయంగా పరిష్కరించుకోవటానికే నీకు ఉద్యోగమిచ్చింది. కుదరకపోతే కంపెనీ ప్రయోజనాలు కాపాడగలిగే అధికార్లు మా దగ్గర ఇంకా ఎంతోమంది ఉన్నారు '


శేఖర్ ఆ సమాధానం చూసి బిక్కచచ్చి పోయాడు. 

అప్పటినుంచీ శేఖర్ కి సమస్యలు ప్రారంభమయ్యాయి. 

మా కంపెనీ ఎన్నో ఎకరాల స్తలం స్తానికుల దగ్గర్నించి కొని ఈ విద్యుత్కేంద్రం స్థాపించింది. స్తానికుల నిరసన తట్టుకొవటానికి చాలా మందికి యాజమాన్యం ఏదో ఒక విధమైన పరిహారం చెల్లిస్తూ అందులో భాగంగా చాలా మందికి చిన్నా చితకా ఉద్యోగాలు కూడా ఇచ్చింది. ఈ ప్రక్రియలో మినూ లాంటి నాయకులు ఆవిర్భవించారు. చిల్లిగవ్వ సంపాదన లేకుండా గాలికి తిరుగుతున్న ఆ  రౌడీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సహకారం తో ఇప్పుడు ఒక పెద్ద దాదా గా పెరిగాడు. అతన్ని ప్రతిఘటించటం చాలా కష్టమే! ఇది కాక శేఖర్ కి అతని అధికార్ల నుండి కూడా మద్దతు లేకపోవటంతో సమస్య మరింత జటిలమయ్యింది. 

మొట్టమొదట శేఖర్ నాకీ విషయం చెప్పినప్పుడు నేను అంతగా  పట్టించుకోలేదు. వాళ్ళేదో చేసుకుంటారులే అనుకున్నానుఅనుకున్నాను. రెండో సారి కలిసి మొత్తం పని ఆగిపోయిందనీ ఈ విషయం తేలకపోతే ఇదే పరిస్థితి కొనసాగేలా ఉందని అతను చెప్పగానే సమస్య ఎంత జఠిలమైనదో గ్రహించి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసాం. ఐజీ వశిష్ట కూడా వంగ దేశస్తుడే కనుక సమస్య ఇంకా బాగా అర్ధం చేసుకుంటాడని ఆశ పడ్డాం.
అయితే వశిష్ట స్పందించిన విధం నన్ను నిరాశ పరిచింది. 'దిలీప్ గారూ! వీళ్ళందరికీ రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి. నన్నడిగితే మీరిద్దరూ మినూ తో లోపాయికారీ గా మాట్లాడుకుని ఏదో పరిష్కారం చేసుకోవటం ఉత్తమం. ' అన్నాడతను.
నాకు కోపం వచ్చి 'వశిష్ట గారూ! మీరు ఇంత భాద్యతాయుతమైన వృత్తిలో ఉండి పెద్ద పదవిలో ఉండి కూడా ఇలాంటి సలహాలు ఇవ్వటం అన్యాయం. మినూ తో ఏదయినా ఒప్పందం చేసుకోవచ్చని నేను కూడా ఆలోచించాను గానీ చంద్రశేఖర్ కంపెనీ అధికార్లు ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేరు. వారిది చిన్న కంపెనీ. అర్ధం చేసుకోండి. ఇటువంటి దందాలకోసం మినూ ని ఏదైనా పెద్దపెద్ద కంపెనీల వెనక పడమని చెప్పండి. కమ్యూనిస్ట్ సిద్దాంతాలు కూడా అదే చెప్తాయి కదా!' చివరి మాట కొంచెం వెటకారం గా అన్నాను.


గట్టిగా మాటాడితే నోరుమూసుకుని నోరు లేని వాళ్ళ దగ్గర అరిచే పక్కా బెంగాలీ అయినా వసిష్ఠ కొంచెం తగ్గి క్షణం ఆలోచించి  'సరే మీరు పదండి నేను నా సిబ్బందిని తీసుకుని అతని దగ్గరికి వస్తాను' అన్నాడు. కానీ చెప్పినట్టు వశిష్ట గానీ అతని సహచరులు గానీ రాలేదు.రెండు రోజులాగి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అతనికి గుర్తు చేసాము. 'అరెరే ఆ రోజు కుదరలేదు. ఈసారి వస్తాను. మీరు అక్కడే ఉండండి' అన్నాడు. కానీ నాలుగు గంటలు వేచిచూసినా అతను రాలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు మేము వెళ్లి గుర్తు చేసినా అదే తంతు. మీరు పదండి అనటం ఆ తర్వాత వాళ్ళు రాకపోవటం, రాకపోవటానికి ఏదో ఒక "విలువైన" కారణం చెప్పటం.

ఇంక లాభం లేదని నా పై అధికారి రాజేంద్ర కి ఈ విషయం చెప్పాను.
రాజేంద్ర అదే బెంగాలీ పద్దతిలో పెరిగిన మనిషి. నేను చెప్పినదంతా విని రాజేంద్ర చాలా మామూలుగా చెప్పాడు. 'నీకీ ప్రాంతీయ సమస్యలు అర్ధం కావు దిలీప్. ఇటువంటి వాటిలో తల దూర్చకు. ఇది చంద్రశేఖర్ సమస్య. ఇటువంటి సంస్థలన్నీ ఆ సమస్యలు ఎదుర్కొకతప్పదు. ఆ బాధలు వాళ్ళని పడనీ' అన్నాడు. 

'కానీ రాజేంద్రా ఇది ఇక్కడే ఆగిపోయే సమస్య కాదు ! అంతేకాదు ఇది శేఖర్ సమస్య మాత్రమె కాదు. రేపు మినూ ఎవడినో తీసుకొచ్చి మనదగ్గర ఇంజనీర్ గా తీసుకోమంటాడు. అప్పుడేం చేస్తాం? అంతవరకూ రానిచ్చే బదులు మనం ఏదో ఒక చర్య తీసుకుంటే మంచిది కదా?' అన్నాను. 


రాజేంద్ర ఏమీ మాట్లాడకపోతే 'ఆ మాటకొస్తే అసలు మినూ కి ఇక్కడేం పని? వాడు మన సైట్ లోకి ప్రవేశించకుండా వాడిని ఆపేస్తే సరిపోతుంది కదా? ప్రతివాదినీ ఐడీ కార్డు లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించని మనం ఈ వెధవని ఎందుకు రానిస్తున్నాం ?వాడికిక్కడ అధికారికంగా ప్రవేశం లేదు కదా.....'  అంటుంటే రాజేంద్ర నన్ను పూర్తిచేయ్యనివ్వలేదు. 


'మిస్టర్ దిలీప్. నేను చెప్పిన పనులు పూర్తి చెయ్యటం మీద దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాల్లో తల దూర్చి నా పనులు సరిగ్గా జరగకపోతే నీనూరుకోను. అతను తెలుగు వాడు కనుక నీకు ప్రత్యేకమైన ఇంటరెస్ట్ ఉండచ్చు. కానీ నాకివన్నీ నచ్చవు. ఈ విషయం గురించి నాతొ చర్చించటానికి ఎప్పుడూ రావద్దు' అన్నాడతను. 
నేను విషయం కొంచెం కటువుగా చెప్పినట్టున్నాను.  అతని అహం దెబ్బ తింది. కానీ మన అహం కన్నా మనం పని చేసే సంస్థా అనుబంధ సంస్థల ప్రయోజనం ముఖ్యం కాదా?  నాకు చాలా బాధా అవమానమూ కలిగి బైటికొచ్చేసాను. నేను వస్తుంటే కిరణ్ కనపడి ఏమిటి సమస్య? అని అడిగాడు. 


కిరణ్ రాజేంద్ర కి ఉన్నత సలహా దారుడు. అప్పటికే చాలా నిస్పృహతో ఉన్నానేమో అతను అడగ్గానే వివరంగా చెప్పాను. 

'కిరణ్, ఏతప్పూ చేయకుండా శేఖర్ నరకమనుభవిస్తున్నాడు. అంతే కాదు. కారణమేదైనా అతను నా పని ప్రారంభించ లేకపోతున్నాడు. ఈ ఆలస్యానికి నేను ఒప్పందం లో వ్రాసినట్టు పరిహారం చెల్లించమని అతనికి చెప్పచ్చు. లేదా అతనికిచ్చిన పని మరొక కంపెనీ కి అప్పగించవచ్చు. కానీ నీకు తెలుసు అసలు నేరస్తుడిని వదిలిపెట్టి అమాయకుడైన శేఖర్ ని ఇబ్బంది పెట్టే ఈ రెండు పరిష్కారాలూ  అన్యాయమే' అన్నాను. 

కిరణ్ ఆలోచించకుండా చటుక్కున అన్నాడు 'నువ్వు జనరల్ మేనేజర్ కి ఫిర్యాదు ఎందుకు చెయ్యకూడదు?'
'జనరల్ మేనేజరా? ఇంతవరకూ ఒక్కసారి కూడా ఆయన్ని కలవలేదు మాట్లాడలేదు. పనవుతుందంటావా? అదికాక ఈ విషయం తెలిస్తే రాజేంద్ర ఏమంటాడు? అతను నాతో ఖచ్చితంగా ఈ విషయం మీద ఆలోచించద్దని చెప్పాడు?' 

'ఏమీ కాదు. జీ ఎమ్ చాలా దమ్మున్న వాడు. అతను కనుక ఇది న్యాయమైన విన్నపమని నమ్మితే తప్పకుండా సహాయం చేస్తాడు. రాజేంద్ర కి తెలిసే అవకాశమే లేదు' 

'ఏ కారణంగానైనా రాజేంద్ర కి ఈ విషయం తెలిస్తే మా వ్యవహారాలలో ఇబ్బందులొస్తాయి. అతనికి చెప్పి చేస్తే మంచిదేమో '


'వాడి మొహం ! రాజేంద్ర ని జి ఎం అస్సలు గౌరవించడు. ఈ విషయం లో నువ్వు నిర్భయంగా ఉండు' అని భరోశా ఇచ్చాడు కిరణ్. 

కిరణ్ జనరల్ మేనేజర్ తోనూ ఇంకా పెద్ద అధికార్లతోనూ పని లో భాగం గా దాదాపు ప్రతి రోజూ మాట్లాడుతూ ఉంటాడు. అతనికి  వాళ్ళందరి ఆకారవికారాలూ తెలుసు. అతనికి చాలా అవగాహన ఉంటుంది కనుక అతనిలా చెప్పగానే ఇలా చెయ్యచ్చని   నాకు కూడా నమ్మకం కలిగింది. 

ఇంతలో రవి జ్యోతీశ్వర్ వచ్చాడు. 'నమస్కారం  దిలీప్ గారూ! ఈ కాంట్రాక్టు నాకు ఏమీ అర్ధం కావటం లేదు. కొంచెం వివరిస్తారా?' అన్నాడతను. 

రవి ఎవరి కాళ్ళో పట్టుకుని మా సంస్థ లో చేరాడు.  ఇక్కడ చేరటానికి అతను ముందు పనిచేసినట్టు చూపించిన సర్టిఫికెట్లు సరైనవి కావని ఒక సీనియర్ మేనేజర్ సాయం చేసి ఎలాగో ఇతన్ని లోపలకి లాగాడనీ ఒక ఆరోపణ కూడా ఉంది. ఎలాగో చేరిపోయి పని చేతకాక నా దగ్గర ప్రతి పనికీ సాయం తీసుకుంటూ ఉంటాడు. 

కొంచెం అసహనంగా ఉన్న నా ముఖం చూసి 'మీరేదో ఇబ్బంది లో ఉన్నట్టున్నారు. కానీ ఇది అత్యవరసమైన పని' అని నసుగుతూ చెప్పాడు. నేను ఓపిగ్గా అతని వివరించి చెప్పేసరికి మూడు నాలుగు గంటలు పట్టింది. 

ఆలస్యమైనా వెంటనే బయలుదేరి జి ఎం కార్యాలయం లో ఈ విషయమంతా వివరిస్తూ ఒక కంప్లైంట్ సబ్మిట్ చేసేసాను. తర్వాత నా పని పూర్తి చేసుకుని నెమ్మదిగా ఇంటికి వచ్చేసరికి  నా భార్య గబగబా నాదగ్గరికి వచ్చి  'నువ్వు  క్షేమంగా నే వచ్చావా ?' అని అడిగింది. 


నేను నిర్ఘాంతపోయి అడిగాను 'ఎందుకిలా అడుగుతున్నావు?'
ఈ రోజు ఆరుగురు మనుషులు కూరల మార్కెట్ లో నా దగ్గరికి వచ్చి నువ్వెక్కడున్నావని అడిగారు. ఇంకా ఆఫీసులో ఉన్నావంటే ఎప్పుడు వస్తాడు అని అడిగారు. 
నా రక్తం మరిగిపోయింది. 'వాళ్ళేమైనా తప్పు గా ప్రవర్తించారా?'
'లెదు. కానీ వాళ్ళు నన్ను ప్రశ్నలడిగే విధానం చూస్తె ఎందుకో భయమేసింది. ఏదో పధకం తో ఇదంతా చేస్తునారేమో అనిపించింది ' అని సమాధానమిచ్చింది ఆమె. 
నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. నేను కంపెనీ వాళ్ళు కట్టించిన టౌన్ షిప్  లో ఉంటున్నాను. చాలా మంది  నా  కొలీగ్స్ చుట్టుపక్కలే ఉంటారు. కూరల అంగళ్లు, పాఠశాలలూ, బాంకులూ అన్నీ లోపలే ఉంటాయి. ఒక సెక్యూరిటీ గేట్ కూడా ఉంది. అటువంటి ప్రదేశానికి ఈ గూండా వెధవలు ఎలా వచ్చారు?

ఇదంతా ఆలోచిస్తుంటే అనుకోకుండా నేను చాలా ప్రమాదం లో ఇరుక్కుపోతున్నానని అర్ధమయ్యింది. కానీ నాకు అండగా నిలబడటానికి నా సహచరులెందరో ఉన్నారు!

ఈ లోపల ఇంకో విషయం తెలిసింది. చంద్రశేఖర్ ఇంటికి  కొంత మంది (నా కోసం వచ్చిన వాళ్ళే అయి ఉండచ్చు) వెళ్లి అతన్ని ఇంటి బైటికి లాగి అవమానించారట.  వాళ్ళు చెయ్యి చేసుకోలేదు గానీ అందరూ చూస్తుండగా ఒక్కొక్కడూ అతన్ని వెనక్కి తోయటం, భుజాలు పట్టుకుని ఊపేయటం చేసారట. ఇంత వరకూ వచ్చాక ఏదో చెయ్యక తప్పదని అర్ధమయ్యింది. 
(సశేషం)

నాకు తెలిసిన చాలా మంది  నాతొ పాటు కొవ్వొత్తుల నిరసనలకీ ఇంకా అటువంటి కార్యక్రమాలకీ వచ్చే స్నేహితులనీ సహచరులనీ ఇంటికి పిలిచాను. ఒక్కొక్కరూ వచ్చి కూర్చుంటుంటే పలకరిస్తూ అందరూ పూర్తిగా వచ్చేవరకూ అసహనంగా తిరుగుతూ ఆలోచిస్తున్నాను. మినూ కి పార్టీ అండదండలున్నాయి. పోలీసులు ఎంత సహాయం చేయగలరో వశిష్ట నుంచి అర్ధం చేసుకున్నాను. కానీ నా సహచరులు ఇంత వరకూ ఎన్నో అన్యాయాల్ని ఆవేశంగా ఎదిరించారు కనుక వీరి సహాయంతో ముందుకు వెళదామని అనుకున్నానుఅనుకున్నాను. 

ఒక్కొక్కరూ వస్తుంటే కూర్చోమని చెప్తున్నాను గానీ ఏమీ మాట్లాడలేదు. అందరూ వచ్చారని నిర్ధారించుకున్నాక అప్పుడు ప్రారంభించాను. ఈ సమస్య ఎలా మొదలయ్యిందో శేఖర్ తో కలిసి ఇంతవరకూ నేనేం చేసానో చెప్పాను. నేను చెప్తున్నంత సేపూ వారందరూ నిశ్సబ్దంగా ఉన్నారు. రాజేంద్ర ఏమి చెప్పాడో జి ఎం కార్యాలయం లో ఫిర్యాదు ఇచ్చాక ఏం జరిగిందో పూర్తిగా చెప్పిన తర్వాత ఆగాను. 

కాసేపు అందరూ నిశ్సబ్దంగా ఉండిపోయారు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలా వీళ్ళు ఏవిధంగా సహాయ చెయ్యచ్చు అని ఆలోచిస్తుంటే మొహంతి లేచి ముందుకు వచ్చాడు. 

'గురూ ఈ గందరగోళం లోకి ఎందుకు వెళ్లావు? ఆలోచించకుండా ఇంత వరకూ దూసుకు పోయి ఇప్పుడు ఎటువంటి పరిస్తితి కి తీసుకోచ్చావంటే మా అందరి కుటుంబాలూ నీతో పాటు సమస్యల్లో ఇరుక్కుంటారు' అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. మొహంతేనా ఇలా అంటున్నది? మొన్నటి నిరసన ప్రారంభం లో అతని ఆవేశపూరితమైన ఉపన్యాసం గురించి అందరూ కథలు కథలు గా చెప్పుకున్నారు. 

'నువ్వేమన్నా రాబిన్  హుడ్ అనుకుంటున్నావా? నువ్వేం చెయ్యాలనుకున్నా ఇంకెక్కడో చేసుకో. ఈ కోలనీ వరకూ సమస్యలు తీసుకు రాకు' అన్నాడు మురళి. కొవ్వొత్తుల నిరసనలో కెమెరా కి బాగా కనపడేలా అందరికన్నా ముందు రొమ్ము విరుచుకుని నడిచింది వీడే. ఆ తర్వాత తర్వాత వీడియోలూ ఫొటోలూ ఇప్పటి కీ అన్ని సోషల్ గ్రూప్ లకీ పంపిస్తున్నది కూడా వీడే. ఇంతవరకూ బెంగాలీ వాళ్ళు వాళ్లలో  వాళ్లు కలిసిపోయి నాకు సాయం చేయటం లేదనుకున్నాను కానీ ఇప్పుడు ఒరియా వాళ్ళూ తెలుగు వాళ్ళూ ఇంతవరకూ ప్రతి నిరసనోద్యమానికీ ముందరే నుంచుని ఫోటోలు తీయించుకున్న వాళ్ళూ కూడా నాకు తోడుగా రాకుండా పైగా నన్నే ప్రశ్నిస్తుంటే నేను నమ్మలేక వాళ్ళ మాటలు వినసాగాను. ఇంత జరిగినా కొంతమందైనా నావైపు ఉంటారనే ఆశతో చూస్తుంటే 

'నువ్వింత తపించిపోతున్నావంటే ఆ శేఖర్ మీ ఆంద్ర రాష్ట్రం వాడనేనా? ఇదే విధంగా మిగిలిన వాళ్ళకోసం ఏమైనా చేస్తావా? మేము మాత్రం మాకేమీ సంబంధం లేకపోయినా నీ వెనకే వచ్చి తన్నులు తినాలా? ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వున్నది వంగదేశం లో. ఆంధ్రా లో కాదు' అన్నాడు చటర్జీ. చాలా నిశ్సబ్దంగా మినూ ని  తన సాటి వంగ దేశస్తుడిగా భావిస్తూ పరోక్షంగా మద్దతు ఇస్తున్నాడు. మిగతా చాలామంది మాట్లాడటం లేదు గానీఈ  ముగ్గురూ మాట్లాడినది వారికి సబబు గానీ అనిపించినట్టు ఉంది. ఒకరిద్దరు జాలిగా చూసారని నేననుకున్నానేమో.

అందరూ ఎప్పుడు వెళ్ళిపోయారో  కూడా తెలియలేదు. నిస్పృహ తో అలాగే చాలా సేపు కూర్చున్నాను. వీరంతా వెనకుంటారని నేనెంతో నమ్మకంగా ఉంటె ఈ అనుభవంతో నేను వంటరి వాడినని అర్ధమయింది. ఈ పోరాటంలో మినూ మనుషులు కనక నన్ను చంపేస్తే వీళ్లంతా మళ్ళీ కొవ్వొత్తులు పట్టుకుని రోడ్డు మీద పడతారా? అంత సంక్లిష్ట పరిస్థితిలో కూడా నవ్వొచ్చింది. ఖచ్చితంగా కొవ్వొత్తులు పట్టుకుంటారు. ఫోటోలు తీయించుకుంటారు. పేస్ బుక్ లోనూ ట్విట్టర్ లోనూ ఇవన్నీ పోస్ట్ చేస్తారు. రెండు రోజుల తర్వాత మర్చిపోతారు. 

రాత్రి నిద్ర పట్టలేదు. ఏచప్పుడైనా మినూ మనుషులు వచ్చారేమో నని భయం.

మర్నాడు నేను పనికి వెళ్ళగానే రాజేంద్ర పిలిచాడు. అతని ఎదురుగా బల్ల మీద నేను జి ఎం కి పంపించిన కంప్లెయింట్ కాపీ  ఉంది. ఒక్క క్షణం నా గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభించింది. ఇతని దగ్గరికి ఎలా వచ్చింది? 

'ఏం దిలీప్! నాకు తెలియకుండా హీరో అయిపోదామనుకున్నావా?నాకు తెలియకుండా నా పై పై అధికార్లతో మాట్లాడేసుకుందామనుకున్నావా ? అది సాధ్యమే అనుకున్నావా? ఇప్పుడే చెప్తున్నాను. నా దగ్గర ఇక పని చెయ్యటానికి వీల్లేదు. వేరే ఉద్యోగం త్వరగా చూసుకుంటావో లేక శేఖర్ దగ్గర చేరతావో నీ ఇష్టం. గెట్ అవుట్!' అన్నాడు.

ఇంక మాట్లాడటానికేమీ లేదు. ఈ దారిలో వెళ్ళే ముందే ఇటువంటి సంఘర్షణ జరగచ్చని నాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఏమి చెప్పినా ఫలితం ఉండదు. నాకు చెప్పాలని కూడా అనిపించలేదు. 

అయినా వెళ్ళబోతూ  వెనక్కి తిరిగి ఒక్క మాట అన్నాను 'రాజేంద్రా! మిమ్మల్ని దాటవేసి జి ఎం దగ్గరికి పరిష్కారం కోసం వెళ్ళటం ప్రొటోకాల్ (పద్దతి) ప్రకారం తప్పే. కానీ వెళ్ళింది నా ప్రమోషన్ కోసమో జీతం పెంచుకోవటం కోసమో అయితే కాదు. ఒక మనిషి తన తప్పు లేకుండా బలయిపోతుంటే ఒక హోదా లో ఉన్న ఉద్యోగస్తుడిగా సహాయం చెయ్యగలనేమో అనుకున్నాను. ఈ విషయం మీరు ఎప్పటికైనా అర్ధం చేసుకుంటే సంతోషిస్తాను'

గదిలోంచి బైటికి వచ్చాను. 

ఇంకో పది నిముషాలలో ప్రతినెలా జరిగే ముఖ్యమైన సమావేశానికి హాజరు కావాలని గుర్తుకొచ్చి అటువైపు నడిచాను. నేనింకా లోపలకి వచ్చేలోపు రవి జ్యోతిశ్వర్ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. 
'సరిగ్గా వినండి. ఐ యాం వెరీ సీరియస్ ! ఈ సమావేశాలకి దిలీప్ ని ఎత్తి పరిస్థితుల్లోనూ రానివ్వద్దు. వాడు వస్తే నేను మీటింగ్ లో ఉండను' అంటున్నాడు. ఎంత గట్టిగా అంటున్నాడూ అంటే రాజేంద్ర పట్ల అతని విధేయత అక్కడికి ఇరవై అడుగుల దూరంలో సౌండ్ ప్రూఫ్ గదిలో కూర్చున్న రాజేంద్ర కి స్పష్టంగా వినపడేటంత.

ఇంతలో 'ఈరోజు సమావేశానికి ఆయనే ముఖ్యం. కాంట్రాక్టు రిస్క్ మేనేజ్ మెంట్ గురించి ఆయన మాట్లాడాలి కదా? ' అని మీటింగ్ లో ఉన్న ఎవరో అంటుంటే 'ఏమీ అవసరం లేదు. అతని ముఖం చూడదలచుకోలేదు' అని గొంతు పగిలిపోతుందేమో అన్నంత గట్టిగా అరిచాడు రవి. బహుశా రాజేంద్ర కి వినపడక పోవటానికి ఏ అవకాశమూ ఇవ్వదలచుకోలేదేమో. రాజేంద్ర కి వినపడకపోయినా వరండాలో ఉన్న వారు గానే మీటింగ్ లో ఉన్నవారు గానీ తర్వాత రాజేంద్ర రూమ్ కి వెళ్లి "రవి మీగురించి ఎంత ఎమోషనల్ అయిపోయాడా తెలుసా సార్!!!" అని వీడి అద్భుతమైన స్వామి భక్తి గురించి చెప్తారని అతని నమ్మకం. కానీ బూట్లు నాకే మనుషులందరికీ వాళ్ళకోసం నాలుకలు తడి చేసుకోవటానికే టైం లేనప్పుడు వీడి గురించి చెప్పటానికి వాళ్ళకి తీరికెక్కడ?

నేను తలుపు దగ్గరే నిలబడి ఇబ్బంది గా చూస్తున్న సహచరులతో 'నేనింకా ఉద్యోగం లో ఉన్నాను. ఈ మీటింగ్ లో కూర్చోవటానికి నాకింకా హక్కూ బాధ్యతా ఉన్నాయి. కానీ నాతొ పాటు కొంచెం సేపు కూర్చోవటం వలన మీకు వస్తాయనుకునే ఇబ్బందుల్లో మిమ్మల్ని ఇరికించటం నాకూ ఇష్టం లేదు' అన్నాను. ఎవరూ మాట్లాడలేదు.  నేను అక్కడనుంచి సాధ్యమైనంత తొందరగా వెళ్లిపోవటమే మంచిదనే భావం వాళ్ళందరి ముఖాలలో కనిపిస్తోంది. నేను వెనుతిరిగి నెమ్మదిగా వెళ్తుంటే 'దిలీప్!' అని వినపడి వెనక్ చూసాను.

కిరణ్!

'ఓహ్ కనీశం ఒక్క మనిషి నా మీద సానుభూతి చూపిస్తున్నాడ న్న మాట' కిరణ్ నా వైపు వస్తుంటే అనుకున్నాను. కిరణ్ నాకు దగ్గరగా వచ్చి 'దిలీప్!' అని నెమ్మదిగా లోగొంతుతో అన్నాడు. 

'చాలా ఊహించనిది జరిగింది. చాల దురదృష్టకరం కూడా. ' అన్నాడు కిరణ్. ఆ రెండు మాటలకే కొంచెం ఎమోషనల్ అయినా నేను 'కిరణ్! నువ్వొక్కడివే .... ' అని చెప్పబోతుంటే ఆపాడు కిరణ్. 

'కానీ జి ఎం దగ్గరికి వెళ్ళమని నేను నీకు సలహా ఇచ్చినట్టూ ఆ భరోశా తో నువ్వు జి ఎం కి కంప్లైంట్ చేసినట్టూ ఎవరితోనూ చర్చించటం అవసరం లేదేమో కదా' ఇబ్బందిగా చాలా లోగొంతు తో అన్నాడు. 


నేను ఆశ్చర్యం గా చూస్తుంటే 'ఈ విషయం నువ్వు చెప్పటం వలన ఏప్రయోజనమూ లేకపోగా నేను  ఇరుక్కుంటాను' అన్నాడు కిరణ్ దీనంగా. 


ఈసారి నేను ఆశ్చర్యపోలేదు. అనుకోకుండా ఒక చిరునవ్వు నా ముఖం లో వెలిగింది. 
' నీకర్ధమయ్యిందనుకుంటాను' చమట తుడుచుకుంటూ అన్నాడు కిరణ్. 

'కంగారు పడకు కిరణ్. మరొకడికి జరిగే హాని నాకు మేలు చెయ్యదు. నువ్వు నిశ్చింతగా ఉండు.  ఇంతవరకూ నేనేమనుకున్నానో నాకు తెలియదు గానీ ఇప్పుడు ఇప్పుడు మనసు చాలా స్పష్టంగా ఉంది. ఉద్యోగం వదిలే లోపల నేను చెయ్యవలసిన పని ఒకటే ఉంది.ఆ పని చెయ్యకుండా వదలటం ఇప్పుడు నాకు ఎట్టి పరిస్థితులలో కుదరదు కూడా ' అని వేగంగా బైటికి నడిచాను. 

ఇంతవరకూ లేనిది నా లో ఏదో ఆవేశం చెలరేగింది. బహుశా ఒక రకమైన తెగింపు ఎదో తెలియని కసి నన్ను ప్రేరేపిస్తున్నాయి. అంతకు ముందు శేఖర్ తో కలిసిఈ సమస్య పరిష్కారం కోసం నేను చేసిన రకరకాల ప్రయత్నాలలో ఎంత చిత్తశుద్ధి ఉందొ కానీ మొదటిసారి హృదయపూర్వకంగా అంతిమ పరిష్కారం కోసం జి ఎం కార్యాలయం బైట కూర్చున్నాను. ఆయన తో మాట్లాడటానికి సమయం అడిగితె జి ఎం ఉన్నత సలహాదారుడు రామచంద్ర చెప్పాడు 'ఈరోజు ఒక్క క్షణం కూడా ఆయనకి తీరిక లేదు'

ఏ సమాధానం నేను ఊహించనదే. జీఎం అపాయింట్మెంట్  లేకుండా ఎవరితోనూ మాట్లాడారు 

'పరవాలేదు. నేనిక్కడే వేచి ఉంటాను. నాకు కేవలం పది నిముషాలు కావాలి' అని రామచంద్ర తో స్పష్టంగా చెప్పాను. 
రామచంద్ర కి జరిగింది అంతా తెలుసు. (ఇలాంటి విషయాలు కాంతి కన్నా వేగంగా తెలుస్తాయి.) నావైపు జాలిగా చూస్తూ వెళ్ళిపోయాడు. కనీసం నన్ను గెంటేయలేదు అందుకు సంతోషం.

ఎవరెవరో జి ఎం ని కలవటానికి వస్తున్నారు. నిజంగానే ఆయనకి ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు. నేను భోజనానికి కూడా వెళ్ళకుండా అక్కడే కూర్చుండిపోయాను. అతిధులు లోపల సమావేశం లో ఉండగానే జి ఎం గది లోకి భోజనం వెళ్ళటం చూసాను. అంత తీరిక లేకుండా ఉన్నారన్న మాట. భోజనం లేక నాకు చాలా నీరసం గా ఉంది. అయినా కదలకుండా మంచి నీళ్లు కూడా తాగకుండా కూర్చుంటే మధ్యాహ్నం మూడు గంటలకి రామచంద్ర నా దగరికి నెమ్మదిగా వచ్చాడు.


'దిలీప్ గారూ! ఒక మీటింగ్ 15 నిముషాలు ఆలశ్యం అయ్యింది. నేను జి ఎం తో మాట్లాడాను. ఈ విలువైన సమయం వృధా చెయ్యకుండా చెప్పవలసినది చెప్పండి'

అతని  వైపు ఎంతో కృతజ్ఞత తో చూసాను. ఈ మాత్రం సహాయం ఆ సమయం లో లేకపోతె ఇంత ఉన్నతాధికారి ని కలవటం అసాధ్యం. మంచి పని కోసం ప్రయతిస్తే ఎంత మంది ప్రతిఘటించినా కొందరు రామచంద్ర లుంటారు. 

క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలి వెళ్లాను.
అది మల్లీశ్వరి సినిమాలో రాణి గారి భవనం లో వెంకటేష్ భోజనం చేసిన గదిలా ఉంది.  అక్కడిలాగే ఒక పొడవాటి బల్లా ఆ చివర జి ఎం కూర్చుని ఉన్నారు. ఆయన వేషభాషలు చూసి సర్దార్జీ అని ఎవరైనా గుర్తిస్తారు. చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడని అతనికి పేరుంది. 

'బోలో యార్' (చెప్పు) అన్నారు. ఇలా చాలా సరళం గా ఏమాత్రం అధికారం చూపించకుండా మాట్లాడటం కూడా అతని పద్దతి. 

'నా కంప్లైంట్ లో వ్రాసినట్టు ఈ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ చాలా చిన్న వ్యాపారస్తుడండీ. తనవారికీ మినూ మనుషులకీ కూడా డబ్బులిచ్చుకుని పని చెయ్యలేడు. మినూ చేస్తున్న పని దారుణం. శేఖర్ ని తన మనుషులతో బెదిరించాడట. '


'ఇందులో నీ ఆసక్తి ఏమిటి? ఆంధ్రా వాడనా?' పచ్చిగా అడిగాడు జి ఎం. 

కానీ నేనేమీ అనుకోలేదు ఎందుకంటే ఈ ప్రశ్న ఇంతకూ ముందు వరకూ చాలా మంది తెలివైన వాళ్ళూ వ్యవహార కర్తలూ అడుగుతూనే ఉన్నారు. వాళ్లందరికన్నా ఈయన నయం. ఎందుకంటే వాళ్ళలా ఉచిత సలహాలివ్వకుండా ఈయన నాకు పరిష్కారంచూపించగలరు. 

'అతను ఆంధ్రా వాడు అయి ఉండచ్చు సర్. కానీ ఇక్కడ విషయమేమిటంటే గత సంవత్సరం వరకూ మన గణాంకాలు చూస్తె మన విదుత్కేంద్రం వంగ దేశానికి అవసరమైన విద్యుత్తులో అరవై శాతం సరఫరా చేస్తోంది. అందుకు గాను ఈ వంగదేశానికి ఆంధ్రా నుంచే కాక ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వారు పని చేస్తేనే ఈ కేంద్రం నడుస్తోంది. వంగ దేశానికి చెందిన స్తానికులు ఇక్కడ ఎంత తక్కువ పని చేస్తున్నారో ఆ మాటకొస్తే ఎంత  పని చెయ్యటం లేదో మీకు తెలుసు మాకూ తెలుసు'

గుక్క తిప్పుకోవటానికి ఆగి 'మేమంతా దేశవ్యాప్తంగా జరిగిన ఎంపిక లో ఈ సంస్థ లో చేరాం తప్ప వంగదేశం లో పనిచేయాలని మేము ఎప్పుడూ కలలు గనలేదు. ఏరోజుమా లాంటి ఇతర రాష్ట్రాల వాళ్ళంతా ఇక్కడి వ్యవహారాలతో విసిగి ఇక్కడ్నుంచి వెళ్లిపోతారో ఆ రోజు ఈ కర్మాగారం ఖచ్చితంగా మూతపడుతుంది' అని ఆవేశంగా చెప్పాను. 

చెప్పిన తర్వాత నేనేనా మాటాడింది? అని ఆశ్చర్య పడ్డాను.
జి ఎం నవ్వుతూ అడిగాడు 'ఇదేమైనా బెదిరింపా?'
'కానే కాదు సర్ ! నా ఆసక్తి అంతా ఇతని పని ఆగక పోవటమే.ఎందుకంటే అది నాపని కూడా' ఆసక్తి అన్న పదం నొక్కి చెప్తూ అన్నాను.
'అతను పని చేస్తేనే నా పని అయ్యేది' మళ్ళీ చెప్పాను. 

జి ఎం ఇంక ఎక్కువ మాట్లాడకుండా గంట మోగించాడు. వెంటనే లోపలికి వచ్చిన తన కార్యదర్శి కి ఏదో ఆదేశం చదివి చెప్పాడు. నాకు కొంచెం వినపడింది కొంచెం వినపడలేదు.
'మీ పార్టీ వాళ్ళమని చెప్పుకునే వారు ఇక్కడ పనులకి ఆటంకం సృష్టిస్తున్నారు.........  పై రాష్ట్రాల వాళ్ళు భయపడితే ఇక్కడ పనులు మానుకుని ప్లాంట్ మూసేయవలసి రావచ్చు  ......... ఇక్కడ పని చేసేది వాళ్ళేనండీ ..........' కొంచెం కొంచెం వినపడింది. 
కార్యదర్శి రాసుకుని వెళ్ళాడు.
'నీ పని చూస్తా నోయ్' అన్నాడు జి ఎం

'ఎలా చేస్తారు సార్?' అనుమానం తో అడిగాను. వశిస్ట్ చెప్పినట్టు చెప్పాడా అనిపించింది. కానీ ఇంతసేపు కూర్చున్నాక ఆయన తో మాటాడాలంటే భయం కూడా పోయింది. 

'అరే యార్ !చేస్తాన్నాక నీ అనుమానమేమిటి?' కొంచెం కోపంగా అన్నాడు జి ఎం. 
సంశయం గా ఉన్న నా ముఖం చూసి 'ఈ బెంగాలీ వాళ్ళు విపరీతంగా ఆలోచించి ఒక్క పని కూడా చెయ్యరు. సర్దార్జీ లు ముందు పని చేసి ఆ తర్వాత ఆలోచిస్తారు. ఇంక నువ్వు నిర్భయం గా వెళ్ళచ్చు'


అయోమయంగా బైటికి వచ్చాను. నేను వెళ్లిపోతుంటే రామచంద్ర నవ్వాడు. అందులో ఏదో సంకేతం కనపడింది. ఈ పని అవుతుందా?
తర్వాత జరిగినదంతా ఆ సంస్థలో మా ప్లాంట్ లో కథలు కథలు గా చెప్పుకోనేలాగే జరిగింది.
జి ఎం ఇచ్చిన సందేశం ఎవరికో కాదు. వంగదేశపు ముఖ్యమంత్రి ని ఉద్దేశించి!!!
తర్వాత.... : 

  • మెరుపువేగంతో వశిష్ట కి ముఖ్యమంత్రి నుంచి లైటెనింగ్ కాల్ లో సందేశం వచ్చింది.
  • మినూ తో సహా రౌడీ వెధవలందరికీ కఠిన కారాగారం అమలు పరిచారు (అమలు పరచాల్సి వచ్చింది)
  • విద్యుత్కేంద్రం లో మినూగానీ వాడి తొత్తులు గానీ అడుగు పెట్టనివ్వకుండా తీవ్రమైన చర్యల కి ఆదేశాలు వచ్చాయి

అన్నీ రెండు రోజుల వ్యవధిలో జరిగాయి. 
చంద్ర శేఖర్ దారిలో కనిపిస్తే మినూ నమస్తే అన్నా అంటూ మర్యాదగా తప్పుకుంటున్నాడు. శేఖర్ ఇప్పుడు ఒక హీరో. అందులో తప్పేముంది?

కానీ ఏ ఎండకా గొడుగు పట్టే రవి జ్యోతిస్వర్లూ, వెన్నెముక లేని రశ్మి మహంతులూ, మురళీధర్ రెడ్లూ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా స్థానిక రాజకీయాలు చేసే చటర్జీలూ కనిపిస్తూనే ఉన్నారు. పరిస్తితులు మారగానే వారు ఏమీ జరగనట్టు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. 

ఈ అనుభవంతో కొవ్వొత్తి ప్రవ్రుత్తి కి మాత్రం ఆ సంఘటన తర్వాత స్వస్తి పలికాను. 

న్యాయం కోసం పోరాడే సత్యేంద్ర దుబేలూ , చంద్ర శేఖర్ లూ , అటువంటి వారిని కాపాడగలిగే మా జి ఎం లాంటి నాయకులు ఎందఱో మన చుట్టూ ఉన్నారు. వారి పోరాటం లో పాలు పంచుకోకుండా అటువంటి వారిని చావనిచ్చి తర్వాత కొవ్వొత్తులు పట్టుకుని తిరగటం పైగా అవన్నీ ఫోటోలలో బానర్లలో పెట్టుకుని లాభం పొందటం ఎంత అమానుషం? చేయగలిగితే  బతికుండగానే వారికి చేయుతనివ్వటమే ఇప్పటి నా ధ్యేయం. ఇందుకు సాయం వచ్చేవారు వేరే వారు ఉన్నారు. ముందుకెళ్లకొద్దీ ఇంకా ఇంకా తోడుగా వచ్చి వారు కలుస్తారు. 


నిజమైన కర్తవ్యం ఏమిటో తెలిసింది. 

(పేర్లతో పాటు కథ గా రూపు దిద్దటానికి అతి కొంచెం కల్పన కలపటం జరిగినా ఇది దాదాపు నిజంగా బెంగాల్ లో జరిగిన కథ ఆధారంగా వ్రాయ బడినది)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఓ తమ్ముడి కథ

MAY 1994 - RACHANA TELUGU MAGAZINE " ఏం బాబూ నువ్వు దిగవలసినది కొవ్వురేనా? "  ఆలోచనల్లో ఉన్న కిట్టూ జవాబివ్వలేదు . "ఏవయ్యోవ్ నిన్నే" - అతన్ని కదిపింది ముసలావిడ . అప్పుడు తెలివి తెచ్చుకుని ఏమిటన్నట్టు చూసాడు కిట్టూ .  "నువ్వు కొవ్వూరులో దిగాలన్నావా లేదా? "  "అవునండి" "మరి కొవ్వూర్లో రైలాగి ఇంతసేపయింది . ఎమాలోచిన్స్తున్నావ్ ?" "ఆ! కొవ్వురోచ్చేసిండా?" అంటూ గబగబా రైలు దిగాడు కిట్టూ .  "ఇదిగో నీ సంచీ మరిచిపోయావు ." అని అందించిన్దావిడ కిటికీలోంచి . కిట్టూ సంచీ తీసుకుని ముందుకి నడవబోతూ రైలు పెట్టేలన్నింట్లో తొంగి చూస్తూ వస్తున్న సూర్యాన్ని చూసాడు .  వెంటనే "నమస్కారం బావగారూ" అన్నాడు .  కిట్టూ కోసం వెతుకుతూ దిక్కులు చూస్తున్న సూర్యం కిట్టూని చూడగానే, "అమ్మయ్య వచ్చేసావా! మొదటిసారి నువ్వొక్కడివే రైల్లో వస్తున్నావని నీ అక్క తెగ కంగారు పెట్టేసింది . ప్రయాణం బాగా జరిగిందా? తిండి సరిగా తిన్నావా?" అన్నాడు .  తలాడించాడు కిట్టూ  "పద మనిల్లు స్టేషన్ దగ్గిరే . హాయిగా కబుర్లు చెప్...

నమ్మకం అనే అలవాటు

"నమ్మకం మనందరికీ అవసరమైన అలవాటు" అన్నారు నాన్న.  ఈమధ్యనే నాన్న మాతో కొంచెం మాట్లాడుతున్నారు. నేనూ తమ్ముడు శ్యామూ అందుకని ఎంతో ఉత్సాహపడిపోయినా అప్పుడప్పుడు నాన్న చెప్పే విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి.  మనుషులందరినీ మొదటే ఎలా నమ్మేస్తాం? నా ముఖం చూసి భావాలు అర్ధం చేసుకున్న నాన్న "మనుషులని నమ్మితే వచ్చే ఇబ్బందేమిటో చెప్పరా"  అని అడిగారు.  "వాళ్ళు మనకి పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు మోసగాళ్లు అయ్యే అవకాశం ఉంది" అన్నాను భయం గానే.  "సరే! నమ్మకపోతే మానని ఎవరూ మోసం చెయ్యరా?" నేను ఒక క్షణం ఆలోచించి "అయినా మోసం చెయ్యచ్చు. కానీ అవకాశం కొంత మందికే" అన్నాను.  "ఆ కొంత మంది ఎవరో తెలుసా?"  "ఎలా తెలుస్తుంది?"  "...." "మీ నంభావనీయతా శాస్త్రం ప్రకారం ఏ ప్రయత్నానికైనా ఫలితాలు రెండే జరిగే అవకాశం ఉన్నపుడు ఒక్కొక్క ఫలితానికి అవకాశం యాభై శాతం ఉంటుంది. అంటే నమ్మి మోసపోవటానికీ నమ్మకపోయినా మోసపోవటానికీ అవకాశాలు సమానం. అటువంటపుడు నమ్మితేనే మంచిది కదా! ఎవరినీ నమ్మకపోవటం ద్వారా మనం నిజాయితీ పరులని అవమానిస్తున్నాం. అయినా మోసపోతున్నా...

ఆరాధన

ఆరాధన  రచన జనవరి 2014 లో ప్రచురింపబడింది  ఆరాధన  గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. దిలీప్ తలెత్తి చూసాడు .అప్పటికి తన సహోద్యోగులంతా వచ్చి ఉన్నారు. ప్రతి రోజూ ఇలాగే వస్తారు. కానీ ఇక్కడ అందరూ హాజరు కావాలని నియమం లేదు. అసలు రోజూ హాజరు ఇవ్వవలసిన పని లేనే లేదు. సాంకేతికంగా అనుకూలించటం వలన వారు ఈ పనులు ఎక్కడినుంచయినా పని చేసుకోవచ్చు. అంతా నమ్మకం మీద నడుస్తుంది. పని ఎంత జరిగింది అన్నది ముఖ్యం. ఎన్ని గంటలు పని లో కూర్చున్నారు అని కాదు. అతను అతని సహధ్యాయులూ అందరూ ఒకే పెద్ద గది లో కూర్చుంటారు. కేవలం పొద్దున్న ఒక రెండు గంటలు దిలీప్ తన కోసం కేటాయించిన చిన్న గది లో ఏమైయినా సున్నితమైన విషయాలు నిర్వహించటానికి కూర్చుంటాడు. ఎనిమిది గంటల తర్వాత నుండి ఆ గది తలుపు మీద "walk in" అని రాసి ఉంటుంది. అంటే ఎవరైనా ముందస్తు గా అనుమతి తీసుకోక పోయినా రావచ్చు. ఆ తర్వాత దిలీప్ పెద్ద గది లో కూర్చుని సహాధ్యాయులతో పని చేసుకుంటాడు.  "స్నేహమంటే రోజు సరదా గా కలిసి కాఫీ తాగటం కాదు. అవసరమైనప్పుడు పక్కన ఉండాలి"  చటుక్కున తలఎత్తాడు దిలీప్. బోధిసత్వ కార్యాలయం లో ఉద్యోగస్తులు టీవీ చూస్తున్నారు....